- ఫ్యూచర్ సిటీ, శామీర్‌పేట్, మేడ్చల్ మెట్రో మార్గాలకు ఏప్రిల్‌లో టెండర్లు పిలవాలి
- శామీర్ పేట్, మేడ్చల్ మెట్రోల ప్రారంభంలో భారీ జంక్షన్ ఏర్పాటు చేయాలి
- హెచ్‌జీసీఎల్ కింద రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు
- మెట్రో, ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లపై సమీక్ష
హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్ సిటీ, శామీర్‌పేట్, మేడ్చల్ మెట్రో మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) లు మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూడు మెట్రోల డీపీఆర్‌లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది.. ఏప్రిల్ నెలాఖరుకు టెండర్లు పిలవాలని సీఎం సూచించారు. హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్ల నిర్మాణాలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలపై జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం – -ఫ్యూచర్ సిటీ మెట్రో(40 కి.మీ.), జేబీఎస్-–శామీర్‌పేట మెట్రో (22 కి.మీ.), ప్యారడైజ్– మేడ్చల్ మెట్రో (23 కి.మీ.) మార్గాలకు సంబంధించి భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఎలైన్‌మెంట్ రూపొందించేటప్పుడే క్షేత్ర స్థాయిలో సమగ్ర పరిశీలన చేయాలన్నారు. మేడ్చల్ నేషనల్హైవే మార్గంలో ఇప్పటికే ఉన్న మూడు ఫ్లై ఓవర్లను దృష్టిలో ఉంచుకొని మెట్రో లైన్ తీసుకెళ్లాలని సీఎం సూచించారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు జంక్షన్లు..
శామీర్‌పేట్, మేడ్చల్ మెట్రోలు ఒకే చోట ప్రారంభమయ్యేలా చూసుకోవాలని అక్కడ అధునాతన వసతులు, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు భారీ జంక్షన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆయా ప్రాంతాల వారు ప్రతి పనికి సిటీలోకి రానవసరం లేకుండా.. అక్కడే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఆ జంక్షన్‌ను అభివృద్ధి చేయాలన్నారు. జంక్షన్‌కు సంబంధించిన పూర్తి ప్రణాళికను తయారు చేయాలని సీఎం ఆదేశించారు.
హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) కింద రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాస రాజు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాల కమిషనర్ శశాంక తదితరులు పాల్గొన్నారు.