
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో కులగణన విజయోత్సవ సభకు రావాలని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. పార్టీ అధిష్టానం సూచనలతో కులగణన, ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసిందని ఆయన అన్నారు. ఇందుకు గుర్తుగా రెండు సభలను పెట్టాలని నిర్ణయించామని రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంట్లో కులగణన విజయోత్సవ సభను సూర్యాపేటలో, ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ సభను గజ్వేల్‌లో నిర్వహించనున్నట్లు వివరించారు. కులగణన సభకు రావాలని రాహుల్ ను సీఎం రేవంత్ కోరారు. శనివారం ఢిల్లీలోని 10జన్‌పథ్‌లో రాహుల్ గాంధీ తో ఆయన భేటీ అయ్యారు.
మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగింది. ఈ భేటిలో ప్రధానంగా కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చించారు. కులగణన జరిగిన తీరు, రాష్ట్రంలోని ఆయా వర్గాల లెక్కలను సీఎం రేవంత్ వివరించారు. ఇందుకోసం ప్రభుత్వం పాటించిన శాస్త్రీయమైన విధానం, క్షేత్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను చెప్పారు. రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. కాగా.. తెలంగాణలో చేపట్టిన కులగణన భేష్ అని రాహుల్‌గాంధీ ప్రశంసించినట్లు తెలిసింది. ఈ కుల గణన భవిష్యత్ తరాలకు దిక్సూచిగా మారనుందని అన్నట్లు సమాచారం.