- త్వరలోనే రూ. 2లక్షల రుణమాఫీ
- వచ్చే నెల 15 లోపు రైతులందరికీ రైతు భరోసా : సీఎం
- ఎంపీ ఎన్నికల కోసం బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై డ్రామాలాడుతున్నయ్
- రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలిస్తేనే యుద్ధం గెలిచినట్లు
- ప్రజలు బండకేసి కొట్టినా కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌కు బుద్ధిరాలేదు
- రోజా ఇంట్లో కేసీఆర్ కోడి పులుసు తిని ఏపీ నీళ్ల దోపిడీకి అలుసిచ్చిండు
- ప్రగతిభవన్‌లో జగన్‌కు పంచభక్ష పరమాన్నాలు పెట్టి మనల్ని ముంచిండు
- ఎంపీగా గెలిపించిన పాలమూరును పడావు పెట్టిండు
- ప్రజలకు క్షమాపణ చెప్పినంకనే కేసీఆర్ ఓట్లు అడగాలి
- పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైందో
- కిషన్‌రెడ్డి, డీకే అరుణ, జితేందర్‌రెడ్డి చెప్పాలని డిమాండ్
- కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మహబూబ్‌నగర్/కోస్గి/కొడంగల్, వెలుగు : ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు అమలు చేస్తున్నామని, రాబోయే వారం రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ స్కీమ్‌లు కూడా అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. త్వరలోనే రూ. 2 లక్షల రైతు రుణమాఫీని కూడా అమలుచేస్తామని తెలిపారు. రైతుల ఖాతాల్లో రైతు భరోసా (రైతుబంధు) డబ్బులు వేస్తున్నామని, వచ్చే నెల 15లోపల అందరికీ రైతు భరోసా డబ్బులు వేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరించి గెలిపించారని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆదరించాలని కోరారు.
‘‘రాష్ట్రం నలుమూలలా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు ఇదే చెబుతున్నా... యుద్ధం ఇంకా అయిపోలేదు. విరామం మాత్రమే ఇచ్చినం. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో 14 సీట్లను గెలిపించుకోవాలి. అప్పుడే యుద్ధం గెలిచినట్లు. 14 సీట్లు గెలిస్తేనే పార్లమెంట్లో తెలంగాణ సమస్యల గురించి ప్రశ్నించగలుగుతాం’’ అని ఆయన పేర్కొన్నారు. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని కోస్గి మండలంలో బుధవారం సీఎం పర్యటించారు.
ఈ సందర్భంగా రూ.4,369 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇందులో కాలేజీలు, రోడ్లు, కొడంగల్– -నారాయణపేట లిఫ్ట్ స్కీం ఉన్నాయి. 3,083 మహిళా సంఘాలకు రూ.177.53 కోట్ల చెక్కులను అందజేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలతో సమావేశమయ్యారు. అనంతరం కోస్గిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు కాంగ్రెస్‌పై బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.
కేసీఆర్ క్షమాపణ చెప్పాకే పాలమూరులో ఓట్లు అడగాలి
‘‘తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ నుంచి పాలమూరుకు వలస వచ్చిన కేసీఆర్‌ను ఇక్కడి ప్రజలు ఆశీర్వదించి ఎంపీగా గెలిపించారు. వలస వచ్చిన నిన్ను(కేసీఆర్‌ను) గెలిపిస్తే నువ్వేం చేశావ్? పాలమూరు–-రంగారెడ్డి స్కీమ్‌కు రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని పాలమూరుకు ఓట్లు అడగటానికి వస్తున్నవ్. ముందు పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పాకే ఓట్లు అడగాలి” అని కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. పదేండ్లు అధికారంలో ఉండి పాలమూరులో అదనంగా ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని మండిపడ్డారు.
‘‘మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి ప్రారంభించిన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దూరి, రాష్ట్రాన్ని పట్టి పీడించిండు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌ను ఛీదరించి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన్రు. అయినా సిగ్గు లేకుండా మళ్లీ బయల్దేరుతున్నడు. అల్లుడు హరీశ్ రావు నల్గొండ నుంచి, కొడుకు కేటీఆర్ పాలమూరు నుంచి పాదయాత్ర చేస్తరంట. ప్రజలు ఛీ కొట్టినా వాళ్లకు సిగ్గురాలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 సీట్లు ఉంటే 12 స్థానాల్లో ప్రజలు బండకేసి కొట్టినా ఏ ముఖంతో పాలమురు జిల్లాకు వస్తున్నరు?
భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, దేవాదుల, ప్రాణహిత పూర్తి చేశారా? రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసి ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు. పాలమూరు పేరుతో వేలాది కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చి కేసీఆర్ కమీషన్లు తిన్నడు. పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చిండు. ఇక్కడి వలసలు ఇంకా ఆగలేదు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్‌కు పంచభక్ష పరమాన్నాలు పెట్టి ముంచిండు
‘‘సమైక్య పాలనలో జరిగిన నీళ్ల దోపిడీ కంటే, కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణకు తీరని నష్టం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన మంత్రులకు తెలంగాణ అంటే భయం ఉండే. నిధులు, జల దోపిడీకి పాల్పడాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించెటోళ్లు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ వల్ల నీళ్ల దోపిడీ పెరిగింది. జగన్ రెడ్డి పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్, ముచ్చుమర్రి, మాల్యాలకు రోజుకు 12 టీఎంసీల కృష్ణా నీరు తరలిస్తున్నాడు. ఆయన్ను కేసీఆర్ ప్రగతి భవన్‌కు పిలిచి పంచభక్ష పరమన్నాలు పెట్టిండు. 203 జీవో ద్వారా రాయలసీమను రతనాల సీమ చేస్తమని కేసీఆర్ చెప్పిండు.
వైసీపీ ఎమ్మెల్యే రోజా పిలిచి రాగి సంకటి, నాటు కోడి పులుసు పెట్టగానే.. పులుసు తిని అలుసిచ్చి.. రాయలసీమకు నీళ్లు ఇస్తానన్నడు. పాలమూరును ఎడారి చేసిండు” అని సీఎం రేవంత్ అన్నారు. పాలమూరు ప్రజలు కేసీఆర్‌ను పార్లమెంట్‌కు పంపిస్తే ఇక్కడి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ సోయి లేని ఓ దద్దమ్మ అని మండిపడ్డారు.
పాలమూరుకు జాతీయ హోదా ఏమైంది?
బీజేపీ, బీఆర్ఎస్ చీకట్లో ఒప్పందం చేసుకున్నాయని సీఎం ఆరోపించారు. ‘‘మోదీ 2014లో పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని మహబూబ్‌నగర్ సభలో ప్రకటించారు. కేంద్రంలో పదేండ్లుగా అధికారంలో ఉన్నా పాలమూరుకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదో సమాధానం చెప్పాలని కిషన్‌రెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డిని సవాల్ చేస్తున్న. వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్ పనుల్లో పదేండ్లుగా తట్టెడు మట్టి తీయలేదు.
మోదీ మనల్ని మోసం చేసిండు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిగా పదేండ్లు మోదీ, ఐదేండ్లు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నా.. నాలుగు రూపాయలు కూడా రాష్ట్రానికి తేలేదని విమర్శించారు. పాలమూరుకు ప్రత్యేక నిధులు, ప్రాజెక్టులు, పరిశ్రమలు ఎందుకు తీసుకురాలేదో డీకే అరుణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయాలని ఇక్కడి ప్రజలను ఎలా అడుగుతున్నారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారని, కానీ పార్టీనే మోసం చేశారని డీకే అరుణపై మండిపడ్డారు.
ఎంపీ ఎన్నికల్లో 50 వేల మెజార్టీ ఇవ్వండి
‘‘మీ అభిమానంతోనే జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికయ్యాను. ఇప్పుడు మీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిని అయ్యాను. మీతో సంతోషాన్ని పంచుకోవాలనే సీఎం అయిన 60 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను” అని కొడంగల్ నియోజకవర్గ ప్రజలతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరించి గెలిపించారని, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొడంగల్ నియోజకవర్గం నుంచి 50 వేల మెజార్టీ ఇప్పించాలని కోరారు. 50 వేల మెజార్టీ ఇప్పిస్తే ఇప్పుడిచ్చిన రూ.5 వేల కోట్ల అభివృద్ధి పనులే కాకుండా..
అదనంగా మరో 5 వేల కోట్లు నిధులు తీసుకొస్తానని చెప్పారు. వికారాబాద్– -కృష్ణా రైల్వే, కోస్గిలో సిమెంట్ ఫ్యాక్టరీ, పరిశ్రమలు, యువతకు ఉద్యోగాలు రావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నుంచి 50 వేల మెజార్టీ తగ్గొద్దన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను కొడంగల్ ఎమ్మెల్యేగా 7.01 టీఎంసీలతో ‘కొడంగల్–-నారాయణపేట’ లిఫ్ట్ స్కీమ్‌ను మంజూరు చేయించానని తెలిపారు.
శంకుస్థాపనలు చేసినవివే..
కోస్గి టూర్లో సీఎం రేవంత్ రెడ్డి రూ.4,369.143 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో కొడంగల్-–నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ నిర్మాణం, సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ రోడ్లు వంటివి ఉన్నాయి. కార్యక్రమాల్లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, మహబూబ్‌నగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనరసింహా, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాంమోహన్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, వాకిటి శ్రీహరి, చిట్టెం పర్ణికా రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, మేఘారెడ్డి, వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి
ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు మల్లు రవి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్ రెడ్డి, మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, కోస్గికి నారాయణ రెడ్డి అనే వ్యక్తి అందించిన అంబులెన్స్ ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి!
మహబూబ్‌నగర్, వెలుగు : మహబూబ్‌నగర్ పార్లమెంట్అభ్యర్థిగా సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్ రెడ్డి పేరు దాదాపు ఖాయమైంది. ఈ మేరకు ఆయన పేరును కోస్గీ సభలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సభ సాగుతున్నంత వరకు వంశీచంద్ రెడ్డి సీఎం పక్కనే నిలబడ్డారు. అలాగే మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. వంశీనే పాలమూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉంటారనే సంకేతాలు ఇచ్చారు.
సీఎం స్పీచ్ ముగింపు సమయంలో కొడంగల్ నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించినట్లే వంశీని కూడా ఆశీర్వదించాలని కోరడం విశేషం. కేవలం కొడంగల్ నియోజకవర్గం నుంచే వంశీకి 50 వేల మెజార్టీ ఇప్పించాలని కూడా చెప్పడంతో వంశీపేరు దాదాపు ఖాయమైనట్లేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కొడంగల్ లిఫ్ట్‌తో 1.30 లక్షల ఎకరాలకు నీరు : ఉత్తమ్
రూ.4,369 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం మొదటి సారి చూస్తున్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘‘60 రోజుల్లో సీఎంగా రేవంత్ రెడ్డి తనదైన మార్క్ వేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉమ్మడి నాయకత్వంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఓడించి.. కాంగ్రెస్‌ను గెలిపించిన దాంట్లో రేవంత్‌ది ప్రముఖ పాత్ర ఉంది” అని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొడంగల్ ప్రాంతం వెనుకబడిందని, సాగునీరు లేక ప్రజలు వలసలు పోయారని తెలిపారు. నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్ స్కీమ్ ఈ నియోజకవర్గానికి జీవధార లాంటిందని తెలిపారు.
లక్ష ఎకరాల ఆయకట్టుకు.. మరో 30 వేల ఎకరాలకు అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించనున్నామని చెప్పారు. ఈ స్కీమ్‌ను రెండేండ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న పాలమూరు లిఫ్ట్, రాజీవ్ భీమా, ఎంజీకేఎల్ఐ, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు స్కీములకు ప్రియారిటీ ఇచ్చి త్వరలో పూర్తి చేస్తామన్నారు.
బొక్కలిరిగినయని కేసీఆర్ ఇంట్లో కూర్చున్నడు : కోమటిరెడ్డి
పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం గజ్వేల్, సిద్దిపేట ప్రాంతాలనే అభివృద్ధి చేసుకొని ఉమ్మడి నల్గొండ, పాలమూరు జిల్లాలను పక్కన పెట్టిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ‘‘కేసీఆర్ రూ.6 లక్షల కోట్ల అప్పులు చేసి మేడిగడ్డ బ్యారేజీ కట్టి లక్షల కోట్లు దండుకున్నడు. మూసీని పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి సీఎం అయిన వెంటనే మూసీ నదిని ప్రక్షాళన చేయాలని నడుం కట్టిండు” అని తెలిపారు.
రేవంత్‌ను ఎదుర్కొనలేక కేసీఆర్ బొక్కలిరిగినయని చెప్పి ఇంట్లో కూర్చున్నారని విమర్శించారు. ‘‘అసెంబ్లీలో సీఎంకు ఎదురుగా నిల్చొని కేసీఆర్ మాట్లాడగలడా? కాళేశ్వరం అద్భుతం పోయి, పదవి పోయి, బొక్కలిరిగి కుర్చీలో పడ్డడు” అని అన్నారు. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో జగన్‌తో కేసీఆర్ కుమ్మక్క య్యారన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు.
ధనిక రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా చేశారు : మంత్రి జూపల్లి
కేసీఆర్ గొప్ప గొప్ప మాటలు చెప్పి.. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని, అవినీతి రాజ్యం ఏలారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో పేదలకు న్యాయం జరగలేదని అన్నారు. పదేండ్లుగా భీమా, నెట్టెంపాడు, కేఎల్ఐ అసంపూర్తిగా ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తుందన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నయ్. పార్లమెంట్ ఎన్నికలు రాగానే రూపాలు మారుస్తున్నయ్. ఎజెండాలు మారుతున్నయ్. జెండాలు మారుతయ్. ఒకరు పొత్తు ఉండదంటరు... ఇంకొకరు పొత్తు ఉందంటరు. కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికే ఇలాంటి డ్రామాలు చేస్తున్నరు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాంటి కుట్రలు చేసిన్రు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సీఎం రేవంత్‌రెడ్డి