హైదరాబాద్: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి మరో భారీ గుడ్ న్యూస్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 35 వేల ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని.. త్వరలోనే మరో 35 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. ఇవాళ (సెప్టెంబర్ 25) హైదరాబాద్లో జరిగిన బీఎఫ్ఎస్ఐ స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని.. విద్యార్థులంతా రోడ్డున పడ్డారని మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్యను గుర్తించామని.. అన్ని శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టామని తెలిపారు. నిరుద్యోగ తీవ్రతను గుర్తించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. వెబ్ సైట్లో 30 లక్షల మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకున్నారని కానీ రాష్ట్రంలో 50 నుండి 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని వెల్లడించారు. ఉద్యోగాల భర్తీని బాధ్యతగా తీసుకుని ఆచరణలో పెడుతున్నామని పేర్కొన్నారు.
ALSO READ | హైడ్రా బుల్డోజర్లకు అడ్డంగా నేను ఉంటా... కేటీఆర్
గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రంలో పదేళ్ల తర్వాత నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని ఫైర్ అయ్యారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన నిరుద్యోగ సమస్య మొత్తం తీరదన్నారు. ప్రైవేట్ సెక్టార్ల కూడా యువతకు ఉపాధి కల్పించడంపై దృష్టిపెట్టామని చెప్పారు. ప్రస్తుతం పరిశ్రమలు, నిరుద్యోగులకు మధ్య గ్యాప్ ఉందని.. ఇండస్ట్రీ పెద్దలను పిలిచి వారి అవసరాలు తెలుసకున్నామని, ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని వివరించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్శిటీ ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఉద్యోగాల లేక ఒత్తిడిలో యువత డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు బానిస అవుతోందని.. డ్రగ్స్ బారిన పడి బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని సూచించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటుకున్నాని తెలిపారు.