ఆఫీసుల్లో కూర్చుంటే నడువది.. జనంలోకి వెళ్లండి.. సమస్యలు తెలుసుకోండి

ఆఫీసుల్లో కూర్చుంటే నడువది.. జనంలోకి వెళ్లండి.. సమస్యలు తెలుసుకోండి
  • ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం
  • వారానికోసారి జిల్లాల్లో పర్యటించండి 
  • నెలకోసారి శాఖల వారీగా రివ్యూలు చేపట్టండి
  • అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలి
  • కొందరు కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని అసంతృప్తి
  • పనితీరు ఆధారంగానే అవకాశాలు వస్తాయని వెల్లడి 
  • సెక్రటేరియెట్​లో అన్ని శాఖల సెక్రటరీలతో సమావేశం

హైదరాబాద్, వెలుగు: ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కేవలం ఆఫీసులకే పరిమితం కాకుండా, ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారు. ‘‘వివిధ డిపార్ట్ మెంట్ల హెచ్​వోడీలు అందరూ సెక్రటేరియెట్​లో అందుబాటులో ఉంటూనే.. కనీసం వారానికోసారి జిల్లాల పర్యటనకు వెళ్లాలి. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడంతో పాటు పనుల పురోగతిని పర్యవేక్షించాలి. నెలకోసారైనా శాఖల వారీగా అధికారులతో రివ్యూలు చేపట్టి.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరుగులు పెట్టించాలి” అని దిశానిర్దేశం చేశారు. త్వరలో తాను కూడా జిల్లాల్లో పర్యటిస్తానని, ప్రజలను నేరుగా కలిసి మాట్లాడతానని, అందరం కలిసి తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని చెప్పారు. 

మంగళవారం సెక్రటేరియెట్ లో అన్ని శాఖల సెక్రటరీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మొత్తం 29 విభాగాలకు చెందిన ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.  

కొత్త ఐడియాలతో రండి.. 

ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అధికారులందరూ క్రమశిక్షణ పాటించాలని, ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పని చేయాలని సీఎం రేవంత్ సూచించారు. ‘‘హెచ్​వోడీలు సమయపాలన పాటించాలి. టైమ్ ప్రకారం సెక్రటేరియెట్​లో అందుబాటులో ఉండాలి. కేవలం ఆఫీసులకు పరిమితం కాకుండా తమ విభాగం పనితీరును పర్యవేక్షించేందుకు వారానికి ఒకరోజు విధిగా జిల్లాలకు వెళ్లాలి. 

క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాలి. నెలకోసారి అన్ని జిల్లాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి.. తమ విభాగం చేపట్టిన కార్యక్రమాలు, పనుల పురోగతిపై సమీక్ష జరపాలి” అని దిశానిర్దేశం చేశారు. ఉన్నతాధికారులంతా తమ పరిధిలోని విభాగాలపై పట్టు సాధించాలని, తమ శాఖల పని తీరును మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. 

‘‘ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేశాం. అయితే ఆ తర్వాత ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు, పనులు నిలిచిపోయాయి. ఇకపై అధికారులు పాలనపై దృష్టి సారించాలి. ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలతో ముందుకురావాలి. అలాంటి ఐడియాలను ఎప్పటికప్పుడు నేరుగా సీఎంవోతో పంచుకోవాలి” అని సూచించారు. 

కలెక్టర్లు కదలాలి.. 

చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్లంతా తమ జిల్లాల్లో ఏమి జరుగుతున్నదో తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని సీఎస్ ను ఆదేశించారు. హాస్పిటళ్లు, స్కూళ్లు, అంగన్​వాడీ కేంద్రాలు, ప్రజలకు  సేవలందించే అన్ని విభాగాలను ఎప్పటికప్పుడు సందర్శిస్తూ లోటుపాట్లను సరిచేయాలని సూచించారు. ‘‘ప్రజలు ఎదుర్కొనే కష్టాలు, ఇబ్బందులపై, అనూహ్యంగా జరిగే దుర్ఘటన సమయంలో అధికారులు సత్వరమే స్పందించాలి. 

అన్ని శాఖల్లో మెరుగైన విధానాలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే. వ్యక్తుల ఇష్టాయిష్టాలతో మా ప్రభుత్వానికి సంబంధం లేదు. వ్యక్తిగతంగా అధికారులపై నాకు రాగద్వేషాలేమీ లేవు. కేవలం పనితీరు ఆధారంగానే అధికారులకు మంచి అవకాశాలు వస్తాయి. బాగా పనిచేసే వారికి ప్రోత్సాహకాలు ఉంటాయి. సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దు. సీఎంవో ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు పలువురు ముఖ్యమంత్రులతో పని చేసిన అనుభవమున్న అధికారులు ఇప్పటికీ కీలక విభాగాల్లో ఉన్నారు. 

అధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యాలను గుర్తించి, అందుకు అనుగుణంగా పని చేయాలి. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేయాలి’’ అని సూచించారు. సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి పాల్గొన్నారు.

త్వరలో నేనూ వస్తా..

నేను కూడా త్వరలో జిల్లాల్లో పర్యటిస్త. వారానికో జిల్లాకు వస్త. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులతో పాటు క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాల అమలు తీరును పరిశీలిస్త. ప్రజలను కలిసి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో? స్కీములు అందుతున్నాయో? లేదో? తెలుసుకుంట. నా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల చేస్తం. 
- సీఎం రేవంత్ రెడ్డి