కృష్ణా జలాల్నిఏపీ అక్రమంగా వాడుకుంటోంది: సీఎం రేవంత్

కృష్ణా జలాల్నిఏపీ అక్రమంగా వాడుకుంటోంది: సీఎం రేవంత్

కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో   సీఎం రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్. నీటి కేటాయింపులు..ప్రాజెక్టులకు నిధులపై ప్రధానంగా చర్చించామని చెప్పారు.

ALSO READ | సీఎంను కలిసిన పౌల్ట్రీ అసోసియేషన్స్ ప్రతినిధులు..

 కృష్ణాజలాల్ని ఏపీ అక్రమంగా వాడుకుంటోందన్నారు. దీనిపై   జోక్యం చేసుకోవాలని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ ను  కోరినట్లు చెప్పారు. ఏపీ కృష్ణా నీటిని అక్రమంగా తరలించుకపోతుందన్నారు. కృష్ణా డెల్టా స్థిరీకరణ చేసుకుని ఎక్కువ నీటిని వాడుకుంటోందన్నారు. గోదావరి ప్రాజెక్టుపై ఏపీ నిర్మిస్తోన్న బనకచర్లపై   అభ్యంతరం చెప్పామన్నారు.  బనకచర్ల ప్రాజెక్ట్ తో గోదావరిలో కూడా ఇదే తరహా సమస్య వస్తుందన్నారు రేవంత్ రెడ్డి.  నికర జలాల కేటాయింపు తర్వాతే ఏదైనా ప్రాజెక్టకు అనుమతివ్వాలన్నారు రేవంత్.

మేం నికర జలాలపై సమ్మక సారక్క ప్రాజెక్టు, సీతారామ తదితర ప్రాజెక్టులు కడుతున్నాం. మా శాశ్వత కేటాయింపుల్లోని ప్రాజెక్టులపై ఏపీ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?. గోదావరి వరద జలాలపై కట్టే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలంటే ముందుగా నికర జలాల ప్రాజెక్టుల లెక్క తేల్చాల్సిందే. సముద్రంలో వృధాగా కలిసే వరద జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది. అలాంటప్పుడు నికర జలాలపై ఉన్న మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యతరం చెబుతోంది.  వరద జలాలపై కట్టిన ఆయకట్టును స్థిరీకరిస్తే ఆ మేరకు నీటి కేటాయింపులు జరుపుతామంటున్నారు. కృష్ణా జలాలపై కూడా అదే పరిస్థితి ఏర్పడింది. 

ఆయకట్టు లెక్కల ప్రకారమే తెలంగాణకు తాత్కాలిక వాటా తగ్గింది. కృష్ణా డెల్టాలో ఆయకట్టు స్థిరీకరించడం వల్ల 811 టీఎంసీల ఉమ్మడి వాటాలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌ వినియోగించుకుంటోంది. తెలంగాణ కేవలం 299 టీఎంసీలు మాత్రమే వినియోగించుకుంటోంది. ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, ఏపీలో పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం వల్లనే. కృష్ణా నదిలో తలెత్తిన పరిస్థితి గోదావరి విషయంలో జరగకూడదు. నికర జలాలపై మా ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతనే వరద జలాలపై నిర్మించే ప్రాజెక్టుల సంగతి చూడండి అని రేవంత్ అన్నారు.

కృష్ణా నది జలాలను ఏపీ అక్రమంగా తీసుకెళ్తన్నవిషయాన్ని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ కు ఫిర్యాదు చేశామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి,సీతారామ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరామన్నారు. ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరాం.. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ సానుకూలంగా  స్పందించారని చెప్పారు.