సాయిథరమ్ తేజ్ ట్వీట్.. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి రిప్లై

సాయిథరమ్ తేజ్ ట్వీట్.. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి రిప్లై

టాలీవుడ్ యంగ్ హీరో సాయిథరమ్ తేజ్ తల్లిదండ్రులను హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దారుణాలపై పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిన్నపిల్లల ఫోటోలు,వీడియోలు పోస్ట్  చేయొద్దని కోరారు.  ఫన్నీ పేరుతో చిన్నపిల్లలను ట్రోల్ చేస్తున్న వీడియోను సాయిధరమ్ తేజ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.  కొంతమంది యూట్యూబర్స్  .. తండ్రి,  కూతురి వీడియోను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారు. దీనికి సంబంధించి కామెంట్స్ ను ఉద్దేశిస్తూ సాయిథరమ్ తేజ్  ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  ఏపీ,తెలంగాణ సీఎంలతో పాటు..డిప్యూటీ సీఎంలను, డీజీపీలకు, పోలీసులకు  విజ్ఞప్తి చేశారు. అయితే సాయిథరమ్ తేజ్ ట్వీట్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. పిల్లల జాగ్రత్తపై సూచనలు చేసిన సాయిథరమ్ తేజ్ కు కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తమ ప్రభుత్వం పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.  ఈ ఘటనను పరిశీలించి తగిన  చర్యలు తీసుకుంటామన్నారు.

ఎంతో కీలక సమస్యను ఎత్తిచూపినందుకు సాయితేజ్‌కు కృతజ్ఞతలు చెబుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్వీట్ చేశారు.  తాము చిన్నపిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. సోషల్ మీడియా వేదికగా చిన్నపిల్లలను ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు.  వేధింపులను అరికట్టేందుకు తమ  ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు.  పిల్లలకు మెరుగైన, సురక్షితమైన ఆన్ లైన్ వాతావరణాన్ని సృష్టించడానికి అందరం కలిసి పనిచేద్దామని సూచించారు.