శైవ క్షేత్రాలకు తెలంగాణ ప్రసిద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

  • శివుడి ఆశీస్సులతో రాష్ట్రానికి మేలు జరగాలి: రేవంత్ రెడ్డి 
  • కోటి దీపోత్సవంలో పాల్గొన్న సీఎం  

హైదరాబాద్, వెలుగు:  కార్తీకమాసం సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు.  సీఎం దంపతులకు పండితులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్తీక దీపాలను సీఎం రేవంత్ రెడ్డి వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివుడి దయతో పాడిపంటలతో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని.. ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారని అన్నారు.

కార్తీక మాసంలో ఒక్క దీపాన్ని వెలిగించినా మనకు మేలు జరుగుతుందని.. అలాంటిది కోటి దీపోత్సవం కార్యక్రమంతో రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతున్నట్లు తెలిపారు. ఒకప్పటి త్రిలింగ దేశమే మన తెలంగాణ రాష్ట్రమని అన్నారు. మన రాష్ట్రం శైవ క్షేత్రాలకు ప్రసిద్ధి అని చెప్పారు. వేములవాడ, వేయిస్తంభాల గుడి.. ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా శైవ క్షేత్రాలు కనిపిస్తాయన్నారు. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో తెలంగాణకు మేలు జరగాలని ఆకాంక్షించారు.