SRH, హెచ్‎సీఏ మధ్య పాసుల లొల్లి: సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. విజిలెన్స్ విచారణకు ఆదేశం

SRH, హెచ్‎సీఏ మధ్య పాసుల లొల్లి: సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. విజిలెన్స్ విచారణకు ఆదేశం

హైదరాబాద్: కాంప్లిమెంటరీ పాసుల విషయంలో SRH యాజమాన్యం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‎సీఏ) మధ్య నెలకొన్న వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పాసుల కోసం SRH మేనేజ్మెంట్‎ను ఇబ్బంది పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఆర్‎హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, కాంప్లిమెంటరీ పాసుల కోసం హెచ్‎సీఏ తమను బెదిరింపులకు గురి చేసిందని SRH యాజమాన్యం సంచలన ఆరోపణలు చేసింది. 

ALSO READ | సన్ రైజర్స్‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ మధ్య టికెట్ల గొడవ.. చిచ్చు పెట్టిన ఈ–మెయిల్‌‌‌‌‌‌‌‌

పాసులు ఇవ్వకపోతే స్టేడియంలోని కొన్ని బాక్సులకు తాళాలు వేసి ఇబ్బందులు పెట్టారని ఆరోపించింది. ఇలాగైతే మా వల్ల కాదని.. మేం వేరే చోటుకు వెళ్లిపోతామని హెచ్‎సీఏకి లేఖ రాసింది SRH మేనేజ్మెంట్‎. హెచ్‎సీఏ, ఎస్ఆర్‎హెచ్ మధ్య రాజుకున్న పాసుల వివాదం హాట్ టాపిక్‎గా మారడంతో దీనిపై సీఎంవో ఆరా తీసింది. ఈ మేరకు ఎస్ఆర్‎హెచ్ యాజమాన్యాన్ని వేధింపులకు గురిచేసిన విషయంపై సీఎంఓ కార్యాలయం వివరాలు సేకరించింది. ఈ మేరకు SRH యాజమాన్యాన్ని పాసుల కోసం బెదిరించిన అంశంపై ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వయిరీకి ఆదేశించింది.

ఎస్ఆర్‎హెచ్, హెచ్‎సీఏ వివాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. చిల్లర వివాదాలతో ఎస్ఆర్‎హెచ్ మేనేజ్మెంట్ వేరే చోటుకి తరలివెళ్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే SRH యాజమాన్యాన్ని ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.