
సాగు,తాగునీటిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీచేశారు. ఎండాకాలంలో ఎక్కడా తాగు,సాగునీటి సమస్య రావొద్దని..ప్రణాళిక ప్రకారం అధికారులు ముందుకెళ్లాలని ఆదేశించారు. ఎండలు పెరిగే కొద్దీ గడ్డు పరిస్థితులు తలెత్తుతాయి..రాబోయే 3 నెలలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు క్షేత్ర స్థాయికెళ్లి పరిస్థితులను అంచనా వేయాలని చెప్పారు. పంటలు ఎండిపోకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్.
కొత్త రేషన్ కార్డులు జారీ, తాగు, సాగునీరు, ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు.ప్రాజెక్టుల్లో నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.శ్రీశైలం,నాగార్జున సాగర్ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు రేవంత్. నిర్ణీత కోటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా చూడాలి.. దీని టెలిమెట్రీ విధానం అమలు చేయాలని ఆదేశించారు. టెలిమెట్రీ విధానానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లలో వెంటనే తనిఖీలు చేపట్టాలని సీఎం రేవంత్.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత శాఖ అధికారులకు చెప్పారు. ఓవర్ లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.