500 ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ ఎడ్యుకేషన్ : సీఎం రేవంత్​రెడ్డి

500 ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ ఎడ్యుకేషన్ : సీఎం రేవంత్​రెడ్డి
  • పాలన, ప్రజా సేవల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం
  • మైక్రోసాఫ్ట్ కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ వెల్లడి
  • హైదరాబాద్​లో ఏఐ సెంటర్ ఏర్పాటుకుమైక్రోసాఫ్ట్​తో సర్కార్ ఒప్పందం 
  • వివిధ రంగాల్లో ఏఐ వినియోగానికి గూగుల్​తో ఎంవోయూ 
  • వ్యవసాయం, విద్య, రవాణా తదితర రంగాల్లో ఏఐ సేవలు
  • 1.20 లక్షల మందికి ఏఐ శిక్షణనిస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటన 
  • మరో 15 వేల కోట్ల పెట్టుబడులు పెడ్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : భవిష్యత్‌‌ అంతా ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌‌(ఏఐ)దే అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఎడ్యుకేషన్​ను ప్రవేశపెట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కోసం కూడా ఏఐని వినియోగించుకోనున్నట్టు తెలిపారు. హైదరాబాద్​లోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త బిల్డింగ్​ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌‌లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్‌‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించారు. 

మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. మైక్రోసాఫ్ట్ కొత్త ఫెసిలిటీ ప్రారంభోత్సవం ఒక మైలురాయి అని పేర్కొన్నారు. ‘‘మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉంది. మైక్రోసాఫ్ట్ ఇండియా ఇటీవలే 25 ఏండ్లు పూర్తి చేసుకుంది. మైక్రోసాఫ్ట్‌‌ హైదరాబాద్ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్, ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇది యువతకు మరింత సాధికారత కల్పిస్తుంది. 

ఈ పెట్టుబడి మా స్టార్టప్ ఎకో సిస్టమ్‌‌ను బలోపేతం చేయడంతో పాటు మెంటార్షిప్, ఏఐ టూల్స్, గ్లోబల్ నెట్‌‌వర్క్​ను యాక్సెస్‌‌ చేస్తుంది. ఈ కేంద్రం ఏఐ నాలెడ్జ్ హబ్ సహా క్లౌడ్ ఆధారిత ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ లీడర్ షిప్ టీమ్‌‌కు ధన్యవాదాలు. నూతన ఆవిష్కరణలపై మైక్రోసాఫ్ట్​కు ఉన్న నిబద్ధత తెలంగాణ రైజింగ్ విజన్‌‌కు తోడ్పాటునందిస్తుంది” అని అన్నారు. 

గూగుల్ ప్రతినిధులతో భేటీ.. 

రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఏఐని ఉపయోగించుకునేందుకు గూగుల్​తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్​లోని టీ హబ్​లో గూగుల్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “ఏఐ ఆధారిత తెలంగాణ విజన్​కు గూగుల్ సహకారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏఐ టెక్నాలజీతో కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మెరుగైన పాలన, ఆర్థిక పురోగతితో పాటు పబ్లిక్ సర్వీసెస్​ను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాం. ఈ లక్ష్య సాధనలో గూగుల్ తో ఒప్పందం కీలకంగా నిలుస్తుంది’’ అని పేర్కొన్నారు. 

గూగుల్ ఇండియా మేనేజర్ ప్రీతి లోబానా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. కాగా, గూగుల్ ఒప్పందంతో వ్యవసాయం, పరిపాలన, రవాణా, విద్య తదితర కీలక రంగాల్లో ఏఐ ఆధారిత సేవలు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులను సిద్ధం చేసేందుకు సహకారం తీసుకోనుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో డిజిటల్ టీచింగ్ పద్ధతులను ప్రారంభిస్తుంది. రైతులకు అవసరమైన ఇన్పుట్, రెడిట్, మార్కెటింగ్ సదుపాయాలన్నీ అనుసంధానం చేస్తూ తెలంగాణ ఓపెన్ అగ్రికల్చర్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ ను మొదలుపెట్టనుంది. 

15 వేల కోట్లతో సౌలతులు : శ్రీధర్ బాబు  

హైదరాబాద్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం రూ.15 వేల కోట్లతో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మైక్రోసాఫ్ట్ కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. మెట్రో రైలు విస్తరణ, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, మూసీ పునరుజ్జీవం పథకం ద్వారా హైదరాబాద్ సుస్థిరాభివృద్ధికి తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నదని చెప్పారు. ‘‘మైక్రోసాఫ్ట్ కు హైదరాబాద్ తో మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. 

ALSO READ : కృష్ణా జలాల వివాదంపై ట్రిబ్యునల్​లో వాదనలు ఆపం..వాటిని వాయిదా వేసే ప్రసక్తే లేదు : సుప్రీంకోర్టు

తాజాగా 11 లక్షల చదరపు అడుగుల విస్ణీర్ణంలో కొత్త భవనం నిర్మించి తన అంకితభావాన్ని చాటుకుంది. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో భారీ ఏఐ డేటా సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నది. దేశంలోనే హైదరాబాద్ ను అతిపెద్ద డేటా సెంటర్ల హబ్ గా మారుస్తున్నది” అని కొనియాడారు. రాష్ట్రంలోని 90 లక్షల ఇండ్లను డిజిటల్ కనెక్టివిటీలోకి తీసుకొస్తున్నామని తెలిపారు. 

మైక్రోసాఫ్ట్ ఏఐ అకాడమీ.. 

గచ్చిబౌలిలో 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన ప్రమాణాలతో మైక్రోసాఫ్ట్​కొత్త భవనం నిర్మించింది. ఇందులో 2,500 మంది ఉద్యోగులకు సరిపడా సదుపాయాలు ఉన్నాయి. ఈ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 1.20 లక్షల మందికి ఏఐ ట్రైనింగ్ ఇచ్చేందుకు మూడు కొత్త ప్రోగ్రామ్ లను ప్రకటించింది. ‘అడ్వాంట(ఐ)జీ తెలంగాణ’ పేరుతో 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ కోర్సు కోసం అకాడమీ ప్రారంభించనుంది. దీంతో దాదాపు 50 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. 

‘ఏఐ ఇండస్ట్రీ ప్రో’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మంది పరిశ్రమల నిపుణులకు నైపుణ్యాలు నేర్పిస్తుంది. ‘ఏఐ గవర్న్ ఇనిషియేటివ్’ పేరుతో రాష్ట్రంలోని దాదాపు 50 వేల మంది ప్రభుత్వ అధికారులకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ప్రొడక్టివిటీ వంటి కీలకమైన రంగాల్లో శిక్షణ ఇస్తుంది. రాబోయే సంవత్సరాల్లో వీటికి అదనంగా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. దీంతో హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ కు అతిపెద్ద డేటా హబ్‌‌‌‌‌‌‌‌ గా మారనుంది.