నేటి (సెప్టెంబర్ 5) నుంచి ఏఐ గ్లోబల్​ సమిట్​

నేటి (సెప్టెంబర్ 5) నుంచి ఏఐ గ్లోబల్​ సమిట్​
  • దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్​లో నిర్వహణ
  • ప్రారంభించనున్న సీఎం రేవంత్​, మంత్రి శ్రీధర్​బాబు
  • 25 అంశాల్లో ఏఐ వాడకంపై రాష్ట్ర సర్కార్​ రోడ్​ మ్యాప్
  • ​సమాజంపై ఏఐ ప్రభావం, నియంత్రణ, సవాళ్లపై సదస్సులో చర్చ
  • పాల్గొననున్న 2 వేల మందికిపైగా నిపుణులు

హైదరాబాద్​, వెలుగు : దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్(ఏఐ)​ సమిట్​జరగబోతున్నది. గురు, శుక్రవారాల్లో రెండు రోజుల పాటు హైదరాబాద్​ హెచ్​ఐసీసీ వేదికగా ఈ సదస్సును నిర్వహించనున్నారు. ‘ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేధ’ అనే థీమ్​తో నిర్వహించనున్న ఈ సమిట్​కు ప్రపంచం నలుమూలల నుంచి 2 వేల మందికిపైగా ఏఐ నిపుణులు హాజరుకానున్నారు. సీఎం రేవంత్​రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు  సదస్సును ప్రారంభిస్తారు. ఇదే సదస్సులో రాష్ట్రంలో ఏఐ అడాప్టేషన్​కు సంబంధించి రోడ్​మ్యాప్​ను సీఎం రేవంత్​ విడుదల చేస్తారు.

25 అంశాలతో రోడ్​ మ్యాప్​ను సిద్ధం చేశారు. కాగా, ఈ సదస్సులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్​ డెమోలు, అభివృద్ధి దశలో ఉన్న కొత్త ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు. సమాజంపై ఏఐ ప్రభావం, నియంత్రణ, సవాళ్లపై చర్చిస్తారు. ఏఐ సెక్టార్​లో పేరుపొందిన ఖాన్​ అకాడమీ అధినేత సల్​ఖాన్​, ఐబీఎం ప్రతినిధి డానియెలా కాంబ్​, ఎక్స్​ప్రైజ్​ ఫౌండర్​ పీటర్​ డయామండిస్​ తదితర ప్రముఖులు ఇందులో పాల్గొంటారు. 

ఈ ఈవెంట్​ కోసం ఒక ప్రధాన వేదికతో పాటు నాలుగు అదనపు వేదికలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా హైప్రొఫైల్​ ప్యానెల్​ డిస్కషన్స్​, ఇంటరాక్టివ్​ సెషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఏఐలో ప్రపంచ కంపెనీల దృష్టిని ఆకర్షించేందుకు తెలంగాణలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఫోర్త్​ సిటీలో భాగంగా 200 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.