సింహాచలం దుర్ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

సింహాచలం దుర్ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

సింహాచలం దుర్ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ‘‘ఆంధ్ర ప్రదేశ్ సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదనను కలిగించింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.’’ అని పోస్ట్ చేశారు. 

విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో గాలి వానకు భారీ గోడ కూలిపోయింది.      ఈ ఘటనలో ఎనిమిది మంది భక్తులు చనిపోయారు.

సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు నిమగ్నమై ఉన్నాయి. 300 రూపాయల టిక్కెట్‌ కౌంటర్‌ దగ్గర ఇటీవలే గోడ నిర్మించారు. ఈదురుగాలులకు భారీ టెంట్‌ ఎగిరి గోడ మీద పడింది. టెంట్‌ పడడంతో గోడ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది చనిపోగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

సింహాచలంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత కుండపోత వర్షం కురిసింది. ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 

చనిపోయిన ఎనిమిది మంది మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింహాచలంలో స్వామిని నిజరూపంలో దర్శించుకునేందుకు భక్తులు అర్ధరాత్రి ఒంటిగంటకే భారీగా పోటెత్తారు.