తుమ్మడిహట్టి దగ్గర కాకుండా.. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కడితే ఉపయోగం లేదని ఇంజినీర్లు నివేదిక ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ నియమించిన అధికారులే ఈ నివేదిక ఇచ్చారని.. నిపుణుల మాటలు కాదని.. మేడిగడ్డ దగ్గర కట్టాలన్న పురుగు పుట్టింది కేసీఆర్ బుర్రలోనే అని.. ఇంజినీర్లతో కాదు.. కేసీఆర్ కు తోచిందే డిజైన్ చేయించారని సభలో వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో కడితే మహారాష్ట్రలో 1850 ఎకరాలు ముంపునకు గురవుతుందని.. అదే 151 మీటర్ల దగ్గర అయితే 1250 ఎకరాలు మునుగుతుందని నివేదికఇచ్చారని.. అది పట్టా ల్యాండ్స్ అని.. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించినట్లయితే ఉపయోగంగా ఉంటుందని ఇంజినీర్లు ఇచ్చిన నివేదికను సభలో చూపించారు సీఎం రేవంత్ రెడ్డి.
తుమ్మడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా ఒప్పించాలని.. కనీసం 150 మీటర్ల దగ్గర అయినా ఒప్పందం కుదిరితే.. ఎంతో ఖర్చు తగ్గుతుందని.. గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వొచ్చని ఇంజినీర్లు పదే పదే చెప్పినా.. కేసీఆర్ వినకుండా మేడిగడ్డ దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో.. డిజైన్ మార్చి.. లక్షల కోట్లు ఖర్చు పెట్టి.. సొంత తెలివితో కాళేశ్వరం కట్టిన మాట వాస్తవం కాదా అని హరీశ్ రావును ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.
తుమ్మడిహట్టి నుంచి చేవెళ్లకు నీళ్లు తీసుకురాకుండా.. కేసీఆర్ తెలివితో మేడిగడ్డ దగ్గర కటి.. మెదక్ జిల్లా మల్లన్నసాగర్ దగ్గరకు మాత్రమే పరిమితం చేసి.. రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేసింది నిజం కాదా అని హరీశ్ రావును నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి