చెవులకు గంటీలు.. కాళ్లకు కడియాలు

  • పెద్దరికం గుర్తు చేసేలారైకతో చీరకట్టు
  • పోరాట పటిమ ఉట్టిపడేలా తెలంగాణ తల్లి

హైదరాబాద్, వెలుగు: పోరాట పటిమ, తెలంగాణతనం ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహం రూపు దిద్దుకుంటున్నది. ఇప్పుడు యువజనులుగా ఉన్నోళ్లందరికీ నానమ్మ, అమ్మమల రూపుతీరు పెద్దరికం ఉట్టిపడేలా తెలంగాణ తల్లి కనిపించనున్నది. చెవులకు వేలాడే గంటీలతో పాటు కాళ్లకు కడియాలు ఉండేలా విగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఇక అప్పట్లో తెలంగాణలో చీరకట్టు, రైక ఎలా ఉంటుందో అచ్చం అలానే తెలంగాణ తల్లి విగ్రహం కట్టుబొట్టు ఉండనున్నట్లు చెబుతున్నారు. మరోవైపు శుక్రవారం సెక్రటేరియెట్ ​ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.

అక్కడ పనిచేస్తున్న కూలీలను పలకరించి.. పనులు జరుగుతున్న తీరు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 9న సెక్రటేరియెట్​లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. దాదాపు లక్షమందితో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం నియంతృత్వ పోకడలను కలిగి ఉందని.. తెలంగాణ ఆత్మ కనిపించేలా తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని తీసుకువస్తామని సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ దిశగా పనులు కొన సాగుతున్నాయి.