జ్యురిచ్​లో కలుసుకున్న రేవంత్, చంద్రబాబు..

జ్యురిచ్​లో కలుసుకున్న రేవంత్, చంద్రబాబు..
  • దావోస్​ పర్యటన సందర్భంగా ఎయిర్​పోర్ట్​లో భేటీ

హైదరాబాద్, వెలుగు : దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ, ఏపీ సీఎంలు స్విట్జర్లాండ్​లోని జ్యురిచ్ ఎయిర్​పోర్టులో కలుసుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు అక్కడ కాసేపు మాట్లాడుకున్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై చర్చించుకున్నారు. రెండు రాష్ట్రాల బృందాలు ఫొటోలు దిగాయి. ఇద్దరు సీఎంలకు అక్కడి ప్రవాస తెలుగు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ నెల 23 వరకు రేవంత్ రెడ్డి దావోస్​లో పర్యటించనున్నారు. దేశ, విదేశాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలతో తెలంగాణ రైజింగ్ బృందం చర్చించనుంది.

ఈ పర్యటనలో రేవంత్​ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు ఉండగా, చంద్రబాబు వెంట కేంద్రమంత్రి రామ్మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టీజీ భరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అధికారులు ఉన్నారు. దావోస్​లో వరల్డ్ ఎకనమిక్​ ఫోరమ్​ వార్షిక సదస్సులో తొలి రోజున గ్రాండ్​ ఇండియా పెవిలియన్​ ఘనంగా ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి జయంత్​ చౌదరి, మంత్రి శ్రీధర్ బాబు, పలు రాష్ట్రాల సీఎంలు, ఇతర ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. అంతకుముందు  సీఎం రేవంత్​ రెడ్డి  జ్యురిచ్ నుంచి దావోస్ వరల్డ్ ఎకనమిక్​ ఫోరమ్​ సదస్సుకు రైలులో బయల్దేరి వెళ్లారు.