
- దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సర్వే చేపట్టినం
- అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేసినం
- దుర్బుద్ధితోనే కొంత మంది సర్వేలో పాల్గొనలే
- కొందరు నన్ను విమర్శిస్తూ.. కులగణన చేయనివారి సపోర్ట్ కోరుతున్నరు
- ఈ ముసుగులో రాజకీయంచేసేవారి ట్రాప్‌లో పడొద్దు
- రాహుల్ గాంధీకి అభినందన సభ పెట్టండి.. ఢిల్లీ ధర్నాకు ఆయన వచ్చేలా అపాయింట్ మెంట్తీస్కుంటం
- బీసీల అండతోనే తాము అధికారంలోకి వచ్చామని వెల్లడి
- సీఎం రేవంత్‌కు బీసీ సంఘాల ఆధ్వర్యంలో సన్మానం
హైదరాబాద్, వెలుగు: దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా కులగణన చేసి బీసీల లెక్క 56 శాతంగా తేల్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం ఇకనైనా దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కులాల లెక్క తేల్చడం కోసమే లోకల్ బాడీ ఎలక్షన్స్‌ను వాయిదా వేశామని తెలిపారు. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని బీసీ మేధావుల ఫోరం కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన 40 బీసీ సంఘాల నేతలు కలిసి, సన్మానించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన దేశంలోని అన్ని పార్టీలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియాలని అన్నారు. “ ఏఐసీసీ అగ్రనేత , ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అభినందన సభ ఏర్పాటు చేయాలని కోరుతున్నా. సూర్యాపేట లో ఏర్పాటు చేస్తరా.. పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తారా.. అనేది మీ ఇష్టం. 10 లక్షల మందితో భారీ మీటింగ్ పెట్టండి. డేట్ ఫిక్స్ చేయాలని పీసీసీ చీఫ్ ను కోరుతున్న. కేంద్రంలో అధికారంలో ఉన్న వారికి కులగణన చేయడం ఇష్టం లేదు. ఈ మీటింగ్ తోనైనా వారికి జన గణన.. అందులో కులగణన చేయాలనే ఆలోచన రావాలి.
ఒత్తిడి తెస్తే ఎవరైనా దిగి రావాల్సిందే. 2012 లో యూపీఏ ప్రభుత్వం కుల గణన చేసినా.. బయట పెట్టలేదు. 2021 లో జనగణన చేస్తే ఎస్టీ, ఎస్సీ జనాభా తెలిసేది. చట్టబద్ధత లేని లెక్కలతో రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. రిజర్వేషన్లు 50 శాతం పెంపు కుదరదు అని చెప్పలేదు. లెక్కలు ఏవి అని సుప్రీంకోర్టు అడిగింది . తెలంగాణ లో రాహుల్ గాంధీ 22 రోజులపాటు 400 కిలోమీటర్ల మేర భారత్ జోడో యాత్ర చేశారు. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. బీసీ సమాజం ఓట్లు వేయడం, అండగా ఉండడంతోనే మేం అధికారం లోకి వచ్చాం. కుల గణన స్టార్ట్ చేసి.. పూర్తి చేసిన ఫిబ్రవరి 4 ను సోషల్ జస్టిస్ డే గా చేశాం’’ అని అన్నారు.
కుల గణన లెక్కలను మేం లాకర్లో దాచుకోలే
‘బీసీ కేబినెట్ సబ్‌కమిటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ ఏంటి?.. పొన్నం మెంబరా?’ అని కొందరు విమర్శించారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి సీనియర్ మంత్రి అని ఆయనకు బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. అధికారులతో పనిచేయించే సామర్థ్యం ఉన్న నేత ఉండాలనే ఆయనను నియమించినట్టు తెలిపారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు చెబితే.. అధికారులు వద్దని చెప్పినా తాను ఒప్పుకోకుండా.. బీసీ ఆఫీసర్ బూసాని వెంకటేశ్వరరావును చైర్మన్ గా నియమించానని చెప్పారు. గడువు విధించి మరీ కులగణనను పూర్తి చేసినట్టు చెప్పారు.
కులగణన చేసి లెక్కలను బయటకు రిలీజ్ చేశామని, అసెంబ్లీలో టేబుల్ చేశామని, అంతే తప్ప లాకర్ లో దాచుకోలేదని అన్నారు. కొంత మంది దుర్బుద్ధి ఉన్నోళ్లు సర్వే లో పాల్గొనలేదని విమర్శించారు. “సర్వే చేసిన నన్ను విమర్శిస్తూ చేయని వాళ్ల దగ్గరకు కొంత మంది వెళ్లి రిజర్వేషన్ల కు మద్దతు ఇవ్వాలని కోరుతున్నరు. గొర్రె కసాయివాడిని నమ్ముతుందనే సామెత అందరికీ తెలిసిందే. చిన్న సహాయం చేస్తే ఎప్పటికీ గుర్తు పెట్టుకునేది బీసీ సమాజం. నన్ను తిడితే ఏం వస్తది? నా దగ్గర మా పార్టీ నేతలు వచ్చి కులగణన చేసి మాటలు, తిట్లు పడుతున్నావ్ అని అంటున్నరు” అని సీఎం రేవంత్ అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ లో చూస్తే పీసీసీ అధ్యక్షుల్లో ఎక్కువ మంది బీసీలే ఉన్నారని, ఇపుడు 42 శాతం రిజర్వేషన్లు ఉంటే రాబోయే రోజుల్లో 56 శాతానికి పెరుగొచ్చన్నారు. “కుల గణనలో మాకు ఎలాంటి వేరే ఉద్దేశం లేదు. రాహుల్ గాంధీ ఆదేశాలను నేను, పీసీసీ, ఉత్తమ్, పొన్నం అమలు చేస్తున్నం. కుల గణన ముసుగులో కొంత మంది లబ్ధి పొందాలని చూస్తున్నారు. వాళ్ల ట్రాప్ లో ఎవరూ పడకండి. కుల గణన తప్పు అంటే బేస్ లేని ఆర్గ్యుమెంట్.
కేంద్రం జనగణన లో కుల గణన చేసేలా అందరం కలిసి పోరాడుదాం. బీసీలకు నేను అండగా ఉంటా. కుల గణన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీరే ఖండించాలి. ప్రభుత్వం చేసిన కులగణన పాలసీ డాక్యుమెంట్. ఈ నెల 25న బీసీ సంఘాలు ఢిల్లీలో చేసే ధర్నాకు రాహుల్ గాంధీ వచ్చేలా ప్రయత్నం చేస్తాం. పార్లమెంట్ సెషన్ జరుగుతున్నందున ఇతర పార్టీల ఎంపీలు వస్తే ఇష్యూ హైలెట్ అవుతుంది. హైదరాబాద్ నుంచి ఈ మీటింగ్ కు బీసీ సంఘాలు వెళ్లేలా ప్రత్యేక రైలు ఏర్పాటు చేద్దాం. ఈ బాధ్యతలు పీసీసీ చీఫ్ కు అప్పగిస్తున్నా” అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
దేశానికే ఆదర్శంగా కులగణన: మంత్రి పొన్నం
దేశానికే ఆదర్శవంతంగా ఉండేలా కుల గణన చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం ఇచ్చామన్నారు. లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ఎన్నికలు వాయిదా వేశామని తెలిపారు.
బీసీ సబ్ ప్లాన్ తీసుకురావాలి: రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు
దేశంలో ఏ రాష్ట్రంలో రిజర్వేషన్లు తీసుకొచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే జరిగాయని రిటైర్డ్ ఐఏఎస్, బీసీ మేధావుల ఫోరం కన్వీనర్ చిరంజీవులు గుర్తు చేశారు. కేంద్రంతో చర్చించి రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్ లో చేర్చాలని ఆయన కోరారు. బడ్జెట్ లో బీసీలకు కేటాయింపులు పెంచాలని, బీసీల అభివృద్ధికి సబ్ ప్లాన్ తీసుకురావాలని అన్నారు.
కామారెడ్డి డిక్లరేషన్ అమలు అభినందనీయం: జాజుల శ్రీనివాస్ గౌడ్
కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయడం, రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీలో బిల్లును ఆమోదించడం అభినందనీయమని బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అప్పట్లో రాజీవ్ గాంధీ లోకల్ బాడీ ల్లో రిజర్వేషన్లు తీసుకురావడంతో ఎంతో మందికి పదవులు దక్కాయని గుర్తు చేశారు.
సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు: దాసు సురేశ్
విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసిన సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల గణనను చట్టబద్ధం చేయడం బీసీ రాజ్యాధికార సాధనకు తొలిమెట్టు అని పేర్కొన్నారు.
70 ఏండ్ల కల సాకారం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
దేశంలో కులగణన 70 ఏండ్ల తర్వాత సాకారం అయిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ పేర్లు చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. జోడో యాత్ర లో భాగంగా రాహుల్‌గాంధీ దేశమంతా పర్యటించారని, ప్రజల సమస్యలు తెలుసుకున్నారన్నారు. బిహార్, కర్నాటకలో కుల గణన చేసినా అసెంబ్లీ లో టేబుల్ చేయలేకపోయారని, తెలంగాణలో అగ్రవర్ణ సీఎం ఉన్నా కుల గణన చేసి టేబుల్ చేశామన్నారు.
పదేండ్లలో కుల గణన చేయనివాళ్లు కూడా ఇప్పుడు తమను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో బిల్ ఆమోదం పొందిందని, తర్వాతి ఘట్టం కేంద్రం చేతిలో ఉందని అన్నారు. రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేశారు.
ఇది కాంగ్రెస్ కమిట్‌మెంట్
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 6 నెలల్లోనే వర్గీకరణ చట్టం తీసుకొస్తున్నామని, ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్‌మెంట్ అని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. 2025 ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డే, మార్చి 18వ తేదీలు చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు. గతంలో ఓ సారి వర్గీకరణ చేసినా.. కోర్టు తీర్పులతో అది నిలిచిపోయిందని, నాటి వర్గీకరణకు, నేటి వర్గీకరణకు పెద్దగా తేడా లేదని వివరించారు. కేవలం1.78 లక్షల జనాభా ఉన్న 26 కులాలు మాత్రమే ఇతర గ్రూపుల్లో చేర్చబడ్డాయని పేర్కొన్నారు.
మాదిగల్లో ఈ 26 కులాల జనాభా 3.43 శాతమేనని, మిగిలిన 33 కులాలు పాత గ్రూపుల ప్రకారమే కొనసాగుతున్నాయని చెప్పారు. అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ, ఆత్మగౌరవం కోసం మహాత్మా జ్యోతిబాఫూలే, మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయులు ఎందరో పోరాటాలు చేశారని వివరించారు.