![TG అని గుండెల మీద రాసుకున్న వ్యక్తి దేవేందర్ గౌడ్: CM రేవంత్](https://static.v6velugu.com/uploads/2025/02/cm-revanth-launched-vijaya-telangana-book-written-by-devender-goud_MtER3lH87k.jpg)
హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ అంటే షార్ట్ కట్లో ‘టీజీ’ అని మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ గుండెల మీద రాసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అంటే టీజీ కాకుండా టీఎస్‌గా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చిందని.. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యమకారులకు గుర్తుగా టీఎస్‌ను కాస్తా టీజీగా మార్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘తెలంగాణ అంటే టీజీ అని ఉద్యమంలో ప్రజలు గుండెల మీద రాసుకున్నారు. కానీ తెలంగాణ వచ్చాక దాన్ని టీఎస్‌గా మార్చారు.
నాకు అవకాశం రావడంతో టీఎస్‌ను ప్రజలు కోరుకున్న విధంగా టీజీగా మార్పించాను. టీఎస్‌ను టీజీగా మార్చాలని అనుకున్నప్పుడు దేవేందర్ గౌడే గుర్తొచ్చారు. ఉద్యమంలో టీజీని గోడలపైనే కాదు.. గుండెల మీద రాసుకున్న వ్యక్తి దేవేందర్ గౌడ్’’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం (ఫిబ్రవరి 14) హైదరాబాద్‌లోని జలవిహార్‌లో దేవేందర్ గౌడ్ రాసిన విజయ తెలంగాణ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజయ తెలంగాణ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఉద్యమంపై చర్చ లోతుగా జరగాలి. ఉద్యమ చరిత్రపై సమగ్రమైన పుస్తకాలు రావాలి.
ALSO READ | కేసీఆర్ ఫ్యామిలీకి తెలంగాణలో జీవించే హక్కే లేదు: సీఎం రేవంత్
తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనలో కేవలం ఒక్క కుటుంబమే పాల్గొన్నట్లు చరిత్ర వక్రీకరించారు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో వర్గాలు పాల్గొన్నాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టి.. దేవేందర్ గౌడ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. గోదావరి జలాలు తెలంగాణలో పారించేందుకు దేవేందర్ గౌడ్ ఉద్యమం చేపట్టారు.
ఆయన పాదయాత్ర వల్లే ఆనాడు ప్రభుత్వం ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు చేపట్టింది. ఉద్యమ సమయంలో ప్రజలంతా టీజీ అని బండ్లు, బోర్డులు, గుండెల మీద రాసుకున్నారు. ప్రజలు కోరుకున్న విధంగానే ఇఫ్పుడు టీఎస్‌ను టీజీగా మార్చాం’’ అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన జయజయహే తెలంగాణ పదేళ్లు నివురుగప్పిన నిప్పులా ఉందని.. మేం అధికారంలోకి రాగానే జయ జయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా మార్చామని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి.