దేవుడి ఆశీస్సులతో తక్కువ నష్టంతోనే బయటపడ్డం: సీఎం రేవంత్

దేవుడి ఆశీస్సులతో తక్కువ నష్టంతోనే బయటపడ్డం: సీఎం రేవంత్

హైదరాబాద్:  ఖైరతాబాద్ బడా గణేషుడి ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గణేష్ చతుర్థి సందర్భంగా ఇవాళ (సెప్టెంబర్ 7) ఖైరతాబాద్ బడా గణనాథుడికి అర్చకులు తొలి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి మనువడితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‏కు అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం రేవంత్ ఖైరతాబాద్ వినాయకుడికి తొలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 70 ఏండ్లుగా ఖైరతాబాద్‎లో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయని.. ఖైరతాబాద్ బడా గణేషుడి ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు.

 ఖైరతాబాద్ ఉత్సవ సమితి ప్రతినిధులతో ముందే మాట్లాడామని.. ఉత్సవాలకు అన్ని విధాల సహకరిస్తామని చెప్పామన్నారు. హైదరాబాద్ సిటీలో అత్యంత గొప్పగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయని.. హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు. ఈ ఏడాది ఒక్క హైదరాబాద్ సిటీలోనే లక్షా 40 వేల గణనాథుడి విగ్రహాలు ఏర్పాటు చేశారని తెలిపారు. గణేష్ మంటపాలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నట్లు ఈ సందర్భంగా మరోసారి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 

Also Read :- బెల్లంపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రత్యేక పూజలు..

ఇక, ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని.. దేవుడి ఆశీస్సులతో తక్కువ నష్టంతోనే బయటపడ్డామని అన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ పూజ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ,  రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.