ఇవాళ( ఫిబ్రవరి 26) మోదీతో రేవంత్ భేటీ

ఇవాళ( ఫిబ్రవరి 26) మోదీతో రేవంత్ భేటీ
  • ఢిల్లీకి వెళ్లిన సీఎం..కాంగ్రెస్ పెద్దలనూ కలిసే చాన్స్ 
  • ప్రధానితో బీసీ రిజర్వేషన్లు, ట్రిపుల్ ఆర్, మెట్రోఫేజ్ 2 తదితర అంశాలపై చర్చించే అవకాశం
  • అనంతరం కుంభమేళాకు వెళ్లే చాన్స్ 

హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీతో సీఎం రేవంత్​రెడ్డి బుధవారం భేటీ కానున్నారు. ఈ మేరకు పీఎంవో అపాయింట్‌‌‌‌మెంట్​ఖరారు చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ మంగళవారం సాయంత్రమే ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్​ప్రాజెక్టులతో పాటు బీసీ రిజర్వేషన్లు, మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్ట్‌‌‌‌కు అనుమతులు, ట్రిపుల్ ఆర్ తదితర అంశాలపై ప్రధాని మోదీతో ఆయన చర్చించనున్నట్టు తెలుస్తున్నది. 

స్థానిక సంస్థలతో పాటు విద్య , ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో బిల్లులు ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీ ఆమోదం తర్వాత పార్లమెంట్‌‌‌‌లోనూ ఆమోదించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ కోరనున్నారు. తమిళనాడు తరహాలో తెలంగాణ బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌‌‌‌లో చేర్చాలని ఆయన విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. 

అలాగే కొంతమంది కేంద్రమంత్రులను కూడా  కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కూడా కలిసే చాన్స్ ​ఉంది. ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు షెడ్యూల్​రిలీజ్ కావడంతో దీనిపై హైకమాండ్‌‌‌‌తో చర్చించనున్నారు. కాగా, ప్రధానితో భేటీ అనంతరం సీఎం రేవంత్​రెడ్డి మహా కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్‌‌‌‌రాజ్‌‌‌‌ వెళ్లనున్నట్టు తెలిసింది.