బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లపై వేటు : సీఎం రేవంత్​రెడ్డి

బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లపై వేటు : సీఎం రేవంత్​రెడ్డి
  • దేశానికి రాహుల్ ప్రధాని అయితేనే రిజర్వేషన్లుంటయ్
  • 2021లో జనగణన ఎందుకు చెయ్యలేదో మోదీ, అమిత్ షా చెప్పాలి 
  • సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచనలో ప్రధాని
  • తెలంగాణకు ఆయన ఇచ్చింది గాడిద గుడ్డు
  • పదేండ్ల పాలనలో రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదు
  • బీఆర్ఎస్​ సచ్చిన పాము.. బీజేపీ అబద్ధాల పుట్ట
  • పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను గెలిపించండి
  • కొప్పుల ఈశ్వర్​ ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదు
  • పత్తిపాక రిజర్వాయర్​, పాలకుర్తి లిఫ్ట్, 800 మెగావాట్ల పవర్ స్టేషన్ పూర్తిచేస్తం
  • నేతకాని  కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ
  • ధర్మపురి కాంగ్రెస్​ జనజాతర సభలో ప్రసంగం

జగిత్యాల, వెలుగు:  బీజేపీకి వేసే ప్రతి ఓటు.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై వేటులాంటిదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ఇప్పుడున్న రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్​కు ఓటేయాలని, వద్దనుకుంటే బీజేపీకి వేయాలని ప్రజలకు సూచించారు. పెద్దపల్లి లోక్​సభ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లిలో కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా శుక్రవారం నిర్వహించిన  జన జాతర సభలో సీఎం రేవంత్​రెడ్డి పాల్గొని, మాట్లాడారు. 

బీజేపీది అబద్ధాల యూనివర్సిటీ.. ఇందులో నాయకులు పీహెచ్​డీలు చేశారు. పొద్దున లేస్తే తెలంగాణకు ఇది తెచ్చాం.. అది ఇచ్చాం అని మాట్లాడుతున్నారు.  పదేండ్లు పీఎంగా ఉన్న మోదీ, కేంద్ర మంత్రులుగా ఉన్న  అమిత్ షా, కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం తెచ్చారో ప్రజలకు చెప్పాలి’’ అని రేవంత్ రెడ్డి​ డిమాండ్​ చేశారు. తెలంగాణకు సోనియా ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని మోదీ సర్కార్​ కాలగర్భంలో కలిపిందని.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, రంగారెడ్డిలో ఐటీఐఆర్ ప్రాజెక్టు​ను రద్దు చేసిందని ఫైర్​ అయ్యారు. 

ఐఐటీ, ఐఐఎం యూనివర్సిటీలు ఏర్పాటు చేయకుండా.. పాలమూరు-– రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా వివక్ష చూపారని రేవంత్​ అన్నారు. గుజరాత్ రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్, సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకువెళ్లిన బీజేపీ.. తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. సింగరేణి బొగ్గు గనులను సైతం ప్రైవేటీకరించి సంస్థను చంపేద్దామని ప్రధాని మోదీ ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. 

బీజేపీ సర్కార్ 400  సీట్లు కావాలని అడుగుతున్నదని, దీని వెనుక రిజర్వేషన్లను రద్దు చేసే పెద్ద కుట్ర దాగి ఉన్నదని అన్నారు. అంబేద్కర్ దళిత, బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాంగంలో విద్య, రిజర్వేషన్లు కల్పిస్తే.. బీజేపీ వాటిని  రద్దు చేయాలని చూస్తున్నదని చెప్పారు. ‘‘పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను గెలిపించండి. రామగుండం నియోజకవర్గంలో పత్తిపాక రిజర్వాయర్, పాలకుర్తి లిఫ్ట్,  800 మెగా వాట్ల పవర్ స్టేషన్ ఏర్పాటు చేస్తం. ఈ ప్రాంత నేతకాని  సోదరుల కోసం కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తం” అని రేవంత్​ హామీ ఇచ్చారు.

దేశ సేవలో ముగ్గురు పెద్దపల్లి నేతలు 

పెద్దపల్లి పార్లమెంట్​ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు దేశంలోనే ఎంతో చరిత్ర ఉన్నదని, ఇక్కడి నుంచి  ప్రాతినిథ్యం వహించిన పీవీ నర్సింహారావు, కాకా వెంకటస్వామి, శ్రీపాద రావు కృషి ఎంతో ఉన్నదని రేవంత్​రెడ్డి చెప్పారు. సింగరేణి దివాలా తీసి మూతపడే పరిస్థితిలో కాకా వెంకటస్వామి కేంద్రంతో కొట్లాడి సంస్థను కాపాడారని చెప్పారు. ఆర్థిక సంస్కరణలు పీవీ నర్సింహారావు తీసుకుచ్చినవేనని అన్నారు.   రాజకీయాలకు అతీతంగా స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన నేతగా శ్రీపాదరావు గుర్తింపు పొందారని తెలిపారు. ఈ ముగ్గురు నేతలు ప్రజల మధ్యనే శేష జీవితం గడిపిన గొప్ప నాయకులని కొనియాడారు. 50 వేల కుటుంబాలు ఉన్న సింగరేణి కార్మికులు మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతుగా నిలబడ్డారని, ఈసారికూడా అదేస్థాయిలో ఆదరించాలని కోరారు. 

బీఆర్ఎస్, కొప్పులకు ఓటు అడిగే హక్కు లేదు

బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్​ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో  ఓడిన కొప్పుల కలెక్టర్ కాళ్లు పట్టుకుని గెలిచినట్టు ప్రకటించుకున్నారని రేవంత్ ​రెడ్డి విమర్శించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, బీఆర్ఎస్ పార్టీకి, కొప్పుల ఈశ్వర్​కు ఈ ఎన్నికల్లో నిలబడే అర్హత లేదని అన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్​లో రైతుల భూములు, పంటలు మునిగిపోతున్నా పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ఏ ముఖం పెట్టుకుని కొప్పుల ఈశ్వర్ కార్మికులను ఓట్లు అడిగేందుకు వస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చచ్చిన పాము అని, కొనఊపిరితో ఉన్న బీఆర్ఎస్​ను పడగ మీద కొడితే ఇక పీడ విరగడవుతుందని అన్నారు. 

కాకా మనుమడిని గెలిపించండి: గడ్డం వినోద్ 

కాంగ్రెస్ పెద్దలు  వంశీ కృష్ణను ఆశీర్వదించి  టికెట్ ఇచ్చారని,  ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని  బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్​ ప్రజలను కోరారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయడానికే మోదీ ‘అబ్​ కీ బార్​.. చార్ సౌ పార్’ నినాదం అందుకున్నారని ఆరోపించారు.

కాళేశ్వరం పేరిట కేసీఆర్​ దోచుకున్నడు: వంశీకృష్ణ

పెద్దపల్లి  ప్రాంత అభివృద్ధి కోసం జైపూర్ పవర్ ప్లాంట్ మంజూరు చేయించేందుకు కాకా వెంకటస్వామి కృషి చేశారని పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ  తెలిపారు. సాగు, తాగు నీటి కోసం అంబేద్కర్ పేరుతో మొదలు పెట్టిన ప్రాజెక్టును కేసీఆర్ రద్దు చేసి, కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గోదావరి నీళ్లు తలాపున ఉన్నా ధర్మపురికి కాకుండా సిరిసిల్ల, మెదక్  ప్రాంతానికి తరలిపోతున్నాయన్నారు. ఇక్కడ పని చేసిన మంత్రి అభివృద్ధి చేయలేదని, బీఆర్ఎస్ పాలనలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాలు అమ్ముకున్నారని విమర్శించారు. 

అధికారంలో లేకున్నా ధర్మపురి, పెద్దపల్లి ప్రాంతాల్లో తాము అనేక సేవా కార్యక్రమాలు  చేశామని గుర్తుచేశారు.  కాళేశ్వరం లింక్ 2 ప్రాజెక్ట్ కింద 600 ఎకరాలు భూమి సేకరించి, రైతులను గాలికి వదిలేశారన్నారు. పునరావాస గ్రామమైన చెగ్యాంలో 50 ఇండ్లకు ఎందుకు పరిహారం ఇవ్వలేదని బీఆర్ఎస్​ను ప్రశ్నించారు. 14 ఏండ్లు అడ్లూరి లక్ష్మణ్ పోరాటం చూసి ఎమ్మేల్యేగా అవకాశం ఇచ్చారని,  అదే విధంగా తనకు  మద్దతు ఇచ్చి గెలిపిస్తే మీ కోసం పని చేస్తానని ప్రజలకు వంశీకృష్ణ హామీ ఇచ్చారు.

ఉద్యోగాల పేరుతో బీఆర్ఎస్​, బీజేపీ మోసం: శ్రీధర్ బాబు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం,  కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశాయని   మినిస్టర్ శ్రీధర్ బాబు  ఆరోపించారు. కరెంట్ కోతలున్నాయంటూ బీఆర్ఎస్ అసత్య ప్రచారాలు చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చిన 4 నెలల్లో కరెంట్ కోతలు లేవని, సాంకేతిక సమస్యలతో కరెంటు ట్రిప్ అయినా కూడా బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తున్నదని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని,  సీఎం రేవంత్ రెడ్డి దానిని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అడ్లూరి లక్ష్మణ్ కుమార్​కు మద్దతుగా నిలిచిన ధర్మపురి ప్రజలు.. పార్లమెంట్​ ఎన్నికల్లో వంశీకృష్ణకు  భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు. యువకుడు,  చదువుకున్న వ్యక్తి అయిన వంశీకృష్ణకి పార్టీ హైకమాండ్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిందని, ఇక్కడ యువతకు ఆయన ఉపాధి కల్పించి భరోసాగా నిలబడతారని శ్రీధర్​బాబు తెలిపారు.

ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇండ్లు: వివేక్ వెంకటస్వామి

ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇండ్లు మంజూరయ్యాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. కేసీఆర్ తెలంగాణను రూ.7 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా తయారు చేశారని, ఇందులో  రూ.40 వేల కోట్లు ఖర్చు చేసినా పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు  వచ్చేవని అన్నారు. ధర్మపురి జన జాతర సభలో ఆయన  మాట్లా డుతూ, కల్వకుంట్ల ఆస్తులు అమాంతం పెరిగాయని, ఢిల్లీలో లిక్కర్ స్కాం చేసిన కవిత జైలు పాలైందని, ట్విట్టర్​ టిల్లు కేటీఆర్ సీఎం కావాలని కలలు కన్నాడని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ వస్తే మహిళలకు ప్రతి నెలా రూ. 8,500 అకౌంట్లో జమ చేస్తుందని చెప్పారు.

 రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసేందుకు రేవంత్​ సర్కారు కట్టుబడి ఉందన్నారు. రుణ మాఫీ చేస్తే కాంగ్రెస్ గెలుస్తుందనే ప్రధాని మోదీ అడ్డుపడుతున్నారని విమర్శించారు. రాముడి పేరు చెప్పి బీజేపీ లీడర్లు ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు.  పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని నేతకాని సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయింపు కల్పించాలన్నారు. రామగుండంలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని,  పత్తిపాక రిజర్వాయర్​ను పూర్తి చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

వంశీకృష్ణకు 2 లక్షల మెజార్టీ ఇవ్వాలి

పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్​ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 30వేల చొప్పున మెజారిటీ రావాలి. మొత్తంగా రెండు లక్షల పైచిలుకు మెజార్టీ ఇచ్చి గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపించాలి. వంశీ కోసం మంత్రి శ్రీధర్ బాబు భారీ మెజార్టీ లక్ష్యంగా పెట్టుకోవడం అభినందనీయం. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నయ్​. అందుకే ఈ ఎన్నికలు కీలకమైనవి. మోదీ మళ్లీ ప్రధాని అయితే రిజర్వేషన్లు రద్దవుతయ్​. రాహుల్ గాంధీ ప్రధాని అయితే తప్ప రిజర్వేషన్లు కాపాడే వాళ్లు లేరు. రాహుల్  ప్రధాని కావడం ఈ దేశానికి అవసరం. 

సీఎం రేవంత్​రెడ్డి