రైతులకు ఎక్కువ పరిహారం ఇప్పించండి : సీఎం రేవంత్ రెడ్డి

రైతులకు ఎక్కువ పరిహారం ఇప్పించండి : సీఎం రేవంత్ రెడ్డి
  • భూసేకరణను మానవీయ కోణంలో చూడండి : సీఎం రేవంత్
  • ట్రిపుల్​ ఆర్​కు ఒకే నెంబర్ 
  • అటవీ శాఖ భూములు తీసుకుని, ప్రభుత్వ భూములు కేటాయించండి 
  • నేషనల్ హైవేల నిర్మాణంపై సమీక్షలో సీఎం
  • రెండు నెలల్లో హైదరాబాద్–విజయవాడ 
  • హైవే విస్తరణ పనులు: ఎన్ హెచ్ఏఐ

హైదరాబాద్, వెలుగు : భూసేకరణపై మానవీయ కోణంలో ఆలోచించాలని, నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంతమేర రైతులకు దక్కేలా చూడాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో నేషనల్ హైవేల నిర్మాణంపై బుధవారం సెక్రటేరియెట్​లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా భూసేకరణ ఎందుకు ఆలస్యమవుతున్నదని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.  ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువగా ఉండడం, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని కలెక్టర్లు తెలిపారు. 

దీనిపై స్పందించిన సీఎం రేవంత్.. ‘‘తరతరాలుగా వస్తున్న భూములను రైతులు శాశ్వతంగా కోల్పోతున్నారనే విషయాన్ని గుర్తించాలి. రైతులతో కలెక్టర్లు నేరుగా మాట్లాడి ఒప్పించాలి” అని సూచించారు. ‘‘ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం, ఉత్తర భాగం వేర్వురుగా చూడొద్దు. ఆ రెండింటికి కలిపి ఒకే నెంబర్ కేటాయించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరగా, ఆయన సూత్రప్రాయంగా అంగీకరించారు. ఆ ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకోండి” అని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పగా.. వెంటనే దాన్ని పూర్తి చేయాలని చెప్పారు. ఇక ట్రిపుల్ ఆర్ నార్త్ విషయంలో భూసేకరణకు ఉన్న అడ్డంకులపై సీఎం ఆరా తీశారు. అలైన్ మెంట్ విషయంలో కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారని, దాంతో హైకోర్టు స్టే ఇచ్చిందని యాదాద్రి భువనగిరి కలెక్టర్ హన్మంత్ కె.జెండగే తెలిపారు. ఆ స్టే తొలగింపున‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చే శుక్రవారం నాటికి కౌంటర్ దాఖలు చేయాలని కలెక్టర్ ను సీఎం రేవంత్ ఆదేశించారు. 

యుటిలిటీస్ బిల్లులు త్వరగా చేయండి.. 

ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల, విజయవాడ–నాగ్ పూర్ కారిడార్ రహదారులకు సంబంధించి అటవీ శాఖ భూముల బదలాయింపు సమస్యపై సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్.. అటవీ శాఖ భూములను తీసుకుని, వాటికి బదులుగా ప్రభుత్వ భూములు కేటాయించాలని నిజామాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ విషయంలో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. వివిధ శాఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిధిలో యుటిలిటీస్ తొలగింపునకు సంబంధించి చెల్లింపులు వేగవంతం చేయాలని, ఏవైనా సమస్యలుంటే ఎన్ హెచ్ఏఐతో సంబంధిత అధికారులు సమన్వయం చేసుకొని ముందుకు సాగాలన్నారు.

హైదరాబాద్–మన్నెగూడ రహదారి పనులు  సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సీఎం రేవంత్ కోరగా, అందుకు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్ ఏఐ అధికారులు అంగీక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రించారు. హైదరాబాద్–విజయవాడ హైవేను ఆరు లేన్లుగా విస్తరించేందుకు అవసరమైన భూసేకరణ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరాగా.. రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని ఎన్ హెచ్ఏఐ ప్రాజెక్టు మెంబర్ అనిల్ చౌదరి తెలిపారు.  

గ్రావెల్ రోడ్లపై చర్చ.. 

నాగ్ పూర్--విజయవాడ కారిడార్ కు సంబంధించి ఖమ్మం జిల్లాలో భూసేకరణపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. దీనిపై ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘‘ఖమ్మం సమీపంలోని విలువైన భూముల గుండా రహదారి పోతున్నది. పరిహారం విషయంలో రైతులను ఒప్పిస్తున్నం. తల్లాడ-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ రహదారి పనులు సాగుతున్నందున, ప్రస్తుతం ఖమ్మం నుంచి అశ్వారావుపేట వరకు ఉన్న జాతీయ రహదారిని రాష్ట్ర రహదారిగా మార్చుకోవాలని ఎన్ హెచ్ఏఐ అధికారులు సూచిస్తున్నారు. దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దు. దాన్ని జాతీయ రహదారిగానే కొనసాగించాలి” అని అన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ..

‘‘నాగ్ పూర్--విజయవాడ కారిడార్ లో పెద్ద గ్రామాలు ఉన్న చోట సర్వీసు రోడ్లు నిర్మించాలి. రైతులు పొలాలకు వెళ్లేందుకు వీలుగా అవసరమైన చోట అండర్ పాస్ లు నిర్మించాలి” అని కోరారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని ఎన్ హెచ్ఏఐ ప్రాజెక్టు సభ్యుడు అనిల్ చౌదరి బదులిచ్చారు. నేషనల్ హైవేల వెంట రైతుల కోసం గ్రావెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్లు నిర్మించాలనే ప్రతిపాదనపైనా చర్చ జరిగింది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటామని అనిల్ చౌదరి తెలిపారు. గ్రావెల్ రోడ్లతో రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని, భవిష్యత్తులో హైవేల విస్తరణకు ఇబ్బందులు ఉండవని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.

సమావేశంలో సీఎస్​శాంతికుమారి, సీఎం ప్రిన్సిపల్​సెక్రటరీ శేషాద్రి, పీసీసీఎఫ్ డోబ్రియల్, ఆర్అండ్ బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, మెదక్, యాదాద్రి, సంగారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.