
హైదరాబాద్: తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ తండ్రి హరికృష్ణన్ నాడార్ అనంతకృష్ణన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన.. బుధవారం (ఏప్రిల్ 9) తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో తమిళి సై తండ్రి, తమిళనాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గొప్ప సాహితీవేత్త హరికృష్ణన్ నాడార్ అనంతకృష్ణన్ మరణం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మహాత్ముడి సిద్ధాంతాలను పునికిపుచ్చుకున్న దేశ భక్తుడు, తమిళ భాషా ప్రేమికుడు అనంతన్ని కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు. కుమారి అనంతన్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికై ప్రజలకు ఎన్నో సేవలు అందించారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న తమిళిసైకి, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు సీఎం రేవంత్ రెడ్డి.
తమిళి సై తండ్రి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్, ఇతర బీజేపీ నేతలు అనంతకృష్ణన్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. కాగా, తమిళిసై బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ గవర్నర్గా పని చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కేసీఆర్ సర్కార్, రాజ్ భవన్ మధ్య ఉప్పు నిప్పులా పరిస్థితి ఉండేది. ఎన్నోసార్లు కేసీఆర్ ప్రభుత్వాన్ని తమిళి సై బహిరంగంగానే విమర్శించగా.. బీఆర్ఎస్ నేతలు సైతం అదే స్థాయిలో తమిళి సైకి కౌంటర్ ఇచ్చేవారు. దీంతో తమిళి సై వర్సెస్ కేసీఆర్ సర్కార్ అన్నట్లుగా ఉండేది పరిస్థితి.