ఐఏఎస్​లూ.. మారండి .. తప్పులను ఎంకరేజ్​ చేయొద్దు: సీఎం రేవంత్​రెడ్డి

ఐఏఎస్​లూ.. మారండి .. తప్పులను ఎంకరేజ్​ చేయొద్దు: సీఎం రేవంత్​రెడ్డి
  • కొందరు ఆఫీసర్లు ఏసీ గదులను దాటుతలే
  • ఒకప్పుడు లీడర్ల కన్నా ఆఫీసర్లతోనే జనం మమేకమయ్యేవారు
  • ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడుంది? 
  • శంకరన్​, శేషన్​, మన్మోహన్​ లాంటి వాళ్లను స్ఫూర్తిగా తీసుకోవాలి
  • నిబద్ధత కలిగిన ఆఫీసర్లకు కచ్చితంగా గుర్తింపు ఉంటుంది
  • యంగ్​ సివిల్​ సర్వెంట్లకు రిటైర్డ్​ ఆఫీసర్లతో సెమినార్లు నిర్వహిస్తామని వెల్లడి
  • రిటైర్డ్​ ఐఏఎస్​ గోపాలకృష్ణ నాయుడు రాసిన ‘లైఫ్​ ఆఫ్​ ఏ కర్మ యోగి’ పుస్తకావిష్కరణ

హైదరాబాద్, వెలుగు: దేశం బలపడటం, ఆర్థికంగా నిలదొక్కుకోవటం వెనుక ఎందరో సివిల్​ సర్వెంట్ల త్యాగాలు ఉన్నాయని.. కానీ, ఇప్పుడు కొందరు ఐఏఎస్​లు, ఐపీఎస్​లు తప్పులను ఎంకరేజ్​ చేస్తున్నారని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. రాజకీయ నాయకులు ఒక తప్పు చేద్దామని అంటే.. ఒకేసారి మూడు తప్పులు చేద్దామనేలా కొందరు బ్యూరోక్రాట్లు తయారయ్యారని.. ఇది సమాజానికి మంచి పరిణామం కాదని పేర్కొన్నారు. ఒకప్పుడు సీఎం, మంత్రులు ఏదైనా అంశంలో నిర్ణయాలు తీసుకుంటే.. అందులో ఉండే లోటుపాట్లను ఐఏఎస్ అధికారులు వివరంగా చెప్పేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పొలిటికల్​ ఎగ్జిక్యూటివ్​ ఒక తప్పు చేయాలని చెప్తే.. ‘ఒక్కటి ఎందుకు సార్. ఒకేసారి మూడు తప్పులు చేద్దాం.. బాగుంటది’ అనేలా కొందరు బ్యూరోక్రాట్స్​ వ్యవహరిస్తున్నరు” అని ఆయన తెలిపారు. కొందరిలోనైనా మార్పు వస్తుందనే తాను ఈ విషయం చెప్తున్నానని అన్నారు. 

రిటైర్డ్​ ఐఏఎస్​ గోపాలకృష్ణ నాయుడు రాసిన ‘లైఫ్​ ఆఫ్​ ఏ కర్మ యోగి’ పుస్తకాన్ని సీఎం రేవంత్​ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐఏఎస్ అత్యంత గౌరవప్రదమైన పోస్టు అని తెలిపారు. ఏదైనా ఫైల్​ వస్తే దానిపై నోట్​ ప్రిపేర్​ చేసి, అందులోని లోటుపాట్లు వివరించి, ప్రజలకు నష్టం కలుగకుండా చూడాల్సిన బాధ్యత ఐఏఎస్​లదని.. కానీ, ఇయ్యాల రేపు అదేం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.‘‘ఎంతోమంది సివిల్​ సర్వెంట్స్​ తమ లైఫ్​ను త్యాగం చేసి దేశాన్ని నిలబెట్టారు. వారిని కొత్తవాళ్లు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి. ఇప్పుడు వస్తున్న కొందరు ఐఏఎస్​లు, ఐపీఎస్​లు పొలిటిషియన్లను, సమాజంలో ఉండే రాంగ్​ ప్రిసిడెంట్స్​ను రోల్​ మోడల్​గా తీసుకుంటున్నట్లు అనిపిస్తున్నది. ఈ విషయం నేను చెప్పడం వెనుక కొందరైనా మారుతారనే ఉద్దేశమే ఉంది”అని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. 

జిల్లాల్లో ఉన్నప్పుడు వచ్చే అనుభవమే గొప్పది 

గతంలో ప్రజలు లీడర్స్​ కంటే కూడా ఆఫీసర్స్​తో ఎక్కువ మమేకమయ్యేవారని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ‘‘కలెక్టర్​ దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కారమవుతుందని జనం చెప్పుకునేవారు. తమ గూడెంకు కలెక్టర్ కు వచ్చారని గతంలో గర్వంగా చెప్పేటోళ్లు. ఈ రోజు నేను రాష్ట్రంలో ఉన్న యంగ్ ఐఏఎస్​, ఐపీఎస్​లకు పదే పదే ఈ విషయమే చెప్తున్నాను. బయటకు వెళ్లాలని, క్షేత్రస్థాయిలో ప్రజలను కలవాలని అంటున్నాను. కొందరు అసలు ఏసీ రూంల్లో నుంచి బయటకు వెళ్లేందుకు హెజిటెట్ చేస్తున్నారు. ఏసీ జబ్బు ఏమన్నా ఉందా తెల్వదు. 

ఐఏఎస్​, ఐపీఎస్​లకు జిల్లాలో ఉన్నప్పుడు వచ్చే అనుభవమే గొప్పది. ఆ తర్వాత సెక్రటరీ లెవెల్​కు వస్తే.. ఫైల్​ చూడటమే తప్ప సామాన్య ప్రజలతో ఇంటరాక్ట్​ అవ్వడం అంత ఉండదు”అని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడున్న అధికారుల విధానంలో, ఆలోచనలో మార్పు రావాలన్నారు. ‘‘కొంతమంది నిబద్ధత కలిగిన అధికారులకు వెంటనే పోస్టింగ్​ రాకపోవచ్చు.. కానీ, తప్పకుండా గుర్తింపు ఉంటుంది. వెంటనే లేకపోయినా.. రాష్ట్రానికి, ప్రజలకు ఏమైనా చేయాలనుకున్న ప్రభుత్వం, పొలిటికల్​ ఎగ్జిక్యూటివ్​ వచ్చినప్పుడు వెతికి మరీ పోస్టింగ్​ ఇస్తారు”అని ఆయన తెలిపారు. 

శంకరన్​, శేషన్​, మన్మోహన్ ​లాంటి వాళ్లు కావాలి

ఒక శంకరన్​, శేషన్​, డాక్టర్​ మన్మోహన్​ సింగ్​ లాంటి వాళ్ల గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. ‘‘సమయస్ఫూర్తి, నిజాయితీ, పేద ప్రజల పట్ల నిబద్ధతో పనిచేసిన గొప్ప ఐఏఎస్​ అధికారి శంకరన్. దేశంలో ఎలక్షన్​ కమిషన్​ ఉంటదని గుర్తు చేసేలా శేషన్​ గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ కూడా బ్యూరోక్రాట్ నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు. దేశాన్ని అభివృద్ధిలో నడిపించారు. బ్యూరోక్రాట్స్​ పొలిటికల్​ ఎగ్జిక్యూటివ్​ జాబ్​ కూడా చేయగలరని మన్మోహన్​ సింగ్​ చేసి చూపించారు. ఈ అనుభవాల నుంచి కొత్త ఐఏఎస్​లు నేర్చుకోవాలి”అని తెలిపారు. కొద్దిమంది ఐఏఎస్​ల్లోనైనా మార్పు రావాలని, ఆదర్శంగా ఉన్నవారి గురించి చర్చ జరగాలని సీఎం ఆకాంక్షించారు. 

యంగ్ సివిల్​ సర్వెంట్లకు అనుభవాలను పంచేందుకు రిటైర్డ్​ ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులతో సెమినార్ సెషన్స్​ను ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక అనుభవం అనేది వెలకట్టలేమని.. కొనడానికి అవకాశం లేదని అన్నారు. అనుభవాన్ని పుస్తక రూపంలో తీసుకురావడంలో గోపాలకృష్ణ నాయుడు సక్సెస్​ అయ్యారని ఆయన పేర్కొన్నారు. నెహ్రూ దగ్గర నుంచి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరకు ఆయన ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారని.. ఫ్యూచర్​ను కూడా విజువలైజ్​ చేయగలుగుతున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో సీఎస్​ శాంతి కుమారి, స్పెషల్​ సీఎస్​ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 

మంత్రి పదవుల్లోకి వచ్చే నేతలకు తమ పోర్ట్​ఫోలియోలపై అవగాహన ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. ఒక్కోసారి.. ఏం చదువుకోనివాళ్లకు కూడా విద్యాశాఖ మంత్రి పదవి రావొచ్చు.. బీటెక్​ వంటి చదువులు చదివినోళ్లకు వైద్య శాఖ రావొచ్చు. వాళ్ల దగ్గరికి ఏదైనా ఫైల్​ వస్తే దానిపై నోట్​ ప్రిపేర్​ చేసి, అందులోని లోటుపాట్లు వివరించి, ప్రజలకు నష్టం కలుగకుండా చూడాల్సిన బాధ్యత ఐఏఎస్​లది. కానీ, ఇయ్యాల రేపు అదేం జరగడం లేదు. పైగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైనా ఆలోచన చేస్తే.. ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నరు. ట్రైనింగ్​లో ఉన్నప్పుడే కొందరు ఐపీఎస్​లు పోలీస్​స్టేషన్లకు వెళ్లి, సివిల్​ పంచాయితీలు తెంపేందుకు ప్రయత్నిస్తున్నరు. ఇది దురదృష్టకరం.

సీఎం రేవంత్​రెడ్డి