
- రేషన్ షాపులు, అంగన్ వాడీలు, హాస్టళ్లకు ఇవ్వాలి
- ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం
- ఇప్పటికే 5 లక్షల మెట్రిక్ టన్నులను మిల్లర్ల నుంచి తీసుకున్న సర్కారు
- తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
హైదరాబాద్: ఉగాది నుంచి రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇచ్చేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్, ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలు సంక్షేమ హాస్టల్లకు సన్నబియ్యం ఇవ్వాలంటే నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని పౌరసరఫరాల కమిషనర్ డీఎస్ చౌహన్, సివిల్ సప్లై శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఏడాదికి 24 లక్షల టన్నుల బియ్యం అవసరం ఉంటుందని, ఇప్పటి వరకు 5 లక్షల టన్నుల సన్నబియ్యం మిల్లర్ల నుంచి తీసుకున్నామని చెప్పారు. ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరాకు రాష్ట్రంలో సేకరించిన బియ్యం సరిపోయే అవకాశం లేదని, కొంత షార్టేజ్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందింస్తూ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని ఉగాది నుంచి కచ్చితంగా సన్నబియ్యం అందించాలని ఆదేశించారు.