- కాంట్రాక్టుల విషయంలో గత సర్కార్ నిర్వాకం
- గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం.. ఎంక్వైరీకి రంగం సిద్ధం
- లక్షల కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు..
- రూల్స్‌కు విరుద్ధంగా అయినోళ్లకే కాంట్రాక్టులు
- కాళేశ్వరం, మిషన్ కాకతీయ, భగీరథ, కలెక్టరేట్లు,
- అమరవీరుల స్మారక జ్యోతి, సెక్రటేరియెట్ నిర్మాణంలో కమీషన్ల దందా
- సెలెక్టెడ్ ఇండస్ట్రీలకు కోట్లకు కోట్లు ఇన్సెంటివ్‌లు, అగ్గువకే భూముల అప్పగింత
- అన్నింటిపై డిటైల్డ్ రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు.. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అంబేద్కర్ విగ్రహం, కలెక్టరేట్లు, సెక్రటేరియెట్ నిర్మాణం దాకా అన్నిట్లో గత బీఆర్ఎస్ సర్కార్ మొదట తక్కువ ధరకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి ఆ తర్వాత అమాంతం అంచనా వ్యయాన్ని పెంచేసినట్లు ప్రస్తుత ప్రభుత్వం
గుర్తించింది. దాదాపు అన్నిట్లో నాసిరకం పనులు జరిగినట్లు నిర్ధారణకు వచ్చింది. ఇట్ల లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గత పాలకులు వృథా చేశారని, ఈ వ్యవహారాలన్నింటిపై విచారణ చేపట్టేందుకు రెడీ అవుతున్నది.
ఇప్పటికే కాళేశ్వరం, విద్యుత్ వ్యవహారంలో జ్యుడీషియల్ కమిషన్లను ఏర్పాటు చేసింది. మరికొన్నింటిపై విజిలెన్స్, ఏసీబీ విచారణ జరుపుతున్నది. ఒక్కో శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంచనాల వ్యయం పెంపు తతంగంపై సీఎం రేవంత్‌రెడ్డి రివ్యూ చేస్తున్న కొద్దీ పదేండ్లలోని పనులు, కాంట్రాక్టుల విషయంలో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయి. మొదట్లో టెండర్ దాఖలు చేసే టైమ్‌లో అంచనాలు తక్కువకు చూపడం.. ఆ తర్వాత మధ్యలో వాటిని సవరించడం.. పూర్తయ్యే సరికి ఖర్చు రెండు మూడింతలు కావడం వంటివి ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. కమీషన్ల కోసమే కొన్ని పనుల అంచనా వ్యయాన్ని డబుల్, ట్రిపుల్ చేసినట్లు తేలింది. అయినవాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు రూల్స్‌ను కూడా గత పాలకులు బ్రేక్ చేసినట్లు ప్రస్తుత సర్కార్ గుర్తించింది.
ఇటీవల ఐటీ, ఇండస్ట్రీస్ డిపార్ట్‌మెంట్‌పై రివ్యూలోనూ కొన్ని కంపెనీలకు గత సర్కార్ ప్రత్యేకంగా ఇచ్చిన ఇన్సెంటివ్‌లు, భూముల కేటాయింపుల్లోనూ అక్రమాలు జరిగినట్లు సీఎం రేవంత్ గుర్తించారు. ‘‘లక్షల కోట్లు పెట్టి పనులు చేయించినం.. అప్పులు తెచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినం’’ అని గొప్పగా చెప్పుకుంటున్న బీఆర్ఎస్ లీడర్ల వ్యవహార శైలిని బట్టబయలు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
వివిధ శాఖల్లోని పనులు, కాంట్రాక్టులు ఎవరెవరికి ఇచ్చారు ? ఎంతకు ఇచ్చారు ? ముందు అనుకున్న అంచనాలు ఎంత? ఎప్పుడెప్పుడు ఎంత పెంచారు ? నిబంధనల ప్రకారం సవరించారా? లేక ఇంకేదైనా ఉన్నదా ? దానికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి? పనులు చేపట్టిన కంపెనీలు, ఏజెన్సీలు ఎవరివి? వాటికి బ్యాక్‌గ్రౌండ్ లింక్స్ ఏమున్నాయో పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించినట్లు సమాచారం.
అయినోళ్లకు మిషన్ కాకతీయ టెండర్లు
ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. వందల సంఖ్యలో చెరువులకు గండ్లు పడ్డాయి. కట్టలు తెగిపోయాయి. మిషన్ భగీరథ పైప్లైన్లు ఎక్కడికక్కడ పగిలిపోయాయి. గత రెండేండ్లలోనూ వరదలు వచ్చినప్పుడూ ఇదే జరిగింది. అయితే రాష్ట్రంలో చిన్న, పెద్ద అన్ని కలిపి దాదాపు 46 వేల చెరువులను మిషన్ కాకతీయ ఆధ్వర్యంలో బాగుచేసినట్లు గత ప్రభుత్వం చెప్పుకున్నది. ఎక్కడా పూర్తిగా పనులు చేయలేదన్న విషయం వరదల నష్టంతో తేలింది. మిషన్ కాకతీయ కోసం గత ప్రభుత్వం బడ్జెట్లో ఏకంగా రూ. 6,532 కోట్ల మేర కేటాయింపులు చేసింది.
ఇందులో 80 శాతం వరకు ఖర్చు చేసింది. మిషన్ కాకతీయ టెండర్ల ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వెళ్లినా పట్టించుకోలేదని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. గ్రామాల్లో మిషన్ కాకతీయ చెరువుల కాంట్రాక్ట్ చేస్తున్నది మనోళ్లేనని.. వదిలేయండని అప్పట్లో బీఆర్ఎస్ పెద్దలు అన్నట్లు ప్రస్తుత సర్కార్ దృష్టికి వచ్చింది. పైగా ఒక్కో చెరువు టెండర్ అప్రూవల్‌కు ఇంత మొత్తం ఇచ్చుకోవాల్సిందేనంటూ పైస్థాయి నుంచి ముందే వ్యవహారం కుదుర్చుకుని అనుమతులు జారీ చేశారని రిపోర్టు అందింది.
ఒక్కో చెరువుకు అవసరమైన దానికంటే ఎక్కువ అంచనా వ్యయానికి అప్రూవల్స్ తీసుకున్నారని, అయినా పనులు పూర్తి క్వాలిటీగా చేయలేదని ప్రభుత్వం గుర్తించింది. ఇట్ల నాసిరకం పనుల వల్లే చిన్నపాటి వర్షాలు, వరదలకే చెరువుల కట్టలు తెగిపోతున్నాయని, గండ్లు పడుతున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మిషన్ కాకతీయ లెక్కలు తేల్చాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం.
సెక్రటేరియెట్ అట్లా.. కలెక్టరేట్లు ఇట్లా
రాష్ట్ర పరిపాలన భవనమైన సెక్రటేరియెట్, జిల్లా పరిపాలన భవనాలైన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల విషయంలోనూ గత ప్రభుత్వం లెక్కాపత్రం లేకుండా అంచనా పెంచింది. అయినా నాసిరకం పనులతో ఇప్పటికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సెక్రటేరియెట్‌లోని కొన్ని రూమ్స్‌లో వర్షపు నీరు లీక్ అవుతున్నది. కొన్నిచోట్ల పెచ్చులు ఊడుతున్నాయి. మొదట సెక్రటేరియెట్ నిర్మాణ ఖర్చు రూ.400 కోట్లని అంచనా వేసి బడ్జెట్లో చూపించారు. టెండర్లు ఖరారయ్యాక రూ. 619 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఆ తర్వాత ధరలు పెరిగాయని, నిర్మాణ ఖర్చు రూ. 800 కోట్లు అవుతుందన్నారు.
అది మళ్లీ వెయ్యి కోట్లకు చేరింది. పనులు పూర్తయినా కూడా లెక్కలపై క్లారిటీ లేదు. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం ఎంక్వైరీ చేయిస్తున్నది. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సెక్రటేరియెట్నిర్మాణానికి సంబంధించి 2020 అక్టోబర్‌లో షాపూర్జీ పల్లోంజీ సంస్థ టెండర్లు దక్కించుకుంది. కానీ, దీంట్లోనూ కొన్ని సబ్ కాంట్రాక్టులు బీఆర్ఎస్ ముఖ్య లీడర్లకు చెందిన వాళ్లకే ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేవలం సెక్రటేరియెట్ నిర్మాణ టైంలో వీడియో తీసేందుకే దాదాపు కోటి రూపాయలు కేటాయించినట్లు ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
వాస్తవానికి ఏడాదిలో పూర్తి కావాల్సిన పనులు ఆలస్యం కావడంతో అంతకంతకూ ఖర్చు పెంచుతూ పోయారు. జిల్లా సమీకృత కలెక్టరేట్లలోనూ ఇదే వ్యవహారం నడిచింది. జిల్లాల్లో అయితే ఇష్టమొచ్చినట్లు అప్పడు జిల్లా ఇన్చార్జ్ మంత్రులుగా ఉన్నవాళ్లు తమ దగ్గరివాళ్లకు సబ్ కాంట్రాక్టులు ఇప్పించుకున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సమీకృత కలెక్టరేట్లకు ముందుగా రూ. 1,500 కోట్లు అంచనా వేయగా.. అవి రూ.1,850 కోట్లు దాటాయి.
మెట్రో నుంచి మున్సిపాలిటీల దాకా అంతా ఆయన చెప్పినోళ్లకే!
రాయదుర్గం(మైండ్ స్పేస్) నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల మెట్రో కొత్త రూట్‌కు గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఆ ప్రాజెక్ట్ డీపీఆర్‌లో రూ.4,650 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అయితే ఈ రూట్ శంకుస్థాపనకు వచ్చేసరికి ఏకంగా రూ. 1,600 కోట్లు అంచనా వ్యయం పెరిగింది. దీని మొత్తం అంచనా వ్యయం రూ.6,250 కోట్లుగా చూపారు. అసలు సంబంధం లేని రూట్‌ను ఎంచుకోవడం ఏమిటి? ఆ ప్రపోజల్స్ అంతకు పెంచడం ఏమిటి? ఎవరికి కమీషన్లు పెంచేందుకు ఇట్ల చేశారు అన్న విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి.
ఈ పనులను సబ్ కాంట్రాక్టుల కోసం తనకు నచ్చినోళ్ల పేర్లను ఎల్ అండ్ టీకి గత ప్రభుత్వంలోని మున్సిపల్ శాఖ మంత్రి సూచించినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎయిర్‌పోర్టు మెట్రో రూట్‌ను మార్చారు. ఇక జీహెచ్ఎంసీతో పాటు మున్సిపాలిటీలు, ఆయా కార్పొరేషన్లలో చేపట్టిన ఫ్లైఓవర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం, ఇతర స్ట్రీట్ లైట్స్ వంటి కాంట్రాక్టులన్నీ నాటి మున్సిపల్ శాఖ మంత్రి చెప్పినోళ్లకే దక్కేలా గత సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ల నిర్మాణానికి టెండర్ల నిబంధనలు మార్చినట్లు తేలింది. పైగా టెండర్‌ను ఓ కంపెనీ దక్కించుకుంటే అందులోని పనులను పూర్తిగా సబ్ కాంట్రాక్టర్లు చేపట్టినట్లు వెల్లడైంది. గత ప్రభుత్వంలోని ఓ మంత్రి బావమ్మర్ది బినామీలు, ఆ మంత్రి పీఏ బినామీలు ఈ సబ్ కాంట్రాక్ట్ పనులు చేపట్టినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది.
ఎంఎస్ఎంఈలకు బాకీలు పెట్టి.. సెలెక్టెడ్ ఇండస్ట్రీలకు 2,2500 కోట్లు
ఇండస్ట్రీల ఇన్సెంటివ్ విషయంలోనూ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత సర్కార్ కొన్ని సెలెక్టెడ్ ఇండస్ట్రీలకు ఇన్సెంటివ్స్ కింద రూ.2,250 కోట్లు ఇచ్చినట్లు ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఎంఎస్ఎంఈలకు ఉన్న దాదాపు రూ.4,500 కోట్ల బకాయిలు ఇవ్వకుండా.. పదుల సంఖ్యలో ఉన్న సెలెక్టెడ్ ఇండస్ట్రీలకు ఇన్సెంటివ్స్ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఇండస్ట్రీలు గత ప్రభుత్వ పెద్దలకు దగ్గరివాళ్లవన్న ఆరోపణలు ఉన్నాయి. ఐటీ కంపెనీలకు, ఇండస్ట్రీలకు గత ప్రభుత్వం కేటాయించిన భూముల్లో కార్యకలాపాలు మొదలయ్యాయా.. లేదా? ఎవరెవరికి ఎంత రేటుకు భూములు ఇచ్చారనే వివరాలను ప్రస్తుత సర్కార్ తెప్పించుకుంటున్నది.
ఆ రెండింటిపై ఇప్పటికే జ్యుడీషియల్ ఎంక్వైరీ
తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాణహిత ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరంగా మార్చారు. ఇందుకోసం తొలుత రూ. 80,190 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందనుకున్న దానికంటే అంచనా వ్యయం రూ. 50 వేల కోట్లు అదనంగా పెరిగింది. ఆ తర్వాత అడిషనల్ టీఎంసీ పేరుతో ఇంకింత అంచనాలు పెంచి.. రూ.1.25 లక్షల కోట్లకు గత సర్కార్ తీసుకెళ్లింది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయి.. ఇప్పుడు నీటిని ఎత్తిపోసే పరిస్థితి కూడా లేకుండాపోయింది.
దీనిపై ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వం జస్టిస్ పినాకి ఘోష్ చైర్మన్‌గా జ్యుడీషియల్ కమిషన్‌తో విచారణ చేయిస్తున్నది. 4 వేల మెగావాట్ల కెపాసిటీతో నల్గొండలోని దామరచర్ల వద్ద చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం 2017 అక్టోబర్‌లో ప్రారంభమైంది. దీనికోసం రూ. 30 వేల కోట్లు అవుతుందని తొలుత అంచనా వేశారు. ఆ తర్వాత అంచనాల ఖర్చు రూ. 40 వేల కోట్లు దాటింది. ఇందులోనూ సబ్ కాంట్రాక్టుల పేరుతో ఇష్టారీతిన వ్యవహరించి.. వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతోపాటు విద్యుత్ కొనుగోళ్లపైనా జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయిస్తున్నది.
ఏదీ వదల్లేదు
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక చిహ్నం అంచనా వ్యవయాలను కూడా గత ప్రభుత్వం అమాంతం పెంచేసింది. టెండర్ల టైంలో అంచనాలు ఒకటి చూపి.. కాంట్రాక్టులు ఫైనల్ అయిన తర్వాత ఏడాది, రెండేండ్లలోపే మొత్తం ఖర్చును డబుల్ చేసింది. ఇప్పటికీ అంబేద్కర్ విగ్రహం దగ్గర పనులు పూర్తి కాలేదు. అమరవీరుల స్మారక చిహ్నానికి అనుకున్న స్టీల్ కాకుండా నాసిరకం స్టీల్ వాడినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది.
- పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు రూ.400 కోట్లు ఖర్చు అవుతుందని తొలుత అంచనా వేశారు. పూర్తికావడానికి 600 కోట్లు దాటింది.
- హైదరాబాద్ లుంబినీ పార్కు వద్ద అమరవీరుల స్మారక చిహ్నం ఏర్పాటుకు రూ.80 కోట్ల అంచనా వ్యయంతో ఆరేండ్ల ఏండ్ల కింద పనులు చేపట్టారు. దాని ఖర్చును రూ.177 కోట్లకు పెంచేశారు.
- రూ. 104 కోట్ల అంచనా వ్యయంతో 2016లో ఎన్టీఆర్ గార్డెన్ పక్కన అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. తర్వాత ఆ ఖర్చును రూ.165 కోట్లకు చేర్చింది.
- నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల అంచనా వ్యయం కూడా గత సర్కార్ పెంచింది. వరంగల్ హాస్పిటల్ నిర్మాణానికి రూ.1,100 కోట్లు అనుకుంటే అది కాస్తా 1,726 కోట్లకు చేరింది. రూ. 2,679 కోట్లతో ఎల్బీనగర్, సనత్ నగర్, అల్వాల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వగా.. ఆ అంచనా వ్యయం రూ.3,562 కోట్లకు చేరింది. పూర్తయ్యేసరికి ఎంత అవుతుంతో తెలియని పరిస్థితి. ఈ నాలుగు హాస్పిటళ్ల అంచనా వ్యయంపైనా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను సీఎం ఇప్పటికే ఆదేశించారు. ఆఖరికి ప్రగతి భవన్ నిర్మాణం కూడా రూ. 38 కోట్లతో మొదలైతే రూ. 46 కోట్లకు గత సర్కార్ పెంచేసింది.
మిషన్ భగీరథలో రూ. 20 వేల కోట్ల అవినీతి!
మిషన్ భగీరథ కోసం రూ. 32 వేల కోట్లు ఖర్చు చేశారు. టెండర్ నిబంధనలేవీ పాటించకుండా వ్యవహారం నడిపారు. లక్షా 50 వేల కిలోమీటర్ల మేర పైప్లైన్లు వేసినట్టు, ఈ పథకం కింద 2.72 కోట్ల జనాభాకు మంచినీళ్లు అందుతున్నట్టు అధికారిక లెక్కల్లో పేర్కొన్నారు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది. వంద శాతం ఇండ్లకు నీళ్లు ఇస్తున్నట్లు గత ప్రభుత్వం చెప్పుకుంటే.. క్షేత్రస్థాయి సర్వేలో 53 శాతం ఇండ్లకు అందడం లేదని తేలింది.
అసలు పైప్లైన్లు వేసింది ఎవరు? నల్లాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? ఎవరు వేశారు? అని ప్రస్తుత ప్రభుత్వం వివరాలు రాబడుతున్నది. ఇందులో దాదాపు 20 వేల కోట్ల అవినీతి జరిగినట్లు భావిస్తున్నది. మిషన్ భగీరథ వ్యవహారమంతా ఆనాటి ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండే నిజామాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఒకరు దగ్గరుండి నడిపించినట్లు ప్రాథమికంగా ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది.