- అస్సాంలో రాహుల్ యాత్రపై దాడిని ఖండించిన సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు : భారత్ న్యాయ్ యాత్రలో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీపై జరిగిన దాడిని సీఎం రేవంత్‌రెడ్డి ఖండించారు. బీజేపీ ప్రేరేపిత వ్యక్తులే ఈ దాడి చేశారని ఆయన ఆరోపించారు. రాహుల్ భద్రత విషయంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. ఇలాంటి చర్యలతో ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న కుట్రలు ఫలించవన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ధోరణి మంచిది కాదని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం సోమవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు.
రాహుల్ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం, గుడి సందర్శనకు అనుమతి ఇవ్వకపోవడం శోచనీయం అన్నారు. వీటి వల్ల మరింత మనోధైర్యంతో రాహుల్ ముందుకు సాగుతారని, లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు అండగా ఉన్నారని రేవంత్ అన్నారు. తెలంగాణ సమాజం కూడా రాహుల్ కు అండగా ఉందన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా యాత్ర ఆగదన్నారు.
హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్
దావోస్, లండన్, దుబాయి పర్యటన ముగించుకుని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. సీఎం రేవంత్‌కు పార్టీ నేత హర్కర వేణుగోపాల్‌రావు స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రొటోకాల్ సలహాదారుగా తనను నియమించినందుకు రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొని రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చినందుకు రేవంత్‌ను ఆయన అభినందించారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా జూబ్లిహిల్స్‌లోని తన ఇంటికి రేవంత్ వెళ్లిపోయారు. సీఎం సెక్రటేరియెట్‌కు వస్తారని, సాయంత్రం క్యాండిల్ ర్యాలీలో పాల్గొంటారని అనుకున్నా.. ఆయన రాలేదు.