తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికే ఇవ్వాలి : రేవంత్ రెడ్డి

తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికే ఇవ్వాలి : రేవంత్ రెడ్డి
  •    విభజన హామీలు అమలు చేయాలి
  •    స్టీల్ ప్లాంట్​, కోచ్​ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ కావాలి
  •     ప్రధాని మోదీకి సీఎం రేవంత్​రెడ్డి విజ్ఞప్తి
  •     ఐఐఎం ఇవ్వండి.. అందుకు హెచ్​సీయూలో సరిపడా ల్యాండ్​ ఉంది
  •     అదీ కాదంటే ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతంలోనూ భూమిని చూపిస్తం
  •     24 నవోదయ విద్యాలయాలు, 25 లక్షల ఇండ్లు కేటాయించండి
  •     ఆర్ఆర్ఆర్ సౌత్ పార్ట్​ను జాతీయ రహదారిగా గుర్తించాలి
  •     2,450 ఎకరాల రక్షణ భూములు బదలాయించాలని విన్నపం
  •     ప్రధానితో గంటపాటు భేటీ అయిన సీఎం.. పాల్గొన్న డిప్యూటీ సీఎం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బొగ్గు గ‌‌నుల‌‌ను సింగ‌‌రేణికే కేటాయించాల‌‌ని, ప్రస్తుతం వేలంలో పెట్టిన  శ్రావ‌‌ణప‌‌ల్లి బొగ్గు బ్లాక్‌‌ను వేలం జాబితా నుంచి తొల‌‌గించాల‌‌ని ప్రధాని న‌‌రేంద్ర మోదీకి సీఎం  రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గనులు, ఖ‌‌నిజాభివృద్ధి నియంత్రణ చ‌‌ట్టంలోని (ఎంఎండీఆర్‌‌) సెక్షన్ 11ఏ/17 (ఏ) (2) ప్రకారం వేలం జాబితా నుంచి శ్రావ‌‌ణ‌‌ప‌‌ల్లి గ‌‌నిని తొల‌‌గించి, అదే సెక్షన్ ప్రకారం గోదావ‌‌రి లోయ‌‌ బొగ్గు నిల్వల క్షేత్రం ప‌‌రిధిలోని కోయ‌‌గూడెం, స‌‌త్తుప‌‌ల్లి బ్లాక్ 3 గ‌‌నుల‌‌నూ సింగ‌‌రేణికే కేటాయించాల‌‌ని ఆయన కోరారు. రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల అవ‌‌స‌‌రాలు తీర్చేందుకు ఈ గ‌‌నుల కేటాయింపు కీల‌‌కమని, అందువల్ల సింగరేణికే ఇవ్వడం అన్ని విధాలా ప్రయోజనమని ప్రధానికి సీఎం వివరించారు.

ఢిల్లీలో గురువారం ప్రధాని మోదీని ఆయ‌‌‌‌న నివాసంలో సీఎం రేవంత్​రెడ్డి కలిశారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.  ప్రధానితో సుమారు గంట పాటు సమావేశమై..  బొగ్గు గ‌‌‌‌నుల కేటాయింపు, విభ‌‌‌‌జ‌‌‌‌న చ‌‌‌‌ట్టంలోని అంశాలు, రక్షణ భూముల బదలాయింపు, నేషనల్ హైవేల గురించి చర్చించారు. 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్, బెంగళూరుకు ఐటీఐఆర్​లను కేటాయించిందని.. హైదరాబాద్​లో 3 క్లస్టర్లలో భూమిని గుర్తించగా,  2014 తర్వాత ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదని ప్రధానికి సీఎం వివరించారు. హైదరాబాద్ కు ఐటీఐఆర్​ను పునరుద్ధరించాలని కోరారు. 

ఐఐఎం మంజూరు చేయాలి

ప్రతి రాష్ట్రంలో ఐఐఎంను స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయంగా తీసుకున్నప్పటికీ ఇప్పటివరకు తెలంగాణకు ఐఐఎం మంజూరు కాలేద‌‌‌‌ని ప్రధాని మోదీకి సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. వెంట‌‌‌‌నే హైద‌‌‌‌రాబాద్‌‌‌‌లో ఐఐఎం మంజూరు చేయాలని, ఇందుకోసం హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీ (హెచ్​సీయూ) క్యాంపస్‌‌‌‌లో సరిపడా భూమి అందుబాటులో ఉంద‌‌‌‌ని అన్నారు. సెంట్రల్ యూనివ‌‌‌‌ర్సిటీలో కాకుండా మ‌‌‌‌రెక్కడైనా ఐఐఎం ఏర్పాటు చేస్తామ‌‌‌‌న్నా ప్రత్యామ్నాయంగా భూ కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌‌‌‌ని స్పష్టం చేశారు.  తెలంగాణలో కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని, రాష్ట్రానికి 24 నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

కాజీపేట కోచ్​ ఫ్యాక్టరీ ఇవ్వాలి

విభజన సమయంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విష‌‌‌‌యాన్ని ప్రధానికి సీఎం గుర్తుచేశారు. కోచ్ తయారీ కేంద్రానికి బ‌‌‌‌దులు కాజీపేటలో పీరియాడికల్ ఓవరోలింగ్ వర్క్ షాప్ ను  ఏర్పాటు చేస్తున్నట్లు 2023 జులైలో రైల్వే మంత్రిత్వ శాఖ  ప్రకటించిందని, దేశంలోని ఇతర ప్రాంతాలకు కోచ్ ఫ్యాక్టరీలు మంజూరు చేసిన రైల్వే శాఖ కాజీపేటలో మాత్రం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం సాధ్యం కాదనడం సరికాదన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని ప్రధాన‌‌‌‌మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్​లో తెలంగాణను చేర్చాల‌‌‌‌న్నారు. 

బీఆర్​జీఎఫ్​ కింద రూ.1,800 కోట్లు ఇవ్వండి

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్ జీఎఫ్ఈ) కింద కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు ఐదేండ్లలో తెలంగాణ‌‌‌‌కు  రూ.2,250 కోట్లు కేటాయించింద‌‌‌‌ని, ఒక్కో ఏడాదికి రూ.450 కోట్ల చొప్పున ఈ గ్రాంట్ మంజూరు చేశార‌‌‌‌ని ప్రధానికి సీఎం తెలిపారు. 2019–-20, 2021–-22, 2022-–23, 2023-–24 సంవత్సరాలకు సంబంధించి బీఆర్‌‌‌‌జీఎఫ్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.1,800 కోట్లు విడుదల చేయాలని ఆయన కోరారు.

రక్షణ శాఖ భూములను బదలాయించాలి

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌‌‌‌లో పెరిగిన ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్- – కరీంనగర్ రహదారి, హైదరాబాద్- – నాగ్‌‌‌‌పూర్ ర‌‌‌‌హ‌‌‌‌దారి (ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌-44)పై ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించాల‌‌‌‌ని నిర్ణయించిన‌‌‌‌ట్లు  ప్రధానికి సీఎం తెలియజేశారు. ఆ రెండు కారిడార్ల నిర్మాణానికి అడ్డంకి లేకుండా మార్గమధ్యంలో రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బ‌‌‌‌దిలీ చేయాల‌‌‌‌ని కోరారు.  ఆ కారిడార్లతో పాటు హైదరాబాద్​లో రహదారుల విస్తరణ, రవాణా, ఇత‌‌‌‌ర‌‌‌‌ మౌలిక సదుపాయాల కల్పనకు రక్షణ శాఖ పరిధిలోని 2,450 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలన్నారు. ఆ భూములకు ప్రత్యామ్నాయంగా రావిరాల ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్ ఇమరాత్ (ఆర్​ఐసీ )కి లీజుకు ఇచ్చిన 2,462 ఎకరాల భూములను పూర్తిగా కేంద్రానికి అప్పగించేందుకు త‌‌‌‌మ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంద‌‌‌‌ని ఆయన చెప్పారు.

ఆర్​ఆర్​ఆర్  నిర్మాణం స్పీడప్​ చేయండి

భారత్‌‌‌‌మాల పరియోజన మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్‌‌‌‌) ఉత్తర భాగంలో (సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు) జాతీయ రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపింద‌‌‌‌ని  ప్రధానికి సీఎం తెలిపారు.  ఆ ర‌‌‌‌హ‌‌‌‌దారి నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ వ్యయంలో 50 శాతం ఖర్చును ఇవ్వడంతో పాటు రహదారి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌‌‌‌న్నారు. ఈ ర‌‌‌‌హ‌‌‌‌దారులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వీలైనంత తొందరగా చేపట్టాలని ఆయన కోరారు. 

హైదరాబాద్ చుట్టూ జాతీయ రహదారుల అభివృద్ధికి అత్యంత ఉప‌‌‌‌యోగంగా ఉండే ఆర్ఆర్ఆర్ సౌత్ పార్ట్ ను(చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు) వెంట‌‌‌‌నే జాతీయ రహదారిగా గుర్తించి, భారత్ మాల పరియోజనలో దాని నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని ప్రధాన పట్టణాలు, పుణ్య క్షేత్రాలకు పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌‌‌‌గ్రేడ్ చేయాల‌‌‌‌ని కోరారు. 

జగిత్యాల – -పెద్దపల్లి – -కాటారం, దిండి – -దేవరకొండ – -మల్లెపల్లి-– నల్గొండ, భువనగిరి-– చిట్యాల, చౌటుప్పల్  – అమన్‌‌‌‌గల్- – షాద్ న‌‌‌‌గ‌‌‌‌ర్‌‌‌‌– -సంగారెడ్డి, మరికల్-– నారాయణపేట – రామసముద్ర, వనపర్తి –- కొత్తకోట- – గద్వాల – మంత్రాలయం, మన్నెగూడ- – వికారాబాద్- – తాండూరు – -జహీరాబాద్ – -బీదర్, కరీంనగర్ – -సిరిసిల్ల – కామారెడ్డి – -ఎల్లారెడ్డి – -పిట్లం, ఎర్రవల్లి ఎక్స్ రోడ్డు- – గద్వాల – -రాయచూరు, కొత్తపల్లి- –  హుస్నాబాద్- – జనగాం-– హైదరాబాద్, సారపాక- – ఏటూరు నాగారం, దుద్దెడ- – కొమురవెల్లి- – యాదగిరిగుట్ట  – రాయగిరి క్రాస్ రోడ్డు, జగ్గయ్యపేట- – వైరా – -కొత్తగూడెం రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్​రెడ్డి విన్నవించారు. 

25 లక్షల ఇండ్లు కావాలి

పీఎం ఆవాస్ యోజన(పీఎంఏవై)లో తొలి దశలో తెలంగాణ రాష్ట్రానికి తక్కువ ఇండ్లు మంజూర‌‌‌‌య్యాయ‌‌‌‌ని ప్రధానికి సీఎం తెలిపారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పీఎంఏవై మార్గదర్శకాలకు తగ్గట్టు లేకపోవడంతో తక్కువ ఇండ్లు మంజూర‌‌‌‌య్యాయ‌‌‌‌ని చెప్పారు. 2024-25 నుంచి ప్రారంభమవుతున్న పీఎంఏవై పథకంలో 3 కోట్ల గృహాలను లక్ష్యంగా ఎంచుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింద‌‌‌‌ని, అందులో తెలంగాణకు 25 లక్షల ఇండ్లు మంజూరు చేయాల‌‌‌‌న్నారు. పీఎంఏవై మార్గదర్శకాలకు తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల నిర్మాణాల విధివిధానాలను రూపొందించేందుకు సిద్ధంగా ఉంద‌‌‌‌ని ప్రధాని దృష్టికి తెచ్చారు. 

బయ్యారంలో ఉక్కు క‌‌‌‌ర్మాగారం కావాలి

విభజన చట్టం ప్రకారం తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింద‌‌‌‌ని,  స్టీల్​ ప్లాంట్​ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే సాధ్యాసాధ్యాల నివేదికలు సమర్పించాయ‌‌‌‌ని సీఎం అన్నారు. వెంట‌‌‌‌నే ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పి ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధానికి ఆయన విజ్ఞప్తి చేశారు.