ధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెడ్తం: సీఎం రేవంత్

ధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెడ్తం: సీఎం రేవంత్
  •     ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పునర్నిర్మాణం: సీఎం రేవంత్ 
  •     రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు  

హైదరాబాద్, వెలుగు:  ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పునర్నిర్మాణం చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. ‘‘తెలంగాణ ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్నది. రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేం. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులందరికీ అభినందనలు” అని అందులో పేర్కొన్నారు. 

విభజన చట్టం ప్రకారం ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్, ఇకపై తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుందని చెప్పారు. ఇకపై విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో  సింహభాగం రాష్ట్ర ప్రజలకే దక్కుతాయని తెలిపారు. ‘‘ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గడిచిన పదేండ్లలో ధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టడంతో పాటు ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరిస్తాం. ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం.. ప్రజా పాలనను అందిస్తాం” అని వెల్లడించారు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.