ఉగాది కల్లా కేబినెట్​ విస్తరణ.. కొత్తగా నలుగురికి లేదా ఐదుగురికి చోటు

ఉగాది కల్లా  కేబినెట్​  విస్తరణ.. కొత్తగా నలుగురికి లేదా ఐదుగురికి చోటు

 

  •  
  • ఖర్గే, రాహుల్  నేతృత్వంలో ఢిల్లీలో ముగిసిన చర్చలు
  • హాజరైన సీఎం రేవంత్​, భట్టి, ఉత్తమ్​, మహేశ్​గౌడ్​, మీనాక్షి నటరాజన్​
  • మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ కార్యవర్గం, నామినేటెడ్​ పోస్టులపై డిస్కషన్​
  • మంత్రి పదవులు దక్కనివాళ్లకు  డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్​గా అవకాశం
  • హైకమాండ్​తో చర్చలు పూర్తయ్యాయన్న పీసీసీ చీఫ్​

న్యూఢిల్లీ / హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర కేబినెట్​ విస్తరణపై కసరత్తు ముగిసింది. రేపు, మాపు అంటూ.. ఏడాదికి పైగా సాగుతున్న ఈ అంశంపై కాంగ్రెస్​ హైకమాండ్​ ఫైనల్ నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. ఇందులో నాలుగు లేదా ఐదు పోస్టులను ఉగాది కల్లా భర్తీ చేయనున్నట్లు తెలిసింది.  మంత్రి పదవులు దక్కని వారికి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. పీసీసీ కార్యవర్గ ఏర్పాటుకు, మిగిలిన నామినేటెడ్​ పోస్టుల భర్తీకి కూడా హైకమాండ్ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. సోమవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఢిల్లీలోని ఇందిరా భవన్​లో కీలక భేటీ జరిగింది. ఇందులో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ  కేసీ వేణుగోపాల్, రాష్ట్ర ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్  పాల్గొన్నారు. మంత్రి పదవుల్లోకి ఎవరిని తీసుకోవాలి.. ప్రస్తుతం ఏ సామాజిక వర్గాలకు, ఏయే జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు అనే విషయాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. 

రెండు గంటలపాటు భేటీ

హైకమాండ్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం సీఎం రేవంత్​, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​ ఢిల్లీకి వెళ్లారు. నేరుగా ఏఐసీసీ హెడ్​ ఆఫీసు ఇందిరా భవన్​కు చేరుకున్నారు. సాయంత్రం ఆరున్నరకు మహేశ్​గౌడ్​ ఏఐసీసీ హెడ్ ఆఫీసుకు రాగా... ఆ తర్వాత సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఒకే కారులో వచ్చారు. ఖర్గే నేతృత్వంలో రాత్రి 7 నుంచి  9 వరకు మీటింగ్ సాగింది. అయితే, ఆలస్యంగా 7 గంటల 45 నిమిషాలకు మీటింగ్ కు వెళ్లిన మంత్రి ఉత్తమ్​.. ముందుగానే మీటింగ్ నుంచి వచ్చేశారు.
 
మినిస్టర్​ పోస్ట్​ దక్కనివాళ్లకు..!

మంత్రివర్గంలో అవకాశం దక్కని నేతలకు ప్రత్యామ్నాయంగా ఏ పదవులు ఇవ్వాలనే దానిపై కూడా కాంగ్రెస్​ పెద్దల భేటీలో చర్చ జరిగినట్లు తెలిసింది. అలాంటి వారికి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్  పదవులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. డిప్యూటీ స్పీకర్ పదవి ఎస్టీలోని లంబాడకు ఇవ్వడంపై  చర్చించినట్లు తెలిసింది. చీఫ్ విప్ పదవి మాదిగ సామాజికవర్గానికి లేదంటే బీసీలో మంత్రి పదవి దక్కని మరో సామాజికవర్గానికి ఇచ్చే చాన్స్​ ఉంది. పీసీసీ కార్యవర్గం, నామినేటెడ్ పదవుల భర్తీ పై కూడా చర్చించారు. పీసీసీ కార్యవర్గంలో మొదటి విడతగా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు 20 మంది వరకు పార్టీ ఉపాధ్యక్షులను నియమించి, మిగితా కార్యవర్గాన్ని తర్వాత వేసేందుకు హైకమాండ్ అనుమతిని  పీసీసీ చీఫ్  మహేశ్ కుమార్ గౌడ్  తీసుకున్నట్లు తెలిసింది.  ఇక మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీని కూడా వెంటనే పూర్తి చేయాలని హైకమాండ్ ఆదేశించినట్లు సమాచారం. 

నలుగురి శాఖల్లో మార్పు.. ఒకరికి ఉద్వాసన?

కేబినెట్ విస్తరణలో సామాజిక సమతుల్యం తప్పక పాటించాలని కాంగ్రెస్​ హైకమాండ్ నిర్ణయించింది. బీసీ, ఎస్సీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గాలకు ఒక్కో పదవి ఇచ్చే చాన్స్​ ఉంది.  అయితే కొత్తగా నలుగురిని లేదా ఐదుగురిని కేబినెట్​లోకి తీసుకోనుండటంతో పాటు ముగ్గురు, నలుగురు మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే ఆస్కారం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఓ మంత్రిని కేబినెట్​ నుంచి తప్పించే అవకాశం కూడా ఉందన్న చర్చ జరుగుతున్నది. 

చర్చలు ముగిశాయి: పీసీసీ చీఫ్

 త్వరలోనే కేబినెట్​ విస్తరణ ఉంటుందని, దీనిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని పీసీసీ చీఫ్ మహేశ్​కుమార్‌‌ గౌడ్‌‌  చెప్పారు. ‘‘మంత్రివర్గ కూర్పు, పీసీసీ కార్యవర్గం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వెల్ఫేర్ స్కీంలు, ఇతర అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించాం. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ విషయాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తాం” అని వివరించారు. అయితే మంత్రివర్గ కూర్పు, పీసీసీ కార్యవర్గం తదితర అంశాలపై అధిష్టానంతో ఇదే చివరి సమావేశమని మహేశ్​గౌడ్​ క్లారిటీ ఇచ్చారు. మరోసారి చర్చ ఉండదని స్పష్టం చేశారు. హైకమాండ్ నేతలతో భేటీ అనంతరం.. ఇందిరా భవన్ ముందు మహేశ్​గౌడ్​ మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో జరుగుతున్న వెల్ఫేర్, డెవలప్మెంట్ ప్రోగ్రాంల గురించి ఖర్గే, రాహుల్‌‌‌‌ గాంధీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. హెల్త్, ఎడ్యుకేషన్ అమలు తీరుపై రాహుల్‌‌‌‌ గాంధీ ప్రత్యేకంగా అడిగారు. ప్రధానంగా ఇంటిగ్రేటెడ్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌ ఏర్పాటు గురించి పలు అంశాలను తెలుసుకున్నారు’’  అని ఆయన  తెలిపారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ కొత్త కార్యవర్గం, వివిధ కార్పొరేషన్‌‌‌‌ చైర్మన్లు, బోర్డుల నియామకంపై చర్చించినట్లు స్పష్టం చేశారు. వీటిపై తమ అభిప్రాయాలను తీసుకున్నారన్నారు.