నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం.. సిద్ధమా..? బీఆర్ఎస్‎కు CM రేవంత్ సవాల్

నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం.. సిద్ధమా..? బీఆర్ఎస్‎కు CM రేవంత్ సవాల్

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు కట్టింది కేవలం వాళ్ల ఫామ్ హౌస్‎ల కోసమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేయగా..  కొండపోచమ్మ, రంగనాయక సాగర్ ప్రాజెక్టుల దగ్గర ఎవరికి ఫామ్ హౌస్‎లు ఉన్నాయి..? దీనిపై అసెంబ్లీలోని అన్ని పార్టీల సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీ వేద్దామా.. విచారణకు సిద్ధమా..? అని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. 

కమిషన్ల కోసమే బీఆర్ఎస్ ప్రాజెక్టులకు రీ డిజైన్లు చేశారని.. మీరు అత్యంత అవినీతికి పాల్పడిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై విచారణ జరగుతోందని.. ఆ నివేదిక వచ్చాక మీరంతా జైలుకు వెళ్తారని హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ఏక సభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టును సభలో ప్రవేశపెట్టి చర్చిస్తామని తెలిపారు. ప్రాజెక్టుల కోసం బలవంతంగా రైతుల భూములు లాక్కుంది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం భూములు ఏ విధంగా తీసుకున్నారో అందరం చూశామని మండిపడ్డారు. 

Also Read :- తెలంగాణ అప్పులపై లెక్కలతో సహా బీఆర్ఎస్‎ను చెడుగుడు ఆడిన CM రేవంత్

మేం మాత్రం కొడంగల్, లగచర్లలో బాధితులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చాం.. కానీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బాధితులను రెచ్చగొట్టి అధికారులపై దాడులకు ఉసిగొల్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమైనా కేటీఆర్, హరీష్ రావు చూసుకుంటారని లగచర్ల బాధితులను రెచ్చగొట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. అభివృద్ధి కోసం పని చేస్తోన్న అధికారులను చంపాలని చూసింది మీరు కాదా అని నిలదీశారు. బీఆర్ఎస్ లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గుండు సున్నా అని.. మీరు కట్టిన ప్రాజెక్టులు లేకున్నా రాష్ట్రంలో రైతులకు నీళ్లు ఇవ్వొచ్చన్నారు.