ఏడాది పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ .. తయారు చేయాలని మంత్రులకు సీఎం రేవంత్ ఆదేశం

ఏడాది పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ .. తయారు చేయాలని మంత్రులకు సీఎం రేవంత్ ఆదేశం
  • శాఖల వారీగా వేర్వేరు రిపోర్టులు 
  • పెట్టిన ఖర్చు, చేసిన అభివృద్ధి, జరిగిన లబ్ధిపై సమగ్ర నివేదికలు
  • మనం తక్కువ సమయంలోనే ఎక్కువ పనులు చేసినం
  • కానీ ఆ స్థాయిలో చెప్పుకోలేకపోతున్నం 
  • చేసిందేంటో ప్రజలకు చెప్పాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం
  • వివాదాల జోలికి మాత్రం వెళ్లవద్దని హితవు 

హైదరాబాద్, వెలుగు : వచ్చే డిసెంబర్​7 నాటికి కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి ఏడాది అవుతుంది. ఈ నేపథ్యంలో ఏడాది పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజల ముందు ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, చేసిన ఖర్చు, ప్రజలకు జరిగిన లబ్ధితో పాటు సమగ్ర వివరాలతో నివేదికలు రూపొందించాలని భావిస్తున్నది. ఈ మేరకు శాఖల వారీగా రిపోర్టులు తయారు చేయాలని మంత్రులను సీఎం రేవంత్​రెడ్డి ఇటీవల ఆదేశించారు. ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. ‘‘గత ప్రభుత్వం చేయని పనులనూ చేసినట్టు గొప్పలు చెప్పుకున్నది. కాళేశ్వరం, మిషన్​ భగీరథ లాంటి ఫెయిల్యూర్​ ప్రాజెక్టులనూ ప్రపంచ అద్భుతాలుగా ఆకాశానికెత్తింది. అద్దె భవనాల్లో గురుకులాలు పెట్టి, విద్యా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దామని ప్రచారం చేసుకుంది’’ అని పేర్కొన్నారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వకుండా చివర్లో నోటిఫికేషన్లతో మభ్యపెట్టింది. ఐదేండ్ల పాటు లక్ష రుణమాఫీ కూడా పూర్తి చేయలేకపోయింది. కానీ మనం తక్కువ సమయంలోనే ఎక్కువ పనులు చేస్తున్నం. అయినప్పటికీ ఆ స్థాయిలో ప్రజలకు చెప్పుకోలేకపోతున్నాం. ఈ పరిస్థితి మారాలి. మన ప్రభుత్వం ఏం చేస్తున్నదో గణాంకాలతో ప్రజలకు వివరించాలి. అట్లని ఎట్టి పరిస్థితుల్లోనూ వివాదాల జోలికి వెళ్లవద్దు’’ అని మంత్రులకు సీఎం రేవంత్ సూచించినట్టు తెలిసింది. 

రెడీ అవుతున్న రిపోర్టులు.. 

సీఎం రేవంత్​రెడ్డి ఆదేశాలతో మంత్రులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఆయా శాఖల వారీగా అధికారులతో ప్రోగ్రెస్ రిపోర్టులు రెడీ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్​ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. ఇప్పటి వరకు ఏయే స్కీమ్స్ అమలయ్యాయి? వాటికి ఎంత ఖర్చయింది? ఎంతమందికి లబ్ధి జరిగింది? లాంటి వివరాలు ప్రోగ్రెస్​రిపోర్టుల్లో పొందుపరుస్తున్నారు. ఒకవేళ అమలుకాని స్కీమ్స్ ఏమైనా ఉంటే అవి ఏ స్టేజీలో ఉన్నాయి? వాటిపై ఇప్పటి వరకు చేసిన కసరత్తు ఏంటి? ఎప్పుడు అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది? 

లాంటి వివరాలు కూడా ప్రగతి నివేదికల్లో పొందుపరుస్తున్నారు. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన, చేస్తున్న స్కీమ్స్ గురించి సమగ్ర సమాచారం అందుబాటులో ఉంచాలని భావిస్తున్న అధికారులు.. ఆ లెక్కలు తీస్తున్నారు. నియోజకవర్గాల వారీగా లబ్ధిదారుల జాబితానూ ప్రచురించాలని భావిస్తున్నారు. ‘మేనిఫెస్టోలో ఏమి చెప్పాం.. ఏడాది పాలనలో ఏమి చేశాం’ అనే వివరాలతో బుక్‌‌‌‌లెట్‌‌‌‌ను కూడా ప్రింట్​చేసే ఆలోచన చేస్తున్నారు. 

రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, జరిగిన ఒప్పందాలు, యంగ్​ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఫోర్త్​సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూల్స్.. లాంటివన్నీ ప్రగతి నివేదికలో పొందుపరిచేందుకు కసరత్తు జరుగుతున్నది. మూసీ పునరుజ్జీవం, హైడ్రా ఏర్పాటుపైనా ప్రత్యేక నివేదిక రిలీజ్ చేయాలని సర్కార్ నిర్ణయించినట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు.

ప్రతి నిమిషం ప్రజల కోసమే పని చేయాలి.. 

‘మంత్రులుగా ప్రతి నిమిషం ప్రజల కోసం పని చేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో వివాదాల్లో తలదూర్చవద్దు’ అని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టు తెలిసింది. శాఖలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించడంతో పాటు ఆయా డిపార్ట్​మెంట్లలో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పినట్టు సమాచారం. 

ఇటీవల కొందరు మంత్రులు వివాదాల్లో ఇరుక్కోవడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. ‘మీరు మీ డిపార్ట్​మెంట్​లో వర్కర్స్​లా ఉండాలి తప్ప విజిటర్స్ లా కాదు’ అని మంత్రులతో సీఎం అన్నట్టు ఓ మంత్రి తెలిపారు. ‘‘రానున్న పది, పదిహేనేండ్ల పాటు కాంగ్రెస్​పార్టీనే అధికారంలో ఉండాలని సీఎం రేవంత్​లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే శాఖల వారీగా మంత్రులు, ఉన్నతాధికారుల పనితీరును ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వివాదాలకు దూరంగా ఉండాలని, చేసిన పనులు చెప్పుకోవాలని సూచించడం కూడా ఇందులో భాగమే” అని ఆ మంత్రి పేర్కొన్నారు.

ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టేలా.. 

హామీలు అమలు చేస్తున్నా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, వాటికి చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను ఇటీవల మాఫీ చేసినప్పటికీ రుణాలు మాఫీ కాలేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని.. దీనిపై జనానికి వాస్తవాలు చెప్పాలని నిర్ణయించింది.  నిజానికి 22 లక్షల 22 వేల 67 మంది రైతులకు సంబంధించి రూ.17,869 కోట్ల మేర రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. 

బ్యాంకుల్లో ఫ్యామిలీ డీటెయిల్స్, ఆధార్, ఫోన్ నంబర్​ సమస్యలు ఉన్నోళ్లకు మాత్రం మాఫీ కాలేదు. మరోవైపు రూ.2 లక్షల కంటే ఎక్కువ లోన్లు ఉన్నోళ్లు మీది అమౌంట్​ను కడితే రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని సర్కార్ చెప్తున్నది.   అదే విధంగా ఆరు గ్యారంటీల్లో భాగమైన మహిళలకు ఫ్రీ బస్, రూ.500కు సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్​, రైతు భరోసా పెట్టుబడి సాయం కూడా ఈ నెల నుంచి జమ చేయాలని భావిస్తున్నది.  వీటిపై రిపోర్టులు రెడీ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.