హైదరాబాద్: రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షం, వరదలతో రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. చెరువులు, కాలువలు, కుంటలు పొంగిపొర్లి వరద నీరు రోడ్లపైకి రావడంతో రవాణా వ్యవస్థ స్తంభింపోయింది. వరుణుడి ఉగ్రరూపానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలదిగ్భంధంలో కూరుకుపోయాయి. లో తట్టు ప్రాంతాలు నదులను తలపిస్తు్న్నాయి. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు ఉప్పొంగి ప్రవహించడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో నాన్ స్టాప్‌గా పడుతోన్న వర్షాలు, వరదలపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ( సోమవారం) అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నిర్వహించిన ఈ రివ్యూ మీటింగ్‌కు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ తదితర అధికారులు హాజరయ్యారు. వర్షం, వరదల ప్రస్తుత పరిస్థితి, అందుతోన్న సహయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీయనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలు, ముంపు ప్రాంతాలు సహయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ రివ్యూ మీటింగ్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఖమ్మం బయలుదేరి వెళ్లనున్నారు. రోడ్డు మార్గం గుండా ఖమ్మం వెళ్లి.. మున్నేరు వాగు బీభత్సానికి అల్లకల్లోకలం అయిన వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు.