హైదరాబాద్, వెలుగు : చేనేత, పవర్లూమ్ కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.168 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని అమలుచేస్తున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందనేందుకు ఇది ఉదాహరణ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకానికి ఆమోదం తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకంతో నేతన్న పొదుపు (పొదుపు నిధి), నేతన్న భద్రత (నేతన్న బీమా), నేతన్న భరోసా అమలు చేయనున్నట్టు చెప్పారు.
నేతన్న పొదుపు కోసం బడ్జెట్లో రూ.115 కోట్లు, నేతన్న భద్రత కోసం రూ.9 కోట్లు, నేతన్న భరోసా పథకానికి రూ.44 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. నేతన్న పొదుపు (పొదుపు నిధి) ద్వారా చేనేత కార్మికులు తమ వాటా 8 శాతం పొదుపు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం 16 శాతం వాటా జమ చేస్తుందని, దీని ద్వారా దాదాపు 38 వేల మంది చేనేత కార్మికులు లబ్ధిపొందుతారని చెప్పారు. పవర్ లూమ్ కార్మికులు 8 శాతం పొదుపు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం 8 శాతం వాటా జమ చేస్తుందని.. దీని ద్వారా దాదాపు 15 వేల మంది పవర్ లూమ్ కార్మికులు లబ్ధి పొందుతారని తెలిపారు. నేతన్న భద్రత (నేతన్న బీమా) ద్వారా చేనేత, పవర్ లూమ్ కార్మికులు, అనుబంధ కార్మికులకు జీవిత బీమా అందిస్తున్నట్టు చెప్పారు.
నమోదు చేసుకున్న నేత కార్మికులు ఏ కారణంతోనైనా మరణిస్తే, ఆ కార్మికుడు పేర్కొన్న నామినీకి రూ.5 లక్షలు పరిహారం అందుతుందని తెలిపారు. నేతన్నకు భరోసాతో చేనేత కార్మికులు తెలంగాణ మార్క్ లేబుల్ ను ఉపయోగించి తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు, పని ఆధారంగా ఒక ఏడాదికి ఒక్కొక్క చేనేత కార్మికునికి రూ.18 వేల వరకు, అనుబంధ కార్మికునికి రూ.6 వేల వరకు మంజూరు చేయనున్నట్టు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే చేనేత రంగానికి రూ. 874 కోట్లు విడుదల చేసామన్నారు. ఇందులో గత ప్రభుత్వం బకాయి పెట్టినవే రూ.465 కోట్లు ఉన్నాయని గుర్తుచేశారు.