పన్ను ఆదాయంలో సగం ఇవ్వండి.. సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్‌కు సీఎం, డిప్యూటీ సీఎం రిక్వెస్ట్

పన్ను ఆదాయంలో సగం ఇవ్వండి.. సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్‌కు సీఎం, డిప్యూటీ సీఎం రిక్వెస్ట్
  • తెలంగాణకు రుణభారమే పెద్ద సవాల్
  • గత ప్రభుత్వం రూ.6.85 లక్షల కోట్ల అప్పు చేసింది
  • సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంది
  • రైతు భరోసా, రుణమాపీ జీవరేఖలాంటివి
  • రుణాలు రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలి
  • సెస్, సర్ చార్జిల్లో రాష్ట్రాలకు వాటా కావాలి
  • కేంద్రం కేటాయింపులు, రాష్ట్ర అవసరాలపై చర్చ

హైదరాబాద్: పన్ను ఆదాయంలో రాష్ట్రానికి సగం వాటా ఇవ్వాలని కేంద్ర ఆర్థిక సంఘాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమని, దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. అయితే భారీ రుణభారం సవాలుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ మహత్మా జ్యోతిబాఫూలే ప్రజాభవన్ లో  సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ తో సీఎం భేటీ అయ్యారు.  రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ.. సంపద, ఆదాయం మధ్య పెద్ద అంతరం ఉందన్నారు. తెలంగాణకు గత ప్రభుత్వం చేసిన అప్పులే పెద్ద సవాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.  

గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తెలంగాణ రుణ భారం రూ.6.85 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించడం భారంగా మారిందని చెప్పారు. రుణాన్ని రీ స్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలని, అదనపు ఆర్ధిక సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.  కేంద్ర పన్నుల్లో  రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41% నుంచి 50%కి పెంచాలని కోరారు.  రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉందని తెలిపారు. 

రైతుభరోసా, రైతు రుణమాఫీ తెలంగాణకు జీవరేఖ వంటివని అన్నారు. సెస్, సర్ చార్జిల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని అన్నారు.  అన్ని రాష్ట్రాల తరపున  ఈ డిమాండ్‌ను కమిషన్ ముందు ఉంచుతున్నట్టు చెప్పారు. ఈ డిమాండ్ ను నెరవేర్చితే.. దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ  ఎంచుకున్న లక్ష్య సాధనకు  మేం సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పారు. 

తెలంగాణను మేం ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని అన్నారు.  సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్,  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహారులు కేకే, షబ్బీర్ అలీ, సీఎస్ శాంతి కుమారి, అధికారులు పాల్గొన్నారు.