
హైదరాబాద్: కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి మరణశాసనం రాసింది కేసీఆర్, ఆయన అల్లుడు హరీశ్ రావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో అప్పటి మంత్రి ఉమాభారతి సమక్షంలో 2021–22లో తమకు 299 టీఎంసీలు చాలంటూ సంతకాలు చేసి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంగా నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు ఎడారిగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిందంతా చేసి ఇప్పడు తమపై ఆడిపోసుకుంటున్నారని ఫైర్ అయ్యారు.
ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం మాట్లాడారు. అజ్ఞానమే గొప్ప విజ్ఞానమనుకొని మాట్లాడుతున్నారని విమర్శించారు. జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డి పథకానికి తీసుకోవాల్సిన నీటిని శ్రీశైలం నుంచి తీసుకునేలా ప్లాన్ మార్చారని ఆరోపించారు. జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డికి నీటిని తరలించాలని కోరితే చిన్నారెడ్డిని కేసీఆర్ అవమానించలేదా? అని ప్రశ్నించారు. కమీషన్ల కోసమే ప్లాన్ మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ | కేసీఆర్ సర్వే అసంపూర్ణం..కులగణనపై కమిటీ వేసింది కాంగ్రెస్.. సీఎం రేవంత్రెడ్డి
కరీంనగర్ తరిమేస్తే.. పాలమూరు అక్కున చేర్చుకొని ఎంపీని చేసి పార్లమెంటుకు పంపిన విషయాన్ని కేసీఆర్ మర్చిపోయారని అన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరు గడ్డకు తీరని అన్యాయం చేశారని అన్నారు. పోతిరెడ్డి పాడు పొక్క పెద్దగా చేసుకునేందుకు అనుమతులు ఇచ్చిందే కేసీఆర్ అని విమర్శించారు. వైఎస్ హయాంలో నాయిని నర్సింహారెడ్డి కడప జిల్లా ఇన్ చార్జి మంత్రి గా పనిచేసి.. మన నీటిని తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వలేదా..? అని ప్రశ్నించారు.
కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అన్నీ చెప్తా
కృష్ణా జాలాల్లో అన్యాయం ఎక్కడ ఎలా జరిగిందనేది కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చెప్తానని సీఎం రేవంత్ అన్నారు. అడుగడుగునా రాష్ట్రానికి అన్యాయం చేసింది కేసీఆరే నని అన్నారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొనాలని సవాలు విసిరారు. శ్రీశైలం నుంచి ప్రతి రోజూ 10 టీఎంసీల నీళ్లు పోతున్నాయని అన్నారు. తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం చేసింది వాళ్లు అని అన్నారు. పల్లకీలో పార్లమెంటుకు పంపిన పాలమూరును కేసీఆర్ ఎండబెట్టారని అన్నారు.
నాగార్జున సాగర్ డ్యాంపైకి ఏపీ పోలీసులు వచ్చింది కేసీఆర్ హయాంలోనే అని అన్నారు. నాగార్జున సాగర్ ను ఏపీ పోలీసులు కబ్జా చేస్తుంటే కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకున్నారని అన్నారు. మన పోలీసులను అక్కడి పోలీసులు కొడితే చీము నెత్తురు లేదా..? అని ప్రశ్నించారు. ఇందనా మీ పదేండ్ల అనుభవమని ప్రశ్నించారు. సభను తప్పుదోవ పట్టించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. కుల దురహంకరాన్ని ప్రదర్శిస్తే సహించేది లేదని అన్నారు.
రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిన్నదెవరు?
మాజీ సీఎం కేసీఆర్ అప్పటి ఏపీ మంత్రి రోజా ఇంటికి వెళ్లి రొయ్యల పులుసు తిని తెలంగాణకు తీరని అన్యాయం చేశారని సీఎం ఆరోపించారు. రొయ్యల పులుసు కోసం 71 ఏండ్ల పెంచి పోషించిన తెలంగాణ గుండెల మీద తంతవా... అని ప్రశ్నించారు. ఇదేనా నీ జాతి, నీతి అని అన్నారు.