- కేంద్ర మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్
- హైదరాబాద్ సీఎస్ఎంపీనిఅమృత్ 2.0లో చేర్చండి
- లేదంటే ప్రత్యేక ప్యాకేజీగాగుర్తించి, నిధులివ్వండి
- ఢిల్లీలో భేటీ అయి,ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పణ
న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్‌లో మెట్రో రెండో దశ విస్తరణకు సహకరించాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ కోరారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను సమర్పిస్తామని తెలిపారు. హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ (సీఎస్‌ఎంపీ) ను పూర్తి చేసేందుకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎస్‌ఎంపీని అమృత 2.0లో చేర్చి, ఆర్థిక సహకారం అందించాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులివ్వాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సీఎం రేవంత్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఆయన వెంట ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, సీఎం సెక్రటరీ వి.శేషాద్రి, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ సెక్రటరీ దాన కిశోర్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉన్నారు. హైదరాబాద్ నగరంలో పురాతన మురుగుశుద్ధి వ్యవస్థనే ఉందని, అది ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా లేదని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ఈ సందర్భంగా వివరించారు.
హైదరాబాద్ సమీప మున్సిపాలిటీల్లోనూ సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థ లేదని తెలిపారు. హైదరాబాద్‌లో ప్రజల జీవన ప్రమాణాలు ప్రపంచస్థాయి నగరాల్లోలాగా ఉండాలంటే నగరంతోపాటు సమీప మున్సిపాలిటీల్లో 100 శాతం ద్రవ వ్యర్థాలను శుద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తోపాటు సమీప 27 మున్సిపాలిటీలను కలుపుకొని 7,444 కిలోమీటర్ల మేర రూ.17,212.69 కోట్లతో రూపొందించిన సీఎస్ఎంపీ డీపీఆర్ ను ఖట్టర్‌కు సీఎం రేవంత్ అందజేశారు.
మూసీ సీవరేజీ ట్రీట్‌మెంట్‌ప్లాంట్ల డీపీఆర్ కూడా..
హైదరాబాద్ నగరంలో 55 కిలోమీటర్ల మేర మూసీ నది ప్రవహిస్తున్నదని, ఇరువైపులా కలిపి 110 కిలోమీటర్ల మేర నగరంలోని మురుగు అంతా మూసీలోనే చేరుతున్నదని కేంద్ర మంత్రి ఖట్టర్‌కు రేవంత్ రెడ్డి వివరించారు. ఇలా మురుగు మూసీలో చేరకుండా ఉండేందుకు ట్రంక్ సీవర్స్ మెయిన్స్, లార్జ్ సైజ్ బాక్స్ డ్రెయిన్స్, కొత్త సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి రూ.4 వేల కోట్లతో డీపీఆర్ రూపొందించినట్టు తెలిపారు. ఆ డీపీఆర్‌ను కూడా కేంద్ర మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సమర్పించారు. దాన్ని ఆమోదించడంతోపాటు పనుల అనుమతికి చొరవచూపాలని కేంద్ర మంత్రికి రిక్వెస్ట్ చేశారు.
మెట్రో ఫేజ్-2 కార్యరూపం దాల్చేలా చూడండి
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించి నాగోల్–శంషాబాద్– రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (36.8 కి.మీ.), రాయదుర్గం–-కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్–-చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియాపూర్–-పటాన్‌చెరు (13.4 కి.మీ.), ఎల్‌బీ నగర్-–హయత్ నగర్ (7.1 కి.మీ.) మొత్తం 76.4 కి.మీ. మేర డీపీఆర్‌లు పూర్తయినట్టు ఖట్టర్‌కు రేవంత్తెలిపారు. ఈ కారిడార్ల నిర్మాణానికి రూ.24,269 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశామని, దీనిని కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం 50:50 రేషియోలో జాయింట్ వెంచర్‌గా చేపట్టాలని భావిస్తున్నట్టు సీఎం తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను సమర్పిస్తామని, అది త్వరగా కార్యరూపం దాల్చేందుకు సహకరించాలని రేవంత్ కోరారు.
నేడు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి..మంగళవారం కాంగ్రెస్ పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు. ఇటీవలి పర్యటనలో కేవలం పార్టీ అధ్యక్షుడు ఖర్గేను కలిసి, పరామర్శించారు. అప్పుడు పార్టీ ముఖ్య నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ హర్యానా ఎన్నికల బిజీలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో కేవలం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో మాత్రమే భేటీ అయి, రాష్ట్రం లోని తాజా పరిస్థితులను వివరించారు. ఇప్పుడు హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగిస్తుందని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో అగ్రనేతలను రేవంత్ కలిసి, అభినందనలు తెలియజేసే అవకాశం ఉంది. అలాగే, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ పాలన తీరును వారికి వివరించనున్నారు. మధ్యాహ్నం తర్వాత సీఎం ఢిల్లీ పర్యటన ముగించుకొని, హైదరాబాద్‌కు బయలుదేరుతారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.