కావాలనే రెచ్చగొడుతున్నారు: గ్రూప్-1 ఆందోళనలపై స్పందించిన CM రేవంత్

కావాలనే రెచ్చగొడుతున్నారు: గ్రూప్-1 ఆందోళనలపై స్పందించిన CM రేవంత్

హైదరాబాద్: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు చేస్తోన్న ఆందోళనలపై  సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. 2024, అక్టోబర్ 19న రాజేంద్ర నగర్‎లోని పోలీస్ అకాడమీలో జరిగిన పోలీస్ ఫస్ట్ డ్యూటీ మీట్ క్లోజింగ్ సెర్మనీ ఈవెంట్‎కు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామకాలు  చేపట్టలేదు.. మేం అధికారంలోకి వచ్చాకే వేలాది కొత్త ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఒక్కసారి గ్రూప్ 1 నియామకాలు జరగలేదని.. అందుకే ఇంకా కాలాయాపన చేయకూడదని గ్రూప్ 1 పరీక్షలు తొందరగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.  

తరచూ పరీక్షల వాయిదా పడటం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారన్న రేవంత్ రెడ్డి.. అశోక్ నగర్‎లో గ్రూప్ 1 అభ్యర్థులను కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నిబంధనలు మార్చడం సరికాదని.. అలా మారిస్తే కోర్టులు ఊరుకోవని క్లారిటీ ఇచ్చారు. డీఎస్సీ పరీక్షలకు ముందు కూడా ఇదే రకంగా గందరగోళం సృష్టించారని.. కానీ తెలంగాణ ప్రభుత్వ వాదనను హైకోర్టు సమర్థించిందని గుర్తు చేశారు. వాయిదాల వల్ల విద్యార్థులు ఇతర ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి ఉంటుందని.. కొన్ని పార్టీల మాయమాటలు నమ్మి మోసపోవద్దని నిరుద్యోగులకు  పిలుపునిచ్చారు. 

ALSO READ : యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ త్వరలోనే ఏర్పాటు: సీఎం రేవంత్

జీవో 29 రద్దు అంశంపైన సీఎం రియాక్ట్ అయ్యారు. జీవో నెంబర్ 55 ప్రకారం పోతే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నష్టం జరిగేదని.. అందుకే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని జీవో నెం 29 తీసుకొచ్చామని క్లారిటీ ఇచ్చారు. గ్రూప్ 1 మెయిన్స్ 1:50కి కూడా రిజర్వేషన్లు పాటిస్తున్నామని స్పష్టం చేశారు. గడిచిన పదేళ్లలో ఉద్యోగాల భర్తీని బీఆర్ఎస్ పట్టించుకోలేదని.. గత పదేళ్లలో వీరు ఎప్పుడైనా నిరుద్యోగులను కలిశారా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను గాలికి వదిలేసి.. ఇవాళ నాటకాలు ఆడుతున్నారని నిప్పులు చెరిగారు.