- మరో ఏడాదిలోగామాస్టర్ ప్లాన్ 2050
- బిల్డర్లునేతలుగా మారితేప్రత్యర్థులుగానే చూడాల్సి వస్తది
- రీ ఇమాజినింగ్కార్యక్రమంలో సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ 4.0 అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరో ఏడాదిలోగా మాస్టర్ ప్లాన్ 2050ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. బిల్డర్లు రాజకీయ నాయకులుగా మారితే.. తాము వారిని ప్రత్యర్థులుగానే చూడాల్సి వస్తుందని, వ్యాపారాలు మాత్రమే చేస్తే ప్రభుత్వం వారికి సహకరిస్తుందని స్పష్టం చేశారు. గురువారం క్రెడాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రీ ఇమాజినింగ్ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. పాలకులు, ప్రభుత్వాలు మారినా.. చారిత్రక హైదరాబాద్ నగర అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలను కొనసాగించారన్నారు. అందుకే ప్రపంచంలోనే హైదరాబాద్ నగరానికి గుర్తింపు వచ్చిందన్నారు.
ఫార్మా రంగంలో హైదరాబాద్.. దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. 1965లో పాలకులు తీసుకున్న నిర్ణయాల ఫలితాలను మనం ఇప్పుడు అనుభవిస్తున్నామన్నారు. స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన ప్రాంతం బ్యాగరి కంచె అని అన్నారు. ఆ పేరు పలకడానికి కొందరు ఇబ్బంది పడొచ్చు అన్నారు. కానీ ఒకప్పుడు బంజారా హిల్స్ ను కూడా అలాగే అనుకునేవారని తెలిపారు. మరో నాలుగైదేళ్లలో బ్యాగరి కంచె గురించి గొప్పగా చెప్పుకునే స్థాయికి అభివృద్ధి చేస్తామన్నారు. మూసీ రివర్ డెవలప్ మెంట్ తో పెట్టుబడులంటే హైదరాబాద్ గుర్తొచ్చేలా చేస్తామన్నారు.
సర్ఫేస్, ఎలివేటెడ్ కారిడార్లతో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మూసీలో కలుషితం లేని నీటి ప్రవాహం ఉండేలా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో ఉందన్నారు. కొందరితో సిద్ధాంతపరంగా విభేదాలున్నా.. తెలంగాణ అభివృద్ధి విషయంలో తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, క్రెడాయ్ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.