తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పాత్ర ఎనలేనిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి డీఎస్ ఆత్మీయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. 2004 లో పీసీసీ అధ్యక్షుడిగా సోనియా గాంధీకి తెలంగాణ ఏర్పాటు అవసరాన్ని చెప్పారని.. దీంతో కరీంనగర్ లో సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకు సమ్మతించారని సీఎం తెలిపారు.
2024, జూన్ 30వ తేదీ ఆదివారం ఉదయం డీఎస్ భౌతికకాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. నిజామాబాద్ లోని డీఎస్ నివాసానికి వెళ్లి ఆయన పార్థీవదేహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్.. సోనియా గాంధీతో డీఎస్ కు ఉన్న అనుబంధం కారణంగానే రాష్ట్ర కల సాకారం అయిందన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన కృషి చేశారని చెప్పారు.
కొన్ని అనివార్య పరిస్థితుల్లో డీఎస్ పార్టీకి దూరమైనా.. పార్లమెంట్ సెంట్రల్ హల్ లో ఎదురు పడినప్పుడు సోనియా గాంధీ, ఆయనను ఆత్మీయంగా పలకరించేవారన్నారని సీఎం చెప్పారు. పార్టీలో లేకపోయినా.. డీఎస్ మనవాడు అని సోనియా గాంధీ అన్నారని.. ఆ సమయంలోనే మళ్ళీ పార్టీలో చేరుతానని ఆయన చెప్పారన్నారు. తాను చనిపోయినప్పుడు కాంగ్రెస్ జెండా కప్పాలని మాత్రమే డీఎస్ కోరుకున్నారని.. అందుకే అధికారిక లాంచనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసినట్లు సీఎం తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు ఆయన ఇంటికి వెళ్లి పార్థివదేహంపై కాంగ్రెస్ జెండా కప్పారని.. ఆయన చివరి కోరిక నెరవేర్చామని రేవంత్ అన్నారు.
పార్టీకి చేసిన సేవలను గుర్తుంచుకుని డీఎస్ కు నివాళులు అర్పించానని సీఎం చెప్పారు. ఆయన జ్ఞాపకార్థం ప్రభుత్వం తరఫున కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. డీఎస్ కారణంగా అనేక మంది నాయకులు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని.. ఆయన గౌరవం పెరిగే విధంగా ప్రభుత్వం అండగా నిలబడుతుందన్నారు. సోనియా, రాహుల్ గాంధీలు డీఎస్ కు నివాళులు అర్పించాలని తనకు ప్రత్యేకంగా చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.