- వరద సాయం చేయాలని విజ్ఞప్తి చేయనున్న సీఎం
- ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా..
- సీఎం రేవంత్‌తో కలిసి పార్టీ పెద్దలను కలిసే చాన్స్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. వరద నష్టంపై నివేదిక ఇచ్చి, ఆర్థిక సాయం అందజేయాలని కేంద్రాన్ని కోరేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లినట్టు సీఎంవో వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నట్టు పేర్కొన్నాయి. ఇప్పటికే అమిత్ షాతో భేటీకి అపాయింట్ మెంట్ ఖరారు కాగా, ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఖరారు కావాల్సి ఉంది. గురువారం మధ్యాహ్నం అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై ఆయనకు నివేదిక అందజేసి, తగినంత ఆర్థిక సాయం అందజేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఆ తర్వాత గురువారం సాయంత్రం లేదా రాత్రి ప్రధాని మోదీని సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉంది.
కీలక అంశాలపై హైకమాండ్ తో చర్చ..
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి వెళ్లారు. ఆయన పీసీసీ చీఫ్‌గా నియమితులైన తర్వాత మొదటిసారి ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ నేతలను మర్యాదపూర్వకంగా కలిసేందుకే మహేశ్ ఢిల్లీకి వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ వేర్వేరుగా ఢిల్లీకి వెళ్లినప్పటికీ.. ఇద్దరూ ఒకేసారి అక్కడికి వెళ్లడంతో పార్టీలో చర్చ జరుగుతున్నది. వీళ్లిద్దరూ రాష్ట్ర రాజకీయ అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నందున అగ్ర నేతలు ఖర్గే, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షితో సమావేశమయ్యే అవకాశం ఉందని చెబుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ, బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు, తర్వాతి పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. అలాగే పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై కూడా చర్చ ఉంటుందని అంటున్నాయి. కాగా, డిప్యూటీ సీఎం భట్టికి కూడా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినప్పటికీ, ఆయన కేరళలో గురువారం జరగనున్న రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు.