- ఈ ప్రాంత రుణం తీర్చుకుంటా
- కల్వకుర్తి నియోజకవర్గానికి రూ. 309 కోట్లు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
- సీఎం సభ సక్సెస్‌తో కాంగ్రెస్క్యాడర్ ఫుల్ కుష్
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనని, తాను జడ్పీటీసీ నుంచి సీఎంగా ఎదిగినా నల్లమల బిడ్డనేనని, మీ సోదరుడినని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తప్పకుండా రుణం తీర్చుకుంటానని వెల్లడించారు. తొలిసారి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఆదివారం కల్వకుర్తికి విచ్చేశారు. కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా కాంస్య విగ్రహావిష్కరణ, సంస్మరణ సభలో పాల్గొని ప్రసంగించారు.
నాగర్ కర్నూల్/కల్వకుర్తి, వెలుగు: కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి రూ.309 కోట్లు ప్రకటించారు. తాను చదువుకున్న తాండ్ర హైస్కూల్అభివృద్దికి రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అడిగిన వాటికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్సరిపోదని చలోక్తి విసిరారు. కల్వకుర్తిలో 50 పడకల మెటర్నిటీ అండ్ చైల్డ్ (ఎంసీహెచ్) ఆస్పత్రికి రూ.22 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం కోసం ఆమనగల్లో న్యాక్ ఆధ్వర్యంలో రూ.10 కోట్లతో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
అలాగే ఆమనగల్లులో డిగ్రీ, జూనియర్‌కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గంలో ఐదు హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ.15 కోట్లు , రూ.163 కోట్ల వ్యయంతో నాలుగు ఆర్అండ్బీ రహదారుల నిర్మాణం, కల్వకుర్తి పట్టణంలో ఆర్అండ్బీ గెస్ట్ హౌస్నిర్మాణానికి రూ.5 కోట్లు, పంచాయతీ రాజ్ రోడ్లకు రూ.78 కోట్లు, మాడ్గుల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.8.3 కోట్లు, మాడ్గుల మండల కేంద్రంలో భూగర్భ డ్రైనేజీ పనులకు రూ.7.75 కోట్లు, వెల్దండ మండల కేంద్రంలో పాఠశాలల అభివృద్దికి రూ.5 కోట్లు కేటాయిస్తునట్లు ప్రకటించారు.
అన్ని గిరిజన తాండాలకు బీటీ రోడ్డు వసతి కల్పిస్తామని ప్రకటించిన సీఎం.. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ లేన్ రోడ్లు నిర్మిస్తామన్నారు. అలాగే హైదరాబాద్ నుంచి కల్వకుర్తి మీదుగా శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారిని.. కల్వకుర్తి వరకు నాలుగు వరుసల రోడ్డుగా విస్తరించేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి కోరినట్లు తెలిపారు.
విద్య, వైద్యాన్ని నాశనం చేశారు
బహిరంగ సభకు అధ్యక్షత వహించిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ప్రభుత్వ హయాంలో కల్వకుర్తి నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాన్ని పట్టించుకోకుండా పూర్తిగా నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడకల ఆస్పత్రులు ఉంటే కల్వకుర్తిలో మాత్రం 50 పడకలు దాటలేదన్నారు. ఎన్నికల ముందు పనికిమాలిన జీవో ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కల్వకుర్తిలో 100 పడకల ఆస్పత్రితో పాటు కడ్తాల్, -ఆమన్‌గల్ మధ్య ట్రామాకేర్‌సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.
కల్వకుర్తిలో మెడికల్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటు అవసరం ఉందన్నారు. అన్ని మండల కేంద్రాల్లో రెసిడెన్షియల్స్కూల్కాంప్లెక్స్ భవనాలు, ఆమనగల్లులో సబ్‌రిజిస్టార్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని కోరారు. గోకారం, ఇర్విన్ రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు కేఎల్ఐ పథకానికి భూములిచ్చిన రైతులకు దాదాపు రూ.16 కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. భూములు కోల్పోయిన నిరుపేద రైతులు పరిహారం కోసం పదేండ్లుగా తిరుగుతున్నారని చెప్పారు.నల్లమలను టూరిజం హబ్‌గా గుర్తించాలని అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ సీఎంను అభ్యర్థించారు.
నల్లమల అటవీ ప్రాంతం, టైగర్ రిజర్వ్, వన్యప్రాణులు, ప్రకృతి రమణీయ ప్రదేశాలు, జలపాతాలు, లోయలు, గుట్టలతో నల్లమల తెలంగాణకు టూరిస్ట్ డెస్టినేషన్‌గా మారుతుందన్నారు. అరుదైన ఔషధ మొక్కలున్న ఈ ప్రాంతంలో ఆయుర్వేద కాలేజీ, రిసెర్చ్ డెవలప్మెంట్సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నేతలు సీఎంకు నాగలి, వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు.
ఉద్వేగానికి లోనైన జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు
కల్వకుర్తిలోని కొట్ర జంక్షన్‌వద్ద జైపాల్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించి, సంసర్మణ సభలో నివాళులర్పించడంతో జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. రెండు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సీఎం సభకు అంచనాలకు మించి జనాలు రావడంతో కాంగ్రెస్ నాయకులు ఫుల్ఖుష్అయ్యారు. కొట్ర జంక్షన్లో జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్నీ ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన ఆయన కుటుంబ సభ్యులు, తాండ్ర గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి అనుచరుడు కాయితీ సాయి రెడ్డి, యువ నాయకుడు కాయితీ ఆశాదీప్‌రెడ్డి, ఇతర నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో పాటు పలు కార్పోరేషన్ల చైర్మన్లు, సీనియర్ నాయకులు, కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఉన్నతాధికారులు, ఐజీ సత్యనారాయణ, ఎస్పీ గైక్వాడ్ పాల్గొన్నారు.