తెలంగాణలో గ్రామీణ రహదారులకు మహర్దశ రానున్నది. రూరల్ రోడ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. ఈ రహదారుల నిర్మాణానికి ఈ నెల నుంచి నెలకు రూ.150 కోట్ల చొప్పున జూన్ నెలాఖరు నాటికి రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లోని గ్రామాలకు సైతం రహదారులు నిర్మించాలని సూచించారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ రహదారులకు సంబంధించి సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
గత కాలంలోని ఎడ్ల బండ్లు, సైకిళ్లు, మోటార్ సైకిళ్ల రాకపోకలకు అనుగుణంగా సింగిల్ లైన్, డబుల్ లైన్ రోడ్ల వెడల్పును నిర్ణయించారని అన్నారు. ప్రస్తుతం మారుమూల పల్లెల్లోనూ కార్లు, ట్రాక్టర్లు, ఇతర భారీ వాహనాలు తిరుగుతున్నందున.. వాటి రాకపోకలకు వీలుగా ఆయా రహదారుల కొలతలను మార్చాల్సి ఉంటుందన్నారు. వాహనాలు ఆటంకాలు లేకుండా సాగిపోయేందుకు వీలుగా రహదారులను నిర్మించాలని చెప్పారు. గత సర్కారు హయాంలో తండాలు, గూడేలను పంచాయతీలు చేసినా వాటికి రహదారులు, పంచాయతీ, పాఠశాల భవనాల నిర్మాణాలను విస్మరించారని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రంలో ప్రతి పంచాయతీకి బీటీ రోడ్డు ఉండాలని ఆదేశించారు.
Also Read :- కేబినెట్ భేటీలో 18 అంశాలు అజెండా!
గ్రామాల నుంచి మండలాలకు సింగిల్ రోడ్లు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు కచ్చితంగా ఉండాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గుంతలు పడిన రహదారులకు వెంటనే మరమ్మతులు ప్రారంభించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ రహదారుల నిర్మాణ ప్రమాణాల్లో తేడాలు ఉన్నాయని, ఇక ముందు అలా ఉండడానికి వీల్లేదని సీఎం అన్నారు. రెండు శాఖల పరిధిలోని రోడ్లను ఒకే రకమైన నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని సూచించారు. వాహనదారులు తాము ప్రయాణించేది పీఆర్ రోడ్డా? ఆర్ అండ్ బీ రోడ్డా? అనే విషయాన్ని పట్టించుకోరని, కేవలం ప్రయాణం ఎలా సాగుతుందనేది ప్రధానమన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.