- ఇయాళ ఆర్మూర్, నిజామాబాద్‌లో కార్నర్ మీటింగ్
- గత నెల 22న ఎన్నికల సభకు అటెండైన సీఎం
- 15 రోజుల గ్యాప్‌లో మరో విజిట్
- పోలింగ్ దగ్గరపడుతున్న వేళ క్యాడర్లో ఫుల్ జోష్
- 10న ప్రియాంక రోడ్ షోకు ప్రయత్నాలు
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. గత నెల 22న నిజామాబాద్ లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సీఎం బుధవారం మరోసారి వస్తున్నారు. ఆర్మూర్, నిజామాబాద్‌లో రోడ్‌షో, కార్నర్ మీటింగ్‌కు అటెండ్ కానున్నారు. కేవలం15 రోజుల గ్యాప్‌లో జిల్లాకు రెండుసార్లు వస్తుండడంతో క్యాడర్ మస్తు జోష్‌లో ఉన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో 10న ప్రియాంక గాంధీ ప్రొగ్రాం ఫిక్స్ అయింది. ఆమెను ఇందూర్కు రప్పించే ప్రయత్నాలు మరోపక్క ముఖ్య లీడర్లు చేస్తున్నారు.
గెలుపే లక్ష్యంగా
ఇందూరు పార్లమెంట్ స్థానానికి 1952 నుంచి ఇప్పటి వరకు జరిగిన 17 ఎన్నికల్లో 12సార్లు కాంగ్రెస్ ఎంపీలే గెలిచారు. ఐదుసార్లు మాత్రమే ఇతర పార్టీలు గెలిచాయి. పార్టీకి కంచుకోటగా ఉన్న సెగ్మెంట్లో ఈసారి విజయబావుటా ఎగరేసి రికార్డు పదిలపర్చుకోవాలని హై కమాండ్ పట్టుదలతో ఉంది. అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించి సీనియర్ నాయకుడైన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని బరిలోకి దింపారు. ప్రచారంతో ఆయన ఇప్పటికే సెగ్మెంట్ అంతా చుట్టేశారు. జీవన్‌రెడ్డి గెలుపు సవాల్‌గా తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి గత నెల 22న నగరంలో నిర్వహించిన భారీ సభకు వచ్చారు.
సెంట్రల్లో ఏర్పడే కాంగ్రెస్ గవర్నమెంట్లో జీవన్‌రెడ్డి అగ్రికల్చర్ మినిస్టర్ అవుతారని క్యాడర్లో జోష్ నింపేలా రేవంత్‌రెడ్డి తన స్పీచ్‌లో తెలిపారు. ఆయన్ను గెలిపించే బాధ్యత ప్రజలు తీసుకోవాలని కోరి వెళ్లారు. పార్లమెంట్సెగ్మెంట్లీడర్లను కోఆర్డినేట్ చేసే బాధ్యతను మరో సీనియర్ నేత మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డికి అప్పగించారు.
మహిళలు, యూత్, బీడీ కార్మికులు, కుల సంఘాలతో వేరు వేరు మీటింగ్‌లతో దూసుకుపోతున్న జీవన్‌రెడ్డి కార్నర్ మీటింగ్‌తో ఓటర్లకు చేరువవుతున్నారు. రిజల్టుపై పార్టీ నిర్వహించిన షార్ట్ సర్వేలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తేలింది. పార్లమెంట్ సెగ్మెంట్లోని మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు రెండు సెంటర్లను ఎంపిక చేసి ప్రొగ్రామ్స్ పెట్టారు. ఆర్మూర్‌లోని రోడ్‌షో, కార్నర్ మీటింగ్‌కు బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల కార్యకర్తలు వస్తారు. తర్వాత ఇందూర్ సిటీలో జరిగే కార్యక్రమానికి రూరల్, బోధన్, అర్బన్ ప్రజలు అటెండ్ అయ్యేలా రూట్ నిర్ణయించారు.
ప్రియాంక ప్రొగ్రాం కోసం
ఈనెల 11న కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డిలో ప్రియాంక గాంధీ రోడ్ షో కన్ఫర్మ్ అయింది.నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆమె పర్యటన కోసం ప్రయత్నాలు నడుస్తున్నాయి. రూరల్ సెగ్మెంట్‌ను ఇందుకు సెలెక్ట్ చేశారు. అరగంట టైం ఉన్నా ప్రియాంక వస్తారని లీడర్లు చెబుతున్నారు. సీఎం రూట్ ఇలా.. బుధవారం 5 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆర్మూర్‌లోని ఆలూరు బైపాస్ రోడ్ వద్ద హెలిక్యాఫ్టర్ దిగుతారు. అక్కడి నుంచి గోల్‌బంగ్లా వరకు కాన్వాయ్ లో వచ్చి గోల్‌బంగ్లా నుంచి అంబేద్కర్ చౌరస్తా దాకా కార్యకర్తలతో కాలినడకన వస్తారు. అక్కడ కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించి నిజామాబాద్‌కు రోడ్డు మార్గంలో వస్తారు. గోల్ హనుమాన్ టెంపుల్ నుంచి నెహ్రూ పార్క్ వరకు రోడ్‌షో నిర్వహించి రాత్రి 9 గంటలకు కార్నర్ మీటింగ్‌కు అటెండవుతారు. తరువాత రోడ్ మార్గంలో హైదరాబాద్ వెళ్తారు.