ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ ఎందుకు తప్పుపడుతున్నారు: సీఎం రేవంత్

ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ ఎందుకు తప్పుపడుతున్నారు: సీఎం రేవంత్

షాద్ నగర్: ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ ఎందుకు తప్పుపడుతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.

బీఆర్ఎస్లో చేరగానే ఆర్ఎస్ ప్రవీణ్ ఆలోచన విధానం మారిందని రేవంత్ అన్నారు. ఎస్సీ, ఎస్టీలు ఇంకా బానిసలుగానే బతకాలని భావిస్తున్నారా అని సీఎం నిలదీశారు. పదేండ్లలో బర్రెలు, గొర్రెలు ఇచ్చాడే తప్ప మంచి చదువు ఇచ్చారా అని సీఎం ప్రశ్నించారు.  విద్యా వ్యవస్థలో మార్పులపై ఎంతో ఆలోచించామని, నిపుణులు, మేధావులతో ఎంతో చర్చించానని సీఎం చెప్పారు. మేధావులతో చర్చించాకే ఈ స్కూళ్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందిస్తామని, విద్యా ప్రమాణాలు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం 5 వేల ప్రభుత్వ స్కూళ్లను మూసివేసిందని, పేదలను విద్యకు దూరం చేయాలని బీఆర్ఎస్ కుట్ర పన్నిందని సీఎం ఆరోపించారు. ఎలాంటి వివాదం లేకుండా టీచర్ల బదిలీలు చేపట్టామని, అర్హులైన టీచర్లందరికీ ప్రమోషన్లు, బదిలీలు చేశామని డీఎస్సీ నియామకాలను గుర్తు చేశారు. విద్యార్థుల భవిష్యత్ కోసమే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ను తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. 

బుర్రా వెంకటేశం లాంటి వ్యక్తులు రెసిడెన్షియల్ స్కూళ్లలోనే చదివారని గుర్తుచేశారు. రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ పాఠశాలలను బాగు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పదేండ్లలో కేసీఆర్ రూ.7 లక్షల కోట్లు అప్పు చేశారని, రెసిడెన్షియల్ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలనే కనీస ఆలోచన చేయలేదని కేసీఆర్ పాలనపై సీఎం రేవంత్ మండిపడ్డారు. రేవంత్ సర్కార్ 28 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.