హీరో అల్లు అర్జున్ అరెస్టుపై.. ఢిల్లీలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. ఇందులో ఎవరి జోక్యం ఉండదని స్పష్టం చేశారాయన. ఇందులో నా జోక్యం కూడా ఏమీ ఉండదని.. చట్టం ముందు అందరూ సమానమే అని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.
చట్టపరంగా ఎలాంటి ప్రక్రియ జరుగుతుందో.. అల్లు అర్జున్ విషయంలోనూ ఇదే జరుగుతుందని.. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదని వెల్లడించారాయన. పుష్ప 2 మూవీ ధియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన క్రమంలోనే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
డిసెంబర్ 4న పుష్ప-2 ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ను డిసెంబర్ 13న ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి అతనిని అదుపులోకి తీసుకున్నారు. పుష్ప-2 సినిమాపై బీభత్సమైన క్రేజ్ ఉన్న సమయంలో అల్లు అర్జున్ థియేటర్కు వెళ్లడం, అభిమానుల అత్యుత్సాహం వల్ల జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ నిండు ప్రాణం పోయింది. ఆమె కొడుకు ఆసుపత్రి పాలయ్యాడు.
ALSO READ : చిరంజీవి వెళ్లేది పోలీస్ స్టేషన్‌కు కాదు.. అల్లు అర్జున్ ఇంటికి
ప్రాథమిక దర్యాప్తులో సంధ్య థియేటర్ యజమానుల్లో ఒకరైన సందీప్, థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజు, థియేటర్ లోయర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీ ఇన్చార్జి గంధకం విజయ చందర్ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డిసెంబర్ 5న భాస్కర్ ఈ ఫిర్యాదు చేశాడు. ఈ తొక్కిసలాట ఘటనపై విచారించిన పోలీసులు డిసెంబర్ 9న సంధ్య థియేటర్ మేనేజర్తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. శుక్రవారం ఇదే కేసులో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు:
105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు
105 సెక్షన్ నాన్‌బెయిలబుల్ కేసు
5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం
BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం