- సీఎంగా చట్టం అమలు చేయాల్సిన బాధ్యత నాపై ఉంది
- టాలీవుడ్ పెద్దలతో సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి
- అసెంబ్లీలో చెప్పినట్లు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదు
- ఈవెంట్లకు ముందస్తు అనుమతులు ఉండాల్సిందే
- అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే
- సినీ సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ
- ఇండస్ట్రీ నుంచి కూడా ఓ కమిటీని వేసుకోవాలని సీఎం సూచన
- 15 రోజుల్లో సీఎంకు నివేదిక ఇస్తం: ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు
- సంధ్య థియేటర్ లాంటి ఘటనలు మళ్లీ జరగనివ్వం: అల్లు అరవింద్
- వరల్డ్ సినిమాకు హైదరాబాద్ క్యాపిటల్ కావాలి: నాగార్జున
హైదరాబాద్, వెలుగు: సినీ పరిశ్రమకు తాము వ్యతిరేకం కాదని, ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బెన్‌ఫిట్ షోలు, టికెట్ల రేటు పెంపు ఉండదంటూ అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉంటుందని, తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో దీనికి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. సినిమా ఈవెంట్లకు ముందస్తు అనుమతులు ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. టాలీవుడ్‌కు గతంలో ఏ సాయం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయని.. ఆ వారసత్వాన్ని తాము కొనసాగిస్తామని ఆయన తెలిపారు. గురువారం బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దలు సమావేశమయ్యారు.
ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీజీపీ జితేందర్, సినీ హీరోలు నాగార్జున, వెంకటేశ్,
డైరెక్టర్లు రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, హరీశ్‌శంకర్, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్, నిర్మాతలు అల్లు అరవింద్, మురళీమోహన్, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.సుమారు గంటన్నర పాటు మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
తెలుగు పరిశ్రమకు బ్రాండ్ క్రియేట్ చేస్తం
తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని, పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘సినీ రంగానికి హైదరాబాద్ కేంద్ర బిందువుగా ఉండేలా హాలీవుడ్, బాలీవుడ్ సైతం హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడుతాం. పరిశ్రమను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడమే మా ప్రభుత్వ లక్ష్యం. గంజాయి, డ్రగ్స్‌తో పాటు సోషల్ ఇష్యూస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సినీ పరిశ్రమ ప్రచారం చేయాలి” అని ఆయన సూచించారు.
గతంలో సినిమా పరిశ్రమకు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయని.. సినిమా స్టూడియోలకు స్థలాలు, నిర్మాణాలు, నివాస స్థలాలు, ఫిల్మ్ నగర్, చిత్రపురి కాలనీ, కార్మికులకు ఇండ్లు, ఇతర సౌకర్యాలు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయని అన్నారు. ఆ వారసత్వాన్ని తాము కొనసాగిస్తామని తెలిపారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ఉద్దేశమని చెప్పారు. “సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ఇండస్ట్రీ పెద్దలు మా దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తం.
ఇండస్ట్రీ నుంచి కూడా ఓ కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. అనుమానాలు, అపోహలు తొలగించుకోవడంతో పాటు సమస్యలు పరిష్కరించుకోవాలి. మా ప్రభుత్వం వచ్చాక ఎనిమిది సినిమాలకు స్పెషల్ జీవోలు ఇచ్చాం. పుష్ప మూవీ ఈవెంట్ కు పోలీస్ గ్రౌండ్ ఇచ్చాం. ఐటీ, ఫార్మాతో పాటు మాకు సినిమా పరిశ్రమ కూడా ముఖ్యమే. అందుకే ప్రభుత్వం, సినిమా పరిశ్రమ కు మధ్యవర్తిగా ఉండేందుకు దిల్ రాజును ఎఫ్ డీసీ చైర్మన్ గా నియమించాం. తెలంగాణలో సినీ అవార్డులు ఇవ్వటం లేదని తెలిసి గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం” అని ఆయన తెలిపారు.
ఎకో, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయండి
‘‘మీరు కూడా మీ వంతుగా తెలంగాణలోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని సినిమాల ద్వారా ప్రమోట్ చేయండి” అని సినీ పెద్దలకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ముంబైలో అనుకూల వాతావరణం కారణంగా బాలీవుడ్ అక్కడ స్థిరపడిందని, కాస్మోపాలిటన్ సిటీల్లో బెస్ట్ సిటీ అయిన హైదరాబాద్ లో అంతకన్నా మంచి వాతావరణం ఉందని తెలిపారు. అందుకే హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను హైదరాబాద్‌లో తీసేలా చర్యలు చేపడుతామని చెప్పారు. హైదరాబాద్ లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తామని వివరించారు. సమావేశంలో సినీ ప్రముఖులు జెమిని కిరణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కే ఎల్ నారాయణ, మైత్రి మూవీస్ నవీన్ ఎర్నేని, నాగవంశీ, సి కళ్యాణ్, బీవీఎస్ ఎన్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు.
అలాంటి ఘటనలు మళ్లీ జరగనివ్వం:అల్లు అరవింద్
ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ‘‘తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులకు ఇది శుభదినం. హైదరాబాద్ వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్ కావడానికి ప్రభుత్వానికి సహకరిస్తం. వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గా హైదరాబాద్ అవుతుంది” అని ఆయన పేర్కొన్నారు. సంధ్య థియేటర్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని సీఎంతో ఆయన చెప్పినట్లు సమాచారం.
ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగాలి: రాఘవేంద్రరావు
అందరూ సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని.. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటున్నదని డైరెక్టర్ రాఘవేంద్రరావు అన్నారు. దిల్ రాజును ఎఫ్ డీ సీ చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ‘‘తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్‌లు ఉన్నాయి. గతంలో చంద్రబాబు చిల్ట్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరుతున్నాం” అని ఆయన అన్నారు.
వరల్డ్ సినిమాకు హైదరాబాద్ క్యాపిటల్: నాగార్జున
వరల్డ్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్ కావాలన్నదే తమ కోరిక అని సినీ హీరో నాగార్జున అన్నారు. ‘‘యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ ఉండాలి. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది. పరిశ్రమను ప్రభుత్వం మరింత ప్రోత్సహించాలి” అని కోరారు.
సంధ్య థియేటర్ ఘటన బాధించింది: మురళీమోహన్
ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్‌డే ఉంటుంది. సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించింది” అని నిర్మాత, నటుడు మురళీమోహన్ అన్నారు. సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందని.. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నామని ఆయన తెలిపారు.
ప్రభుత్వం పూర్తి మద్దతు ఇచ్చింది: సురేశ్‌బాబు
‘‘హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది డ్రీమ్. ప్రభుత్వ సాయంతోనే ఆరోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్‌కు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు.. హైదరాబాద్ కేరాఫ్‌గా ఉండాలి. మర్రి చెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చింది” అని నిర్మాత సురేశ్‌బాబు అన్నారు. టాలీవుడ్‌కు పూర్తి మద్దతుగా ఉంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చిందని తెలిపారు. సంధ్య థియేటర్ ఘటనపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారని.. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని సీఎం తెలిపారని ఆయన అన్నారు.
అనుమతి నిరాకరిస్తే పాటించాల్సిందే: డీజీపీ
సినిమా ప్రమోషన్స్ సమయంలో పోలీసులు అనుమతి నిరాకరిస్తే, దానిని పాటించాలని.. పోలీసులు అన్ని రకాలుగా ఆలోచించే అనుమతి ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటారని డీజీపీ జితేందర్ అన్నారు. పోలీసుల నిర్ణయాన్ని టాలీవుడ్ పెద్దలు గౌరవించాలి. బౌన్సర్లను నియమించుకు న్నప్పుడు న్యాయ సమ్మతం ఉండాలి. ఇటీవల బౌన్సర్ల తీరు, ప్రవర్తన బాలేదు.. ఏ ఈవెంట్ అయినా ముందస్తు అనుమతులు తీసుకోవాలి” అని ఆయన సూచించారు.
బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు చిన్న ఇష్యూ: దిల్ రాజు
సినీ పరిశ్రమపై సీఎం రేవంత్‌రెడ్డి సానుకూ లంగా ఉన్నారని, ఐటీ, ఫార్మా రంగాలతో పాటు సినీ పరిశ్రమ కూడా అంతే కీలకమని సీఎం చెప్పారని ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజు అన్నారు. సీఎంతో మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోల గురించి మీడియా ప్రశ్నించగా.. అది చిన్న అంశమని అన్నారు. “బెనిఫిట్ షోలు, టికెట్ ధరల ప్రస్తావన రాలే దు. కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నా రు. బౌన్సర్ల విషయాన్ని డీజీపీ చెప్పారు. సామాజిక సేవా కార్యక్రమాలు, డ్రగ్స్ నిర్మూల నపై సినీ హీరోలు ప్రచారం చేయాలని సీఎం సూచించారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటన ల వల్ల ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి గ్యాప్ వచ్చింద నే అపోహ ఉంది. ఈ మీటింగ్‌తో అది సాల్వ్ అయింది” అని ఆయన పేర్కొన్నారు. ఇండస్ట్రీ లోని సమస్యలపై ప్రముఖులంతా సమావేశ మై ఒక నివేదిక రెడీ చేసి మరో 15 రోజుల్లో సీఎంకు అందజేస్తామని వెల్లడించారు.
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు కట్టేందుకు ఇండస్ట్రీ నుంచి సెస్ : డిప్యూటీ సీఎం భట్టి
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి సినీ పరిశ్రమ నుంచి కొంత సేస్ వసూలు చేయాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రైజింగ్ తెలంగాణ నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. సమగ్ర కుటుంబ సర్వే, డ్రగ్స్ వంటి కార్యక్రమాల్లో బాధ్యత పంచుకోవాలని సినీ ప్రముఖులకు సూచించారు. సినీ పరిశ్రమకు ఏదైనా మేలు జరిగిందంటే అది కాంగ్రెస్ పాలనలోనేనని గుర్తు చేశారు. రాష్ట్రంలో బడుగు, బలహీన, మైనారిటీ, దళిత, విద్యార్థుల కోసం ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని, నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల్లో సుమారు 200 కోట్ల పెట్టుబడితో ఈ పాఠశాలల నిర్మాణం జరుగుతుందని భట్టి వివరించారు.
దీనికోసం సినీ పరిశ్రమ నుంచి కొంత సెస్ రూపంలో ఆర్థిక వనరులు సమకూర్చాలని అనుకుంటున్నామని చెప్పారు. ఇందుకు సినీ పరిశ్రమ సహకరించాలని కోరారు. డ్రగ్స్ పై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించి, ప్రత్యేకంగా నార్కోటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేసిందన్నారు. సినీ నటుల ప్రచారం ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని.. కాబట్టి రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు సామాజిక బాధ్యతలో భాగంగా సినీ పరిశ్రమ పెద్ద ఎత్తున పాల్గొని, ప్రచారం చేయాలని భట్టి కోరారు.
సినిమాల్లోని కొత్త హీరోలంతా నా ముందు ఎదిగినవాళ్లే. ఎవరో ఒకరు నా పేరు మర్చిపోతే నేను ఫీలవుతానా? నేను అలాంటివాడ్ని కాదు. ఆ ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత ఇండస్ట్రీ ప్రముఖులపై ఉంది. అసెంబ్లీలో నేను చెప్పిన మాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది.
ఇకపై టికెట్ రేట్ల పెంపు ఉండదు. బెనిఫిట్ షోలకు పర్మిషన్ కూడా ఇవ్వం. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీపడం. బౌన్సర్లపైనా సీరియస్ గా ఉంటాం. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే.