విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్లతో జాగ్రత్త

  • ఓట్ల కోసం రాజకీయం చేయచ్చు.. విద్వేషాలు రేపొద్దు: సీఎం రేవంత్​
  • పాలనలోని తప్పొప్పులపై మాట్లాడేవాళ్లు ఉండాలి
  • మంచి ప్రభుత్వాన్ని నడపాలంటే మంచి ప్రతిపక్షమూ కావాలి
  • మా పార్టీని అసద్​ విమర్శించినా.. ఆహ్వానిస్తం
  • మూసీ ప్రక్షాళనకు ముజ్లిస్​ సహకారం తీసుకుంటం
  • హైదరాబాద్​ను  కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పిలుపు
  • ‘ప్రాఫెట్‌‌‌‌ ఫర్‌‌‌‌ ద వరల్డ్’ పుస్తకావిష్కరించిన సీఎం

హైదరాబాద్ , వెలుగు: విద్వేషాలను రెచ్చగొట్టేవాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. ఓట్ల కోసం రాజకీయం చేయొచ్చు కానీ, విద్వేషాలు రేపొద్దని అన్నారు. హైదరాబాద్​నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ముసీ ప్రక్షాళన కోసం మజ్లిస్​ సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. రైటర్​ మౌలానా రెహమాన్‌‌‌‌ రాసిన ‘ప్రాఫెట్‌‌‌‌ ఫర్‌‌‌‌ ద వరల్డ్’ పుస్తకాన్ని శనివారం హైదరాబాద్‌‌‌‌లోని ఆరాంఘర్‌‌‌‌లో సీఎం రేవంత్​రెడ్డి ఆవిష్కరించారు. 

కార్యక్రమంలో మజ్లిస్​ పార్టీ చీఫ్​, ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే అసద్‌‌‌‌ భాయ్‌‌‌‌తో కొట్లాట అని, ఆ తర్వాత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మంచి చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. మజ్లిస్ పార్టీ నుంచి వచ్చే సలహాలు, సూచనలను స్వీకరిస్తున్నామని తెలిపారు. 

అనేక ఏండ్ల నుంచి మూసీ నది మురికి కూపంలా మారిందని.. మూసీ ప్రక్షాళన కోసం మజ్లిస్ సహకారం తీసుకుంటున్నామని చెప్పారు. ‘‘గతంలో హైదరాబాద్ లో ఒక వైపు ఒవైసీ, మరో వైపు నేను ఎంపీగా ఉన్నాం.. ఆయన గిరిజనులు, మైనార్టీల గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉండేది. అసదుద్దీన్‌‌‌‌  ఒవైసీ కొన్నిసార్లు కాంగ్రెస్‌‌‌‌ను విమర్శించినా సంతోషంగా అనిపించేది. ఎందుకంటే విమర్శించేది నా సోదరుడే కాబట్టి.  విమర్శలను కూడా స్వీకరించాలి”అని తెలిపారు. హైదరాబాద్​ నగర అభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దామని,  మూసీ నదిలోకి నగరంలోని చెత్తంతా వస్తున్నదని, దాని ప్రక్షాళనకు అందరి సూచనలు తీసుకుంటామని ఆయన చెప్పారు.  

తప్పొప్పులపై మాట్లాడాలి

ప్రస్తుతం లోక్‌‌‌‌సభలో ప్రజల గొంతు వినిపించే వారు తక్కువగా ఉన్నారని, జైపాల్‌‌‌‌రెడ్డి లాంటి నాయకులు ఇప్పుడు లేరని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. మంచి ప్రభుత్వాన్ని నడపాలంటే మంచి ప్రతిపక్షం కూడా ఉండాలని తెలిపారు. ఓట్ల కోసం రాజకీయం చేయచ్చు కానీ  విద్వేషాలు రేపొద్దన్నారు. ‘‘పాలనలో తప్పొప్పులు జరుగుతుంటయ్​. వాటిపై మాట్లాడేవాళ్లు ఉండాలి. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రావు ప్రభుత్వాలను రెండుసార్లు గెలిపించారు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా రెండోసారి అవకాశం వస్తుందని నమ్ముతున్న. పదేండ్ల పాటు పేదల సంక్షేమం కోసం పనిచేస్తం” అని చెప్పారు. 

అన్ని మతాలు చెప్పింది ఒక్కటేనని, అందరం కలిసిమెలసి శాంతియుతంగా ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన ఆకాంక్షించారు. ఆల్‌‌‌‌ ఇండియా ముస్లిం పర్సనల్‌‌‌‌ బోర్డు అధ్యక్షుడు మన నగరవాసి కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్పొరేట్ రంగంలో, వ్యాపారాల్లో మన వాళ్లు అగ్రగామిగా ఎదుగుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఒక మంచి మార్గంలో మనమంతా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ తదితరులు పాల్గొన్నారు.