
- వర్గీకరణ మేం చేస్తే మందకృష్ణ మాత్రం మోదీని నమ్ముతుండు
- బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడా చేయలేదు.. మేం చిత్తశుద్ధితో బిల్లు పాస్ చేసినం
- 30 ఏండ్ల వర్గీకరణ ఇష్యూకు పరిష్కారం చూపినం
- ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గలేదు
- ఇక నోటిఫికేషన్లు వస్తయ్.. నిరుద్యోగులు ప్రిపేర్ కావాలని సూచన
- ముఖ్యమంత్రిని సన్మానించిన ఎస్సీ సంఘాల నేతలు
హైదరాబాద్, వెలుగు: ముప్పై ఏండ్లుగా నలుగుతున్న ఎస్సీ వర్గీకరణ ఇష్యూకు తమ ప్రజా ప్రభుత్వం పరిష్కారం చూపిందని, ఇచ్చిన మాటకు కట్టుబడి బిల్లును పాస్ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణను తాము చేస్తే మంద కృష్ణనేమో మోదీ, కిషన్‌రెడ్డిని నమ్ముతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘మంద కృష్ణతోటి నాకు ఎలాంటి విభేదాల్లేవ్. ఆయన నాకు మంచి మిత్రుడు. ఎస్సీ వర్గీకరణ మేం చేస్తే.. ఆయన మాత్రం నాకంటే కిషన్‌రెడ్డిని, మోదీని ఎక్కువగా నమ్ముతుండు. వాళ్ల (బీజేపీ) ప్రభుత్వాలు ఉన్న చోట ఎక్కడ కూడా వర్గీకరణను అమలు చేయలేదు.
కానీ, ఇక్కడ అమలు చేస్తున్నం” అని తెలిపారు. ఎట్లన్న న్యాయం చేయాలన్న పట్టుదలతోటి క్రమపద్ధతిలో బిల్లును పాస్ చేసుకున్నామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదని, ఏండ్లుగా జరిగిన అన్యాయ్యాన్ని సరిదిద్దటానికే చేపట్టామని ఆయన వివరించారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనకు మాదిగలు అండగా ఉన్నారని తెలిపారు. బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్ లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఎస్సీ సంఘాల నేతలు సీఎం రేవంత్‌ను ఘనంగా సన్మానించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ అయినందుకు గాను కృతజ్ఞతలు తెలియజేశారు.
వర్గీకరణ సాధన కోసం అమరులైన కుటుంబ సభ్యులను సీఎం సన్మానించి.. అమరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014లో వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని తాను, ఎమ్మెల్యేలు సంపత్, సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేస్తే.. సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు పాస్ చేసుకున్నామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అయినా, బీసీ రిజర్వేషన్ల బిల్లులు అయినా తన ఘనత కాదని.. తమ కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఘనత అని ఆయన పేర్కొన్నారు.
ఉద్యోగాల కోసం ప్రిపేర్ కావాలి
వర్గీకరణ బిల్లుతో పని పూర్తి అయిందని కులాసాగా ఉండొద్దని, పిల్లలను కోచింగ్ సెంటర్లకు పంపి ఉద్యోగాలు సాధించేలా కృషి చేయాలని సీఎం రేవంత్ సూచించారు. “ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదించాం. ఎస్సీ వర్గీకరణ ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న అంశం. దీన్ని ఓ కొలిక్కి తేవాలని మేం అధికారంలోకి రాగానే నిర్ణయించాం. సుప్రీంకోర్టులో కేసు వాయిదాలు ఉంటే దామోదర రాజనర్సింహన్నను పిలిచి సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరిపి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాం.
సుప్రీంకోర్టు తీర్పు రాగానే.. చెప్పినట్టుగానే ప్రాసెస్ మొదలుపెట్టినం. కేబినెట్ సబ్ కమిటీని వేశాం. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమిమ్ అక్తర్ తో వన్ మ్యాన్ కమిషన్ వేశాం. అన్ని జిల్లాలు తిరిగి అందరి అభిప్రాయాలు తీసుకొని 199 పేజీల రిపోర్ట్ ఇచ్చారు” అని సీఎం గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ పదవులు భర్తీ చేసినా ఎస్సీలకు అవకాశం ఇస్తున్నానని.. ఎన్నికల కమిషనర్ , ఓయూ వీసీ, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్, విద్యా కమిషన్ చైర్మన్ పదవులు ఎస్సీలకు ఇచ్చామని తెలిపారు. వర్గీకరణ బిల్లు పాస్ అయినందున రాహుల్ గాంధీ కోసం విజయోత్సవ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని సీఎం కోరారు.
ఈ మీటింగ్‌తో ఇతర రాష్ట్రాల్లోనూ ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లు అమలయ్యేలా ఒత్తిడి తేవాలని సూచించారు. మంత్రులు దామోదర, పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేలు, కడియం శ్రీహరి, లక్ష్మీకాంతరావు, కవ్వంపల్లి సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, మాదిగ దండోరా నేత సతీశ్ మాదిగ, ఎస్సీ ఉప కులాల నేత బైరి వెంకటేశం మోచి తదితరులు పాల్గొన్నారు.
చరిత్రాత్మకం: పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు పాస్ కావడం చరిత్రాత్మకమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ రెండు అంశాలకు పరిష్కారం లభించటం చాలా సంతోషకరమని, ఈ రెండు వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కానుకని పేర్కొన్నారు. కాగా, అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పాసైన రోజు తమ వర్గానికి పండుగ రోజు అని విప్ అడ్లూరి లక్ష్మణ్ అన్నారు.