పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ

పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ
  • వచ్చే వానాకాలం వడ్లకు రూ.500 బోనస్​ ఇస్తం
  • నారాయణపేట జనజాతర సభలో సీఎం రేవంత్​రెడ్డి
  • బిడ్డ బెయిల్​ కోసం బీజేపీకి బీఆర్​ఎస్​ను కేసీఆర్​ తాకట్టు పెట్టిండు
  • రాష్ట్రంలో కాంగ్రెస్​ను ఓడగొట్టేందుకు ఆ రెండు పార్టీలు కుమ్మక్కు
  • రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లిస్తే ముదిరాజ్​ బిడ్డను మంత్రిని చేస్తం
  • ముదిరాజ్​లను బీసీ–ఏలోకి తేవడం, ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్​తోనే సాధ్యం
  • లోక్​సభ ఎన్నికలైన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని వెల్లడి

మహబూబ్​నగర్, వెలుగు: పంద్రాగస్టులోపు రైతులకు ఏకకాలంలో, ఏక మొత్తంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటించారు. వచ్చే వర్షాకాలంలో పండే వడ్లకు రూ.500 బోసన్​ ఇచ్చి, ప్రతి గింజనూ కొంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కొడంగల్ ​ఇరిగేషన్​ స్కీం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ, రూ.500 కే సిలిండర్ ఎట్లయితే ఇచ్చామో.. రుణమాఫీని కూడా అమలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం కాంగ్రెస్​ పార్టీ ‘జన జాతర’ సభ నిర్వహించింది. ఈ సభలో సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీల్లో వంద రోజుల్లో కొన్ని అమలు చేశామని, ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. ఎన్నికల కోడ్​ వల్ల రుణమాఫీ చేయలేకపోయామని, ఆగస్టు 15 నాటికి అమలు చేస్తామని స్పష్టం చేశారు. 

బీజేపీ నుంచి కేసీఆర్​కు సుపారీ

లిక్కర్​ కేసులో బిడ్డ బెయిల్​ కోసం బీఆర్​ఎస్​ పార్టీని  ప్రధాని మోదీకి కేసీఆర్​ తాకట్టు పెట్టారని సీఎం రేవంత్​ విమర్శించారు. ‘‘లిక్కర్​ స్కాం కేసులో కవితకు బెయిల్​ కోసం, లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ను ఓడించేందుకు మోదీతో కేసీఆర్​ చీకటి ఒప్పందం చేసుకున్నడు. అందులో భాగంగా మహబూబ్​నగర్​, చేవెళ్ల, మల్కాజ్​గిరి, భువనగిరి, జహీరాబాద్​ ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపించేందుకు సుపారీ తీసుకున్నడు. బీఆర్​ఎస్​ కార్యకర్తలను బొందపెట్టి, వాళ్ల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టిండు” అని మండిపడ్డారు. 

‘‘లక్షలాది మంది కార్యకర్తలు, ఇతర పార్టీల లీడర్లు జైలుకు పోయినా కేసీఆర్​కు దుఖం రాలేదు.. నా బిడ్డ పెండ్లి ఉంటే కూడా నన్ను వదలకుండా జైల్లో పెట్టించిండు. ఇప్పుడు.. ఆయన బిడ్డ జైలుకు పోగానే మోదీ దగ్గర బీఆర్​ఎస్​ను తాకట్టు పెట్టిండు. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి మంచిదా? బీఆర్​ఎస్​ను మోదీ వద్ద ఎందుకు కేసీఆర్​ తాకట్టు పెట్టిండో బీఆర్​ఎస్​ కార్యకర్తలు, లీడర్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి” అని సీఎం అన్నారు. పాలమూరులో బీఆర్​ఎస్ మాజీ ఎమ్మెల్యేలెవరూ ప్రచారం చేయడంలేదని, బీజేపీకి ఓట్లు వేయించాలని కేడర్​కు చెప్తున్నారని, చేవెళ్లలోనూ బీఆర్​ఎస్​ లీడర్లను బీజేపీకి లొంగిపోవాలంటున్నారని చెప్పారు. ‘‘భువనగిరి, మల్కాజ్​ గిరి, జహీరాబాద్​, చేవెళ్ల, మహబూబ్​నగర్​ స్థానాల్లో కాంగ్రెస్​ గ్యారంటీగా గెలుస్తుంది. ఈ స్థానాల్లో కాంగ్రెస్​ను దెబ్బతీస్తే రేవంత్​ను దెబ్బతీయొచ్చనే ఆలోచనతో బీజేపీ, బీఆర్​ఎస్​ నేతలు కుట్ర పన్నుతున్నరు.  వంద రోజుల్లో నన్ను గద్దె దింపాలనుకుంటున్న కేసీఆర్.. పదేండ్లు గద్దె మీద ఉన్న మోదీని ఎందుకు గద్దె దించుదామని చెప్తలే?” అని నిలదీశారు. 

పాలమూరు కోసం డీకే అరుణ ఏం చేశారు?

‘‘మోదీని మళ్లీ ప్రధాని చేయాలని, రేవంత్​ను ఓడించాలని డీకే అరుణ ప్రయత్నాలు చేస్తున్నరు” అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘పదేండ్లు మోదీ పీఎంగా ఉన్నా మీరు పాలమూరు స్కీముకు పైసా అయినా తెచ్చారా? మోదీ ఇచ్చిన హామీ మేరకు ఈ స్కీముకు జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేకపోయారు? ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ కోసం ప్రధానిని ఎందుకు కలువలే? ముదిరాజ్​లను బీసీ-–డీ గ్రూప్​ నుంచి బీసీ-–ఏ గ్రూప్​లో మార్చడానికి మీ(బీజేపీ) లీడర్లను ఢిల్లీకి తీసుకెళ్లే ప్రయత్నం ఎందుకు చేయలే? మహబూబ్​నగర్​–-రాయచూర్​ రోడ్డు ఎందుకు పడావు పడ్డది? ఆ కాంట్రాక్టర్​ ఎవరు? ఆ నిధులు దోపిడీకి పాల్పడింది ఎవరు? కృష్ణా- – వికారాబాద్​ రైల్వే కోసం మోదీని ఎందుకు కలువలే? మక్తల్​– నారాయణపేట – కొడంగల్​ స్కీముకు జాతీయ నిధులు ఎందుకు తీసుకురాలే?” అని మహబూబ్​నగర్​ బీజేపీ అభ్యర్థి డీకే అరుణను సీఎం రేవంత్​రెడ్డి నిలదీశారు. పాలమూరును ఎండబెట్టి, లక్షలాది మంది వలసలు పోతుంటే డీకే అరుణ ఒక్క రోజు కూడా పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. 

గద్వాలలో కుట్రలు చేసి సరితను ఓడించారు

కుర్మ యాదవులకు కేసీఆర్​ ప్రాధాన్యం ఇవ్వలేదని సీఎం రేవంత్​ అన్నారు. గద్వాల అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్​ పార్టీ తరఫున యాదవ బిడ్డ, జెడ్పీ చైర్​పర్సన్​ సరితకు అవకాశం ఇచ్చామని చెప్పారు. కానీ.. బీఆర్​ఎస్​, బీజేపీ ఏకమై గద్వాల కోటలో కుట్రలు చేశాయని మండిపడ్డారు. అప్పటి వరకు తగాదాలున్నాయన్న మామాఅల్లుడు డీకే భరతసింహారెడ్డి, బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి కుమ్మక్కయ్యారని.. డీకే అరుణ నాయకత్వంలో బీజేపీ ఓట్లను బీఆర్​ఎస్​కు వేయించి, యాదవ బిడ్డను ఓడగొట్టారని అన్నారు. సరిత గెలిచి ఉంటే మంత్రి అయ్యేదని చెప్పారు. అరుణ దివాళాకోరు రాజకీయం ఎట్లుంటదో ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు.

కాంగ్రెస్​ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి

కాంగ్రెస్​ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. ‘‘రాష్ట్రంలో బీఆర్​ఎస్​, బీజేపీ ఒక్కటయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే ఈ పార్లమెంట్​ ఎన్నికల్లో ఎక్కువగా కష్టపడాలి. పార్లమెంట్​ ఎన్నికలు ముగిసిన వెంటనే వార్డు మెంబర్​, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తం. మీ ఊర్లల్లో పట్టు కోల్పోతే ఎవడో మోపైతడు. మీ ఎన్నికల్లో కూడా మీకు తలనొప్పి వస్తది. ఖర్చు మోపెడైతది. ఎంపీ ఎన్నికలు అయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి మిమ్మల్ని గెలిపించుకుంటం. 

పార్టీ కోసం పని చేసే వారిని గుర్తు పెట్టుకొని టికెట్లు ఇచ్చి, వారిని గెలిపించుకునే బాధ్యతను నేను తీసుకుంటా. ఊరూరా ఇందిరమ్మ కమిటీలను  ఏర్పాటు చేసి పేదలను ఆదుకునే బాధ్యతను మీ చేతుల్లో పెడతా. నాగర్​కర్నూల్​, పాలమూరు స్థానాల్లో మనం గెలవాలి. నా పాలమూరులో తప్పు జరిగితే, జాతీయ స్థాయిలో చెప్పుకునే పరిస్థితి ఉండదు. మీరు అండగా ఉండి ఆశీర్వదిస్తేనే ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 12 గెలిచాం. ఈ ఎన్నికల్లో కష్టపడి పని చేసి రెండు లోక్​సభ సీట్లలో చల్లా వంశీచంద్​ రెడ్డి, మల్లు రవిని గెలిపించుకోవాలి” అని పిలుపునిచ్చారు. 

కార్యక్రమంలో మహబూబ్​నగర్​ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్​ రెడ్డి, మహబూబ్​నగర్​ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ క్యాండిడేట్​ మన్నె జీవన్​ రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్​రెడ్డి, పర్ణికా రెడ్డి, వాటికి శ్రీహరి, వీర్లపల్లి శంకర్, జనంపల్లి అనిరుధ్​రెడ్డి,  జి.మధుసూదన్​ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి,   రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ఏపీ జితేందర్​రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్​ కుమార్​ తదితరులు పాల్గొన్నారు.

ముదిరాజ్​ ఎమ్మెల్యేను మంత్రిని చేస్త

కాంగ్రెస్​ పార్టీ అన్నివర్గాల లీడర్లకు అవకాశాలు కల్పించిందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంట్రాక్టర్లు​, శ్రీమంతులు, జాగీర్​దార్లు, జమీందార్లకు కాకుండా సామాజికవర్గాల వారీగా టికెట్లు ఇచ్చిందని తెలిపారు. షాద్​నగర్​ నుంచి రజక సామాజిక వర్గానికి చెందిన వీర్లపల్లి శంకర్​కు, మక్తల్​ నుంచి ముదిరాజ్​ అయిన వాటికి శ్రీహరికి టికెట్లు ఇచ్చామని చెప్పారు. 

వేరే పార్టీలు సామాజికవర్గాల వారీగా టికెట్లు కేటాయించవని అన్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో పది శాతం జనాభా ఉన్న ముదిరాజ్​లకు కేసీఆర్​ ఒక్క టికెట్​ కూడా ఇవ్వలేదని తెలిపారు. బీసీ–-ఏలో ఉన్న ముదిరాజ్​లను బీసీ-–డీలోకి మార్చారని, ఈ విషయాన్ని కేసీఆర్​ పట్టించుకోకపోవడంతో లక్షలాది మంది ముదిరాజ్​లకు ఉద్యోగాల్లో అన్యాయం జరిగిందని అన్నారు. ముదిరాజ్​లను బీసీ–-ఏలోకి మార్చాలంటే కేంద్రంలో కాంగ్రెస్​ గద్దెనెక్కాలని, వంశీచంద్​రెడ్డి ఎంపీగా ఉండాలని ఆయన చెప్పారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్​కు 14 ఎంపీ స్థానాలు ఇస్తే ఆగస్టు 15 నాటికి ముదిరాజ్​ బిడ్డ అయిన మక్తల్​ ఎమ్మెల్యే వాటికి శ్రీహరిని మంత్రిని చేసే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. మాదిగల ఏబీసీడీ వర్గీకరణ మీద పదేండ్లు కేసీఆర్ సీఎంగా ఉండి సుప్రీంకోర్టులో కేసును పట్టించుకోలేదని, తాను సీఎం అయిన వెంటనే ఉద్ధండ న్యాయవాదులను ఏర్పాటు చేయించానని ఆయన తెలిపారు. మాదిగ ఉద్యమంలో ఏబీసీడీ వర్గీకరణ కోసం కొట్లాడిన మంద కృష్ణ.. నరేంద్ర మోదీకి ఓటేయాలంటున్నారని, కానీ.. ఆయనను కేసీఆర్​ అరెస్టు చేయించినప్పుడు తానే బెయిల్​ ఇప్పించానని తెలిపారు. వర్గీకరణ చట్టం చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చెప్పారు. 

పాలమూరు బిడ్డ సీఎం కావొద్దా?

పేదోడి బిడ్డ సీఎం అయితే ఓర్వలేక పోతున్నారని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘తెలంగాణకు కేసీఆరే సీఎం కావాలా? ఆయన తర్వాత కేటీఆర్​, ఆయన తర్వాత కేసీఆర్​ మనుమడే సీఎం కావాలా? పాలమూరు బిడ్డలు సీఎం కావద్దా? మేం కష్టపడలేమా? అభివృద్ధి చేయలేమా? నన్ను పడగొట్టి, బలహీనుడిని చేయాలనే ప్రయత్నం చేస్తున్నరు. బీఆర్​ఎస్​కు చెందిన మహబూబ్​నగర్​ సిట్టింగ్​ ఎంపీ ఎక్కడున్నడు? పదేండ్లు ఎమ్మెల్యేలుగా పని చేసిన మీ పాత ఎమ్మెల్యేలు ఎక్కడున్నరు? బీఆర్​ఎస్​కు ఓట్లు వేయాలని అడుగుతున్నారా? ఊళ్లకు వస్తున్నరా? బీఆర్​ఎస్​ కార్యకర్తలను బీజేపీకి అమ్మిన్రు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వాళ్లు బీఆర్​ఎస్​కు ఓట్లు వేసి కాంగ్రెస్​ను ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తే.. ఈ పార్లమెంట్​ఎన్నికల్లోనూ బీఆర్​ఎస్​ వాళ్లు బీజేపీకి ఓట్లు వేయడానికి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు” అని ఆయన ఫైర్​ అయ్యారు.